ముందస్తు ఉండదు.. టైంకే అసెంబ్లీ ఎలక్షన్స్ : ఎంపీ అర్వింద్​

ముందస్తు ఉండదు.. టైంకే అసెంబ్లీ ఎలక్షన్స్ :  ఎంపీ అర్వింద్​

మెదక్, వెలుగు : కేసీఆర్​ పిరికి మనిషని, ముందస్తు ఎన్నికలకు వెళ్లడని నిజామాబాద్ ఎంపీ, మెదక్ అసెంబ్లీ పాలక్ ధర్మపురి అర్వింద్​అన్నారు. రాష్ట్రంలో టైంకే ఎన్నికలు జరుగుతాయన్నారు. ఒకవేళ ప్రభుత్వాన్ని రద్దు చేస్తే తమకు సంతోషమేనన్నారు. తెల్లారే రాష్ట్రంలో ప్రెసిడెంట్ రూల్ వస్తుందని, పోలీస్​పవర్ ఆయన చేతుల్లో నుంచి పోతుందన్నారు. గురువారం మెదక్ లో జరిగిన బీజేపీ శక్తి కేంద్ర ఇన్​చార్జిల సమావేశానికి ఎంపీ హాజరయ్యారు. అనంతరం ప్రెస్ మీట్​లో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో టీఆర్ఎస్​గెలిచే పరిస్థితి లేదన్నారు. బీఆర్ఎస్ పెట్టడం వల్ల తమకేం ఇబ్బంది లేదన్నారు. అంతర్జాతీయ పార్టీ, అంతరిక్ష పార్టీ పెట్టినా తమకు అభ్యంతరం లేదన్నారు.

కాంగ్రెస్ సీజనల్ పార్టీ అని, ఎన్నికలపుడే ఆ పార్టీకి ప్రజలు గుర్తుకు వస్తారన్నారు. రాష్ట్రంలో బీజేపీ బలంగా తయారైందని, పార్టీ కోసం పని చేస్తూ, పార్టీ కార్యక్రమాలు విజయవంతం చేస్తూ, ప్రజల మధ్య ఉంటున్న వారికే వచ్చే ఎన్నికల్లో బీజేపీ టికెట్లు దక్కుతాయన్నారు. పార్టీ కోసం పనిచేస్తూ ఎన్నికల్లో టికెట్​ రానివారికి ప్రభుత్వ పదవుల్లో, కౌన్సిల్ లో అవకాశాలు ఉంటాయని చెప్పారు. బూత్​ స్థాయి నుంచి పార్టీని పటిష్టం చేయాలని, ప్రతి ఇంటికి వెళ్లి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను, టీఆర్ఎస్​ప్రభుత్వ వైఫల్యాలను వివరించాలని సూచించారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, జిల్లా ఇన్​చార్జి మల్లారెడ్డి, నాయకులు తాళ్లపల్లి రాజశేఖర్, జనార్థన్​రెడ్డి, విజయ్, ప్రసాద్, వీణ  పాల్గొన్నారు.