ఫైర్ సేఫ్టీపై బల్దియా గప్​చుప్! వ్యాపారులకు అవగాహనతో సరిపెట్టిన అధికారులు

ఫైర్ సేఫ్టీపై బల్దియా గప్​చుప్! వ్యాపారులకు అవగాహనతో సరిపెట్టిన అధికారులు
  • ప్రమాదాలు జరిగినప్పుడే హడావుడి
  • ఫైర్​సేఫ్టీ లేని బిల్డింగులు, గోదాములపై నో యాక్షన్
  • జనావాసాల మధ్య ఉన్న గోదాములను శివారుకు తరలించట్లే
  • ఎండలు ముదరడంతో రోజుకోచోట అగ్ని ప్రమాదం

హైదరాబాద్, వెలుగు: సిటీలో ఫైర్ సేఫ్టీపై జీహెచ్ఎంసీ ఫోకస్​పెట్టడం లేదు. వ్యాపార సంస్థలు, కమర్షియల్​బిల్డింగులు, గోదాముల్లో ఫైర్​సేఫ్టీ కిట్లు ఏర్పాటు చేసుకోకపోయినా పట్టించుకోవడం లేదు. గతేడాది సిటీలోని వేర్వేరుచోట్ల జరిగిన భారీ అగ్ని ప్రమాదాల్లో పదుల సంఖ్యలో జనం చనిపోయినా, రూ.కోట్లల్లో ఆస్తి నష్టం వాటిల్లినా ఎలాంటి కఠిన చర్యలు తీసుకోలేదు. కేవలం అవగాహన కార్యక్రమాలు నిర్వహించి చేతులు దులుపుకుంది. అధికారులు ఫైర్​సేఫ్టీపై విస్తృతంగా ప్రచారం చేసినప్పటికీ వ్యాపారులు కనీసం స్పందించలేదు. కిట్లు ఏర్పాటు చేసుకునేందుకు ముందుకు రాలేదు. ప్రమాదం జరిగినప్పుడు చూసుకుందాంలే అన్నట్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. బల్దియా అధికారులు సైతం ఆ తర్వాత ఫైర్​సేఫ్టీ అంశాన్ని పక్కన పెట్టేశారు. గ్రేటర్​పరిధిలో 6 లక్షల మంది కమర్షియల్ యాక్టివిటీస్ చేస్తున్నారు. వీరంతా తమ బిల్డింగులు, వ్యాపార సముదాయాల్లో తప్పనిసరిగా ఫైర్ సేఫ్టీ ని ఏర్పాటు చేసుకోవాలని ఏడాది కింద బల్దియా ఆదేశాలు జారీ చేసింది. గతేడాది మే వరకు గడువు ఇచ్చింది. కనీసం 2 వేల మంది కూడా స్పందించలేదు.

నాలుగు కేటగిరీల వారీగా.. 

గ్రేటర్​లో వ్యాపారాలు జరుగుతున్న ప్రాంతాలను బల్దియా అధికారులు నాలుగు కేటగిరీలుగా విభజించారు. ఇందులో ఇండివిడ్యువల్​షాపులు ఉన్నవారిని మొదటి కేటగిరీలో చేర్చారు. వీరు రెండు స్మోక్ డిటెక్టర్లతో పాటు రెండు అగ్ని మాపక సిలిండర్లు అందుబాటులో ఉంచుకోవాలి. రెండో కేటగిరీలో గ్రూప్ ఆఫ్ బిజినెస్​లు ఉన్నాయి. ఒకే  బిల్డింగ్ లో ఎక్కువ షాపులు ఉన్నవారు ఈ కేటగిరీ కిందికి వస్తారు. ఇందులో అందరూ కలిపి కామన్ గా ఫైర్ సేఫ్టీ సిస్టమ్ అమర్చుకోవాల్సి ఉంటుంది. మూడో కేటగిరీలో బిల్డింగ్ ఓనర్లు తీసుకోవాల్సిన చర్యలు ఉన్నాయి. వీరు బిల్డింగ్ లోని సెల్లార్లు క్లీన్ చేయడం, ఫైర్ ఎగ్జిట్ తదితరాలు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. నాలుగో కేటగిరీ కింద గోదాములు ఉన్నాయి. టింబర్ డిపోలు, వేస్ట్ పేపర్ గోదాములు ఈ కేటగిరీ కిందికి వస్తాయి.

అగ్ని ప్రమాదాలు ఆగట్లే..

