
హైదరాబాద్ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 46 మిలియన్ టన్నుల ఐరన్ ఓర్ ఉత్పత్తిని సాధించాలని టార్గెట్‌గా పెట్టుకున్నట్లు ప్రభుత్వరంగ మైనర్ ఎన్‌ఎండిసి లిమిటెడ్ ప్రకటించింది. పోయిన ఏడాదితో పోలిస్తే ఇది10 శాతం ఎక్కువని కంపెనీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సుమిత్ దేవ్ తెలిపారు. ఎన్ఎండీసీ ఇదివరకటి ఆర్థిక సంవత్సరంలో 25,882 కోట్ల రూపాయల టర్నోవర్,42.19 మిలియన్ టన్నుల ప్రొడక్షన్, 40.56 మిలియన్ టన్నుల అమ్మకాలను సాధించింది. “బచేలి గని, కుమారస్వామి గని, ఇతర గనులలో 2023 ఆర్థిక సంవత్సరంలో 46 మిలియన్ టన్నుల ఇనుప ఖనిజం ఉత్పత్తిని టార్గెట్‌గా పెట్టుకున్నాము. ఈ వాల్యూమ్ అంతకుముందు ఆర్థిక సంవత్సరం కంటే దాదాపు 10 శాతం ఎక్కువ.
ఈ ఆర్థిక సంవత్సరంలోనూ టార్గెట్లను అందుకుంటామని ఆశిస్తున్నాం ”అని దేవ్ తాజా యాన్యువల్ రిపోర్టులో తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌లోని మూడు మిలియన్ టన్నుల స్టీల్ ప్లాంట్ విభజన ప్రస్తుత సంవత్సరంలో పూర్తవుతుందని కంపెనీ అంచనా వేస్తోందని, ఇందుకోసం ఇచ్చిన దరఖాస్తును కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆమోదించిందని ఎన్డీఎంసీ తెలిపింది. ఈశాఖ ఆదేశాల మేరకు ఎన్ఎండీసీ కూడా సమావేశాలను నిర్వహించింది. 2022 జూన్‌లో కంపెనీ అన్సెక్యూర్డ్ క్రెడిటార్స్, షేర్‌హోల్డర్ల మీటింగ్స్ జరిగాయి. స్టాక్ ఎక్స్ఛేంజీల నుండి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ వచ్చింది. బచెలి గనిలో ఐదవ లైన్ స్క్రీనింగ్ డౌన్‌హిల్ కన్వేయర్ ఆగ్మెంటేషన్ ప్రాజెక్ట్ కోసం ఎన్ఎండీసీ కొత్త కన్సల్టెంట్‌ను నియమించింది. ఇది ప్రస్తుత సంవత్సరంలోనే రెడీ అవుతుందని, దాదాపు 2.5 మిలియన్ టన్నుల ఉత్పత్తిని అందిస్తుందని సుమిత్ దేవ్ అన్నారు.