రాజస్థాన్‌ రాజకీయం: సచిన్‌ పైలెట్‌కు హైకోర్టులో ఊరట

రాజస్థాన్‌ రాజకీయం: సచిన్‌ పైలెట్‌కు హైకోర్టులో ఊరట
  • ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు

జైపూర్‌‌: రెండు వారాలుగా రాజస్థాన్‌లో రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. సుప్రీం కోర్టుకు చేరిన పంచాయితీ తిరిగి హైకోర్టుకు చేరింది. హైకోర్టులో సచిన్‌పైలెట్‌ వర్గానికి భారీ ఊరట లభించింది. తిరుగుబాటు నేత సచిన్‌పైలెట్‌ వాదనతో హైకోర్టు ఏకీభవించింది. స్పీకర్‌‌ జారీ చేసిన అనర్హత నోటీసులపై శుక్రవారం విచారణ చేపట్టిన కోర్టు సచిన్‌పైలెట్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు అనుమతిచ్చింది. తిరుగుబాటు ఎమ్మెల్యేలపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని స్పీకర్‌‌ను ఆదేశించింది. పరిస్థితులు చక్కబడే వరకు సంయమనం పాటించాలని చెప్పింది. ఈ కేసులో కేంద్రాన్ని కూడా చేర్చాలని దాఖలైన పిటిషన్‌ను కోర్టు స్వీకరించింది. కేంద్రాన్ని చేర్చాలంటే తీర్పు ఆలస్యమయ్యే అవకాశముందని, అప్పటి వరకు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై యథాతథ స్థితి ఆదేశాలు జారీ చేసింది. దీంతో రాజకీయ అనిశ్చితికి కాస్త తెరపడింది. సొంతపార్టీపైనే తిరుగుబాటు చేసిన సచిన్‌పైలెట్‌, ఆయన తరఫు 19మంది ఎమ్మెల్యేలకు కాంగ్రెస్‌ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసింది. దీంతో వాళ్లంతా హైకోర్టును ఆశ్రయించగా.. విచారణకు స్వీకరించిన కోర్టు ఈనెల 24 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది. దాన్ని స్పీకర్‌‌ సుప్రీం కోర్టులో సవాలు చేయగా.. హైకోర్టులోనే విచారణ చేయాలని ఆదేశాలు ఇవ్వడంతో ఈ మేరకు విచారించిన హై కోర్టు తీర్పు చెప్పింది.