బాలికపై అత్యాచారం కేసులో.. నిందితుడికి రెండు జీవిత ఖైదుల శిక్ష

బాలికపై  అత్యాచారం కేసులో..  నిందితుడికి రెండు జీవిత ఖైదుల శిక్ష

నిజామాబాద్ క్రైం, వెలుగు:  ఐదేండ్ల బాలికపై అత్యాచారం చేసి ఆమె మరణానికి కారకుడైన వ్యక్తికి రెండు జీవిత ఖైదుల శిక్ష విధిస్తూ నిజామాబాద్​ జిల్లా సెషన్స్ కోర్టు, ఇన్​చార్జి పోక్సో కోర్టు జడ్జి సునీత కుంచాల శనివారం తీర్పు వెలువరించారు.   వివరాలిలా ఉన్నాయి.. 2022 అక్టోబర్ 20న డిచ్ పల్లి మండల ధర్మారంలో వ్యవసాయ పొలంలో పనిచేసే  మహిళ కూతురు అనుమానాస్పదంగా చనిపోయింది.  బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో  డిచ్ పల్లి పోలీసులు కేసు నమోదు చేసి కామారెడ్డి జిల్లా పెద్ద ఎక్లారా గ్రామానికి చెందిన దేవకత్తె గోవింద్ రావు అనే వ్యక్తిని విచారించారు. అతడే బాలిక పై అత్యాచారం చేసి బాలిక మరణానికి కారకుడైనట్లు గుర్తించి కేసు నమోదు చేసి రిమాండ్ తరలించారు.  

దేవకత్తె గోవింద్ రావు ఉపాధి కోసం హైదరాబాద్ వెళ్లినప్పుడు అతడికి డిచ్ పల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన వివాహిత పరిచయమైంది. అతడికి వివాహమై కొడుకు ఉండగా, సదరు మహిళకు కూడా వివాహమై ఇద్దరు పిల్లలు,  భర్త ఉన్నారు.  సదరు వివాహితతో గోవింద్ రావుకు  వివాహేతర సంబంధం ఏర్పరుచుకున్నాడు. దాంతో వారు ఇద్దరు పిల్లలతో కలిసి డిచ్ పల్లి మండలం ధర్మారానికి ఉపాధి కోసం వలస వచ్చారు. అక్కడ పనిచేస్తూ పెళ్లి చేసుకున్నారు.  తమకు అడ్డుగా ఉందని భావించిన గోవిందరావు బాలికను వదిలించుకోవాలనుకున్నాడు.  బాలికను వైద్యం చేయిస్తానని చెప్పి పక్కన ఉన్న ఓ గ్రామానికి తీసుకెళ్లాడు.  అక్కడ వైద్యం చేసుకుని తిరిగి వస్తున్న టైంలో వ్యవసాయ  పొలాల వద్ద అత్యాచారం చేయడంతో ఆమె చనిపోయింది.