హైవే విస్తరణకు బ్రేక్.. అసంపూర్తి పనులతో ప్రజల ఇబ్బందులు

హైవే విస్తరణకు బ్రేక్.. అసంపూర్తి పనులతో ప్రజల ఇబ్బందులు
  • అభ్యంతరం చెప్పిన ఫారెస్ట్ డిపార్ట్ మెంట్
  • అసంపూర్తి పనులతో ప్రజల ఇబ్బందులు

నస్పూర్​/కోల్​బెల్ట్​,వెలుగు: నిజామాబాద్ జగ్ధల్​పూర్​(చత్తీస్​గఢ్​) నేషనల్​ హైవే 63 రోడ్డు  విస్తరణ పనులు ఉన్నట్టుండి ఆగిపోయాయి. అటవీ శాఖ నుంచి అనుమతులు లేకుండా రోడ్డు విస్తరణ పనులు చేపట్టారని  ఫారెస్ట్​ అధికారులు  అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో   రోడ్డు విస్తరణ కోసం  ఏడు నెలల నుంచి హైవే అధికారులు తవ్విన కందకాలను హడావుడిగా పూడ్చేశారు. పనులు పరిశీలించి అనుమతులు ఇవ్వాల్సిన ఫారెస్ట్ అధికారులు అటువైపు చూడడం లేదు. దీంతో రోడ్డు విస్తరణ పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

ఏడు నెలలు అవస్థలు…

మంచిర్యాల శివారు నస్పూర్​-జైపూర్​ మండలం రసూల్​పల్లి మధ్య 9.8 కి.మీ  రోడ్డు  విస్తరించి, సెంట్రల్​ లైటింగ్​ ఏర్పాటు చేయడానికి  రూ.55.50 కోట్ల డీఎంఎఫ్​టీ ఫండ్స్ ను కేటాయించారు. ఈ నిధులతో ఇరువైపు 66 ఫీట్లతో  ఫోర్​లేన్​ రోడ్డు, మధ్యలో 15 మీటర్ల వెడల్పుతో డివైడర్​,  సెంట్రల్​ లైటింగ్, 18 చోట్ల జంక్షన్ల ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ పనులను 15 నెలల్లో పూర్తి చేయాలని అధికారులు అనుకున్నారు. ఈ పనుల్లో భాగంగా  శ్రీరాంపూర్​ సింగరేణి ఓపెన్​కాస్ట్​ గనికి వెళ్లే రహదారి నుంచి అరుణక్క నగర్, ​ జీఎం ఆఫీస్​ వరకు దాదాపు 2 కి.మీ దాకా  రోడ్డుకు ఒకసైడ్​ఆరు అడుగుల వెడల్పుతో నాలుగు అడుగుల లోతు కందకాలు తవ్వారు.  అయితే ఈ పనులకు అటవీ శాఖ నుంచి అనుమతి లేదని ఆ శాఖ అధికారులు అభ్యంతరం చెప్పారు.  రోడ్డు విస్తరణ కోసం కందకాలు తవ్వడంపై అడ్డుచెప్పారు. హైవే ఆఫీసర్లు  పనులు నిలిపివేశారు.  

ఆఫీసర్లు వస్తున్నారని పూడ్చారు

పర్మిషన్​ లేకుండా చేపట్టిన హైవే 63 రోడ్డు   విస్తరణ పనులను చూసేందుకు    చెన్నై నుంచి అటవీశాఖ  టీమ్​ వస్తుందన్న  సమాచారంతో  హైవే ఆఫీసర్లు తవ్విన కందకాలను హడావుడిగా పూడ్చేశారు. రహదారి విస్తరణ  పర్మిషన్​ లేదనే సాకుతో 4 కి.మీ పొడవున  పనులకు బ్రేక్​ వేశారు. 

అధికారుల తీరుపై విమర్శలు.. 

శ్రీరాంపూర్​  ఓసీపీ రహదారి నుంచి సింగరేణి జీఎం ఆఫీస్​, ఇందారం క్రాస్​ వరకు సింగరేణి బొగ్గు గనులకు సంబంధించిన పనులు సాగుతుంటాయి. 
ఇందుకు అటవీశాఖ నుంచి పర్మిషన్లు తీసుకుంటూ బొగ్గు ఉత్పత్తి ప్రక్రియ చేస్తున్నారు.  ఇక్కడే నేషనల్​ హైవే ఉంది.   అటవీశాఖ నుంచి పర్మిషన్​ తీసుకోకుండా  హైవే ఆఫీసర్లు కందకాల పనులు చేపట్టి పూడ్చివేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం అవుతోంది.  ఎమ్మెల్యేలు,  అధికార పార్టీ లీడర్లు,  అటవీశాఖ మంత్రి ఎందుకు చొరవచూపడంలేదని ప్రశ్నిస్తున్నారు.  

పర్మిషన్​ ఇచ్చిన తర్వాత విస్తరణ పనులు

చెన్నైకు సంబంధించిన అటవీశాఖ ఆఫీసర్లు వచ్చి రోడ్డు విస్తరణ పనులు పరిశీలించిన తర్వాత వారిచ్చే  పర్మిషన్​ ఆధారంగా మళ్లీ  పనులు చేపడుతాం. - అన్నయ్య, డీఈ,  నేషనల్​ హైవే