రుద్రూర్  సొసైటీలో అవినీతి బాగోతం.. రూ.15 లక్షల సిబ్బంది పీఎఫ్  డబ్బులు మాయం

రుద్రూర్  సొసైటీలో అవినీతి బాగోతం.. రూ.15 లక్షల సిబ్బంది పీఎఫ్  డబ్బులు మాయం
  • మహాజనసభలో అధికారుల నిలదీత    
  • చనిపోయిన రైతుల పేర్లపై రుణాలు

వర్ని, వెలుగు: నిజామాబాద్​ జిల్లా రుద్రూర్  సహకార సంఘంలో మంగళవారం నిర్వహించిన మహాజనసభ రసాభాసగా మారింది. అసిస్టెంట్​ రిజిస్ట్రార్, రుద్రూర్​ పీఏసీఎస్​ పర్సనల్​ ఇన్​చార్జి అంబర్​సింగ్​ అధ్యక్షతన ప్రారంభమైన మహాజనసభలో సభ్యులు పలు  అంశాలపై నిలదీశారు. సొసైటీలో జరుగుతున్న అవకతవకలపై ప్రశ్నించారు.

సభ్యులు, రైతులు అధికారిని నిలదీయడంతో సభలో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. రైతులు తీసుకునే స్వల్ప, దీర్ఘకాలిక రుణాల్లో భారీ అవినీతి చోటుచేసుకుందని దీనికి బాధ్యుడైన సెక్రటరీ లక్ష్మణ్ ను రప్పించాలని సభ్యులు డిమాండ్​ చేశారు. రుణాలు పూర్తిగా చెల్లించినా ఆన్​లైన్‌‌లో బాకీ చూపిస్తోందని, చనిపోయిన రైతుల పేర్లపై రుణాలు తీసుకున్నట్లు చూపుతున్నారని పలువురు సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.

రికార్డులు సక్రమంగా నిర్వహించడం లేదని, ఖర్చుల చెల్లింపుల లెక్కలు అస్తవ్యస్తంగా ఉన్నాయని మండిపడ్డారు. నాలుగేండ్లకు సంబంధించిన వడ్ల కొనుగోలు రికార్డులు గల్లంతైనట్లు సిబ్బంది చెప్పగా, కమీషన్  వివరాలు కూడా అందుబాటులో లేవని సెక్రటరీ చెప్పడంపై ఆరోపణలు వస్తున్నాయి. సొసైటీలో పని చేస్తున్న తమ జీతంలో పీఎఫ్  డబ్బులు కట్ చేసినప్పటికీ, ఖాతాల్లో జమ కాలేదని రూ.15 లక్షల వరకు డబ్బులు మాయమైనట్లు సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు.

సెక్రటరీ ద్వారా ఈ డబ్బులు రికవరీ చేయాలని సభ్యులు డిమాండ్​ చేశారు. సొసైటీలో పని చేసి చనిపోయిన కంప్యూటర్  ఆపరేటర్  పార్వతి ఖాతాలో పీఎఫ్​ డబ్బులు  జమ కాకపోవడంతో, ఆమె ఫ్యామిలీకి నష్టం జరిగిందని, దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు.

సొసైటీలో జరుగుతున్న అవినీతి, అక్రమాలకు అసిస్టెంట్  రిజిస్ట్రార్  స్థాయి అధికారే కారణమని సభ్యులు ఆరోపించారు. అవకతవకలపై సమాధానం చెప్పాలని డిమాండ్​ చేయగా, తనకేమీ తెలియదని సొసైటీ ఇన్​చార్జి చెప్పడంతో  సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత పాలకవర్గ సభ్యులు, మాజీ సెక్రటరీ లేకుండా సమావేశం ఎలా నిర్వహిస్తారని సభ్యులు ప్రశ్నించారు.