2022, మార్చి23న బోయిగూడలోని ఓ టింబర్ డిపోలో అగ్ని ప్రమాదం జరిగి 11 మంది మృతి చెందారు. గతేడాది సెప్టెంబర్ 12న సికింద్రాబాద్ రూబీ లాడ్జిలో మంటలు చెలరేగి ఎనిమిది మంది చనిపోయారు. ఈ రెండు ఘటనల టైంలో మరోసారి అగ్ని ప్రమాదం జరగకుండా అన్ని చర్యలు తీసుంటామని గత బీఆర్ఎస్​పాలకులు, బల్దియా అధికారులు హామీ ఇచ్చారు. ఆ తర్వాత నాలుగు నెలల్లోనే మరో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. 2023, జనవరి19న సికింద్రాబాద్ డెక్కన్ మాల్ లో ఫైర్ యాక్సిడెంట్ జరిగి ముగ్గరు మరణించారు.

2023, మార్చి 16న ఇదే ప్రాంతంలోని స్వప్నలోక్ కాంప్లెక్స్​లో జరిగిన ఫైర్ యాక్సిడెంట్ లో ఆరుగురు  చనిపోయారు. 2023, ఏప్రిల్ 16న కుషాయిగూడలో జరిగిన అగ్ని ప్రమాదంలో ముగ్గురు సజీవ దహనమయ్యారు. 2023, నవంబర్14న బజార్ ఘాట్ లో జరిగిన అగ్నిప్రమాదంలో 9 మంది మృత్యువాత పడ్డారు. 10 రోజుల కింద టోలిచౌకిలోని ఓ గోదాంలో మంటలు చెలరేగి, అక్కడ భారీగా నిల్వచేసిన ఇంజిన్​ఆయిల్​రోడ్లపై పారింది. వాహనదారులు ప్రమాదాలకు గురయ్యారు. గత గురువారం కాటేదాన్ పారిశ్రామిక వాడలోని పాహల్​ఫుడ్స్​బిస్కెట్స్​కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కోట్లల్లో ఆస్తి నష్టం వాటిల్లింది. ఆ టైంలో కంపెనీలో దాదాపు 1000 మంది కార్మికులు ఉన్నారు. ఇన్​టైంలో స్పందించడంతో ప్రాణనష్టం తప్పింది. గడిచిన వారం రోజుల్లో సిటీలోని నాలుగు చోట్ల అగ్ని ప్రమాదాలు జరిగాయి. ప్రస్తుతం ఎండలు దంచికొడుతుండడంతో నిత్యం ఎక్కడోచోట మంటలు చెలరేగుతున్నాయి.

గోదాములపై చర్యలేవి?

బల్దియా పరిధిలో అనుమతులు లేకుండా వందల సంఖ్యలో గోదాములు నడుస్తున్నాయి. రకరకాల వ్యాపారాలు కొనసాగుతున్నాయి. మెజారిటీ వ్యాపారులు ఎలాంటి పర్మిషన్లు లేకుండానే గోదాములు ఏర్పాటు చేసుకుంటున్నారు. గుట్టుచప్పుడు కాకుండా దందా కొనసాగిస్తున్నారు. గడిచిన ఐదేండ్లలో అగ్ని ప్రమాదాలు జరిగిన ఏ ఒక్క గోదాముకు కూడా అనుమతులు లేవని అధికారులు గుర్తించారు. చాలా మంది రెసిడెన్షియల్ బిల్డింగ్​పేరుతో అనుమతులు పొంది, అందులో గోదాములు ఏర్పాటు చేసుకుంటున్నారు.

సికింద్రాబాద్ డెక్కన్ మాల్ నిర్వాహకులు కేవలం రెసిడెన్షియల్ పర్పస్ లో రెండు ఫ్లోర్లకు మాత్రమే జీహెచ్ఎంసీ అనుమతి పొందారు. కానీ స్పోర్ట్స్​ మెటిరీయల్ గోదాం కోసం ఇల్లీగల్ గా వినియోగించారు. బజార్ ఘాట్ లో, టోలిచౌకిలో ఇలా నివాస ప్రాంతాల్లో ఉన్న గోదాములను వెంటనే ఖాళీ చేయిస్తామని పదేపదే చెబుతున్నప్పటికీ.. చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ప్రమాదాలు జరిగిన సమయంలో 10 వేల గోదాములు ఉంటాయని, అన్నింటినీ తరలిస్తామని చెబుతున్నారే తప్ప చర్యలు తీసుకోవడం లేదు. గతేడాది అగ్నిప్రమాదాలు జరిగిన టైంలో అధికారుల ఒత్తిడితో రెండు వేల మంది వ్యాపారులు ఫైర్​సేఫ్టీ కిట్లు అమర్చకున్నట్లు సమాచారం. వీరంతా చిన్న వ్యాపారులే. రూ.లక్షలు, రూ.కోట్లలో బిజినెస్​చేసేటోళ్లు అధికారుల ఆదేశాలను లెక్క చేయడం లేదు.