ఆగష్టు 8న అవిశ్వాసంపై చర్చ

ఆగష్టు 8న అవిశ్వాసంపై చర్చ
  • లోక్ సభలో మూడు రోజులు సాగనున్న డిస్కషన్  
  • 10వ తేదీన రిప్లై ఇవ్వనున్న ప్రధాని నరేంద్రే మోదీ


న్యూఢిల్లీ: కేంద్రప్రభుత్వంపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఈ నెల 8న చర్చను ప్రారంభించాలని మంగళవారం మధ్యాహ్నం లోక్ సభ బిజినెస్ అడ్వైజరీ కమిటీ(బీఏసీ) మీటింగ్ లో నిర్ణయించారు. చర్చ 10వ తేదీ వరకూ కొనసాగుతుందని, చివరి రోజున సభలో ప్రధాని మోదీ సమాధానం ఇస్తారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. అయితే, అవిశ్వాసంపై వెంటనే చర్చను చేపట్టాలంటూ మీటింగ్ కు హాజరైన ప్రతిపక్ష పార్టీల నేతలు డిమాండ్ చేశారు. 

ప్రభుత్వం అంగీకరించకపోవడంతో నిరసన వ్యక్తం చేస్తూ సమావేశం నుంచి వాకౌట్ చేశారు. ప్రతిపక్ష ఇండియా కూటమిలోని కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీ, లెఫ్ట్ పార్టీలతో పాటు బీఆర్ఎస్ సభ్యులు నిరసన తెలిపారు. మణిపూర్ అంశంపై పార్లమెంట్​లో చర్చించేలా చేయాలన్న వ్యూహంలో భాగంగా లోక్ సభలో కాంగ్రెస్ డిప్యూటీ లీడర్ గౌరవ్ గొగొయ్ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి స్పీకర్ ఓం బిర్లా జులై 20న ఆమోదం తెలిపారు. 

లోక్ సభలో మరో మూడు బిల్లులు పాస్..
మణిపూర్ అంశంపై ప్రతిపక్షాలు మంగళవారం కూడా పార్లమెంట్​లో నిరసనలు కొనసాగించాయి. ఉదయం లోక్ సభ ప్రారంభం కాగానే ప్రతిపక్ష ఎంపీలు ఎప్పటిలాగే నినాదాలు చేస్తూ సభను అడ్డుకున్నారు. ఈ గందరగోళం మధ్యే సభ మూడు బిల్లులను పాస్ చేసింది. జనన, మరణాల రిజిస్ట్రేషన్ (సవరణ) బిల్లు, ఆఫ్ షోర్ ఏరియాస్ మినరల్ (డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్) సవరణ బిల్లు, కాన్ స్టిట్యూషన్ (షెడ్యూల్డ్ కులాలు) ఆర్డర్ సవరణ బిల్లు స్వల్ప చర్చ తర్వాత ఆమోదం పొందాయి. ఢిల్లీ సర్వీసెస్ ఆర్డినెన్స్ స్థానంలో ప్రవేశపెట్టిన నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ (సవరణ) బిల్లు, 2023ను కూడా నిరసనల మధ్యే సభలో కేంద్రం ప్రవేశపెట్టింది. అనంతరం సభను స్పీకర్ వాయిదా వేశారు. 


రాజ్యసభలో అదే లొల్లి..
రాజ్యసభలో కూడా మంగళవారం అదే గందరగోళం నెలకొంది. ఉదయం సభ మొదలైన అరగంటకే వాయిదా పడింది. తిరిగి సమావేశం అయిన తర్వాత కూడా ప్రతిపక్ష సభ్యుల ఆందోళన కొనసాగడంతో చైర్మన్ జగ్ దీప్ ధన్ ఖడ్ సభను వాయిదా వేశారు.