ఓటర్ లిస్ట్లో లోపాలు సరి చేస్తాం : కలెక్టర్ ఇలా త్రిపాఠి

ఓటర్ లిస్ట్లో లోపాలు సరి చేస్తాం : కలెక్టర్ ఇలా త్రిపాఠి
  •     కలెక్టర్ ఇలా త్రిపాఠి

నిజామాబాద్,  వెలుగు : మున్సిపాలిటీల ముసాయిదా ఓటర్​ లిస్ట్​లో ఉన్న లోపాలను తమ దృష్టికి తీసుకొస్తే సరి చేసి, ఈ నెల 10న ఫైనల్ లిస్ట్​ను రిలీజ్​చేస్తామని కలెక్టర్ ఇలా త్రిపాఠి పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్​లో ఆయా పొలిటికల్ పార్టీల లీడర్లతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్​ మాట్లాడారు. కుటుంబ సభ్యుల ఓట్లన్నీ ఓకే వార్డులో నమోదయ్యేలా చూస్తామన్నారు. మృతి చెందిన ఓటర్లు,  రెండు చోట్ల ఉన్న ఓట్ల వివరాలు తెలిపితే తొలగిస్తామన్నారు. 

లోపాలులేని ఓటర్​ లిస్ట్ కోసం పొలిటికల్ లీడర్లు సహకరించాలన్నారు.  ఇది వరకు ప్రకటించిన వార్డులు, డివిజన్లను మార్చుతామని స్పష్టం చేశారు. ప్రహరీలు లేని పోలింగ్ సెంటర్లను మరోచోటకు మార్చుతామని పేర్కొన్నారు. అడిషనల్ కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిగ్యాన్ మాల్వియా, నగర పాలక కమిషనర్​ దిలీప్​కుమార్, ఆర్డీవో రాజేంద్రకుమార్, ఆయా పార్టీల నేతలు ఉన్నారు. 

బోగస్ ఓటర్లు ఉండొద్దు..

ఎన్నికల కమిషన్​ నిబంధనల ప్రకారం స్పెషల్ ఇంటెన్సివ్​ రివిజన్ పూర్తి చేయాలని కలెక్టర్​ ఇలా త్రిపాఠి సూచించారు. కలెక్టరేట్​లో ఏఈఆర్​వో, బీఎల్​వో, సూపర్​వైజర్లతో మీటింగ్​ నిర్వహించి మాట్లాడారు. పోలింగ్ సెంటర్ వారీగా బీఎల్​వోలు పక్కా మ్యాపింగ్ చేయాలని, బోగస్​ ఓట్లు తొలగించాలని, అర్హుల పేర్లు లిస్టులో ఉండేలా పరిశీలన చేయాలన్నారు. 

ప్రలోభాలు, ఒత్తిళ్లకు లొంగవద్దన్నారు. ఓటర్​ లిస్ట్​పై వచ్చే ఫిర్యాదులకు బీఎల్​వో, సూపర్​వైజర్లను బాధ్యులను చేస్తామని చెప్పారు. ఎన్నికల విధులు అందరూ సమర్థవంతగా నిర్వహించాలని సూచించారు.