భద్రాచలం, వెలుగు: గిరిజన ప్రాంతాల్లో అటవీ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర అందడం లేదు. గిరిజనులు సేకరించిన అటవీ ఉత్పత్తులకు మంచి రేటు అందించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన గిరిజన సహకార సంస్థ(జీసీసీ) వారిని ఏ మాత్రం ఆదుకోలేకపోతోంది. సర్కారు నిర్ణయాలు దళారులకు వరంగా, గిరిపుత్రులకు శాపంగా మారాయి. భద్రాచలం మన్యంలో ప్రధానంగా లభించే ముష్టిగింజలకు కిలోకు రూ.45 చొప్పున జీసీసీ ఇస్తోంది. నిజానికి ఓపెన్ మార్కెట్లో ముష్టిగింజలకు భారీ డిమాండ్ ఉంది. ఔషధాలకు ఎక్కువగా వాడుతుండడంతో కిలో రూ.100కైనా కొంటామంటూ దళారులు వస్తున్నారు. తేనె కూడా కిలో రూ.225 జీసీసీ ధరైతే, ఓపెన్ మార్కెట్లో రూ.350, చింతపండు కిలోకు రూ.70 ఇస్తుంటే మార్కెట్లో రూ.150కు పైగా పలుకుతోంది. ఈ ధరలు తమకు గిట్టుబాటు కాకపోవడంతో గిరిజనులు తమ ఊళ్లలోకి వచ్చే దళారులకు అమ్ముకుంటున్నారు. ఏపీ, చత్తీస్‌గఢ్, ఒడిశా నుంచి దళారులు తెలంగాణలోని గిరిజన గ్రామాల్లో తిరుగుతూ వాటిని కొంటున్నారు.
దళారులతో ఆఫీసర్ల కుమ్మక్కు..
జీసీసీలోని కొందరు ఆఫీసర్లు దళారులతో కలిసి అటవీ ఉత్పత్తులను అమ్ముకున్న ఘటనలు గతేడాది భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో బయటపడ్డాయి. గిరిజనుల నుంచి కిలో రూ.45కు తీసుకున్న ముష్టిగింజలను జిల్లాలోని జీసీసీ గోడౌన్లలో నిల్వ ఉంచారు. సుమారు రూ.75లక్షల విలువ చేసే ముష్టిగింజలను బయట మార్కెట్లో అమ్మేసుకున్నారు. ఈ విషయంలో ఆఫీసర్లపై కేసులు కూడా నమోదయ్యాయి. సస్పెండ్ చేసి విచారణ చేస్తున్నారు. అయినా కూడా ఈ ఏడాది గుండాల, దుమ్ముగూడెం మండలాల్లో దళారులు ముష్టిగింజలను భారీగా కొన్నారు. స్థానికంగా ఉండే కొందరు జీసీసీ ఆఫీసర్ల సాయం కూడా వారికి అందుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఇదే విషయాన్ని ఇటీవల ఐటీడీఏ పీవో గౌతమ్ పోట్రు, జీసీసీ డీఎం విజయ్కుమార్గుర్తించారు. ఇవొక్కటే కాదు తేనె, చింతపండు కూడా బయటి వ్యాపారులు కొంటున్నారు. గిట్టుబాటు ధర పెంచితేనే దళారులకు అడ్డుకట్ట వేయవచ్చని గిరిజనులు అంటున్నారు.
లక్ష్యం చేరుకోలేని జీసీసీ..
గతేడాది రూ.2.50కోట్ల అటవీ ఉత్పత్తులను కొనుగోలు చేయాలని జీసీసీ లక్ష్యంగా పెట్టుకుంది. కానీ రూ.64లక్షలు మాత్రమే కొన్నది. ఈసారి కూడా రూ.1.50కోట్ల లక్ష్యంగా పెట్టుకుంది. అటవీ ఉత్పత్తులు దొరుకుతున్నా లక్ష్యాన్ని చేరుకోలేకపోవడానికి ప్రధాన కారణం గిట్టుబాటు ధర ఇవ్వకపోవడమేనని పలురువు ఆరోపిస్తున్నారు. దుమ్ముగూడెం మండలంలో వారపు సంతలకు వెళ్లిన వ్యాపారులు వీటిని కొని హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. కోట్ల రూపాయల అటవీ ఉత్పత్తులను వ్యాపారులు ఫారెస్ట్ చెక్‌పోస్టులు దాటించి రాజధానికి తీసుకెళ్తున్నారు. అందుకే జీసీసీ టార్గెట్రీచ్ కాలేకపోతోందని అంటున్నారు.
దళారులను అడ్డుకుంటాం..
గతంలో జరిగిన తప్పిదాల వల్ల నష్టపోయిన మాట నిజమే. ఈసారి దళారులను కచ్చితంగా అడ్డుకుంటాం. గుండాల, దుమ్ముగూడెం మండలాల్లో బయట ప్రాంతాల నుంచి వచ్చే వ్యాపారులను గుర్తించి, వారిని హెచ్చరించాం. దీనిపై ఐటీడీఏ పీవో కూడా రివ్యూ చేస్తున్నారు. ఎవరైనా జీసీసీ స్టాఫ్ ప్రమేయం ఉన్నా క్షేత్రస్థాయిలో ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకుంటాం. ముష్టిగింజలకు గిట్టుబాటు ధర విషయంపై హెడ్డాఫీస్‌కు లెటర్ రాశాం. ఇప్పుడు సీజన్ అయిపోయింది కాబట్టి వచ్చే ఏడాది నుంచి ధర పెంచి ఇచ్చేలా యాక్షన్ తీసుకుంటాం.
- విజయ్‌కుమార్, జీసీసీ డీఎం