కాళేశ్వరం నుంచి వేగంగా నీళ్లు తీసుకునేందుకు అదనపు లిఫ్ట్లు

 కాళేశ్వరం నుంచి వేగంగా నీళ్లు తీసుకునేందుకు అదనపు లిఫ్ట్లు
  • వేగంగా నీళ్లు తీసుకునేందుకు అదనపు ఎత్తిపోతలు
  • సీడబ్ల్యూసీకి డీపీఆర్‌‌ సమర్పించిన తెలంగాణ
  • గోదావరి బోర్డు పరిశీలనకు పంపిన కేంద్ర జల సంఘం

హైదరాబాద్‌‌, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన అదనపు టీఎంసీ కింద ఆయకట్టు లేదని తెలంగాణ ప్రభుత్వం తేల్చిచెప్పింది. గోదావరి నుంచి వేగంగా నీటిని ఎత్తిపోయడానికే అదనపు ఎత్తిపోతలు చేపట్టామని పేర్కొంది. ప్రాజెక్టు నుంచి ఇప్పటికే 2 టీఎంసీలు ఎత్తిపోసేందుకు అనుమతులు ఉన్నాయని తెలిపింది. అడిషనల్‌‌ టీఎంసీలో భాగంగా చేపట్టిన కంపోనెంట్ల వివరాలతో కూడిన రివైజ్డ్‌‌ డీపీఆర్‌‌ను సీడబ్ల్యూసీకి తెలంగాణ సమర్పించింది.

ప్రాజెక్టు నిర్మాణ వ్యయం రూ.1.15 లక్షల కోట్లుగా వెల్లడించింది. ఈ డీపీఆర్‌‌ను పరిశీలించిన సీడబ్ల్యూసీ దానిని గోదావరి రివర్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌ బోర్డు (జీఆర్‌‌ఎంబీ) కు పంపింది. అడిషనల్‌‌ టీఎంసీకి హైడ్రాలజీ, కాస్ట్‌‌ అప్రైజల్‌‌ తప్పనిసరని, దానికి సంబంధించిన అంశాలను పరిశీలించి సీడబ్ల్యూసీలోని ఆయా డైరెక్టరేట్లకు మళ్లీ నివేదించాలని జీఆర్ఎంబీ ఆదేశించింది. 

రూ.1.15 లక్షల కోట్లకు నిర్మాణ వ్యయం​

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌‌లో రూ.38,500 కోట్లతో ప్రతిపాదించి, పనులు ప్రారంభించిన ప్రాణహిత - చేవెళ్ల ఎత్తిపోతల పథకాన్ని తెలంగాణ ఆవిర్భావం తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టుగా రీడిజైన్‌‌ చేశారు. రూ.80,190 కోట్లతో పనులు చేపట్టి, అంచనా వ్యయాన్ని మూడేళ్లలోనే రూ.89 వేల కోట్లకు పెంచారు. ఈ ప్రాజెక్టు కింద 13 జిల్లాల్లోని 18,25,700 ఎకరాలకు నీళ్లు అందించాలని ప్రతిపాదించారు.

గోదావరి నుంచి 90 రోజుల్లో 180 టీఎంసీలు ఎత్తిపోసేందుకు అన్ని అనుమతులు తీసుకోగా, వాటికి అదనంగా ఇంకో 90 టీఎంసీలు లిఫ్ట్‌‌ చేసేందుకు అడిషనల్‌‌ టీఎంసీ పనులు మొదలుపెట్టారు. మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి, అక్కడి నుంచి మిడ్‌‌ మానేరుకు రోజుకు 3 టీఎంసీలు, మిడ్‌‌ మానేరు నుంచి మల్లన్నసాగర్‌‌కు రోజుకు 2 టీఎంసీలు ఎత్తిపోసేలా ప్రాజెక్టులో మార్పులు చేశారు. అడిషనల్‌‌ టీఎంసీ కింద కొత్త ఆయకట్టు లేదు కాబట్టి జీఆర్‌‌ఎంబీ గెజిట్‌‌ నోటిఫికేషన్‌‌లోని అన్‌‌ అప్రూవుడ్‌‌ ప్రాజెక్టుల జాబితా నుంచి దానిని తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం సీడబ్ల్యూసీని కోరింది.

ఈ నేపథ్యంలో కాళేశ్వరం రివైజ్డ్‌‌ డీపీఆర్‌‌ను రాష్ట్రం సీడబ్ల్యూసీకి సమర్పించగా దానిని పరిశీలించాలని గోదావరి బోర్డుకు పంపింది. అడిషనల్‌‌ టీఎంసీతో కలుపుకుని కాళేశ్వరం నిర్మాణ వ్యయం రూ.1.15 లక్షల కోట్లకు చేరిందని రివైజ్డ్‌‌ డీపీఆర్‌‌లో పేర్కొన్నారు. గోదావరిలో అడిషనల్‌‌ టీఎంసీకి సరిపోయే నీళ్లు మేడిగడ్డ వద్ద అందుబాటులో ఉన్నాయని నివేదించారు.

ఈ డీపీఆర్‌‌కు జీఆర్‌‌ఎంబీ క్లియరెన్స్‌‌ ఇచ్చి సీడబ్ల్యూసీలోని హైడ్రాలజీ, ఫైనాన్స్‌‌ డైరెక్టరేట్లకు సమర్పించాల్సి ఉంది. ఆయా డైరెక్టరేట్లు ఆమోదం తెలిపితే అన్‌‌ అప్రూవుడ్‌‌ ప్రాజెక్టుల జాబితా నుంచి అడిషనల్‌‌ టీఎంసీని తొలగించనున్నారు. ఎల్లంపల్లి బ్యాక్‌‌ వాటర్‌‌లో చేపట్టిన గూడెం ఎత్తిపోతలకు సీడబ్ల్యూసీ ఆమోదం తెలిపింది. ఆ డీపీఆర్‌‌ను జీఆర్‌‌ఎంబీకి పంపింది. జీఆర్‌‌ఎంబీ సమావేశంలో ఆ ప్రాజెక్టుపై చర్చించి సభ్యులు ఆమోదం తెలిపితే, అనుమతి లేని ప్రాజెక్టుల జాబితా నుంచి గూడెం ఎత్తిపోతలనూ తప్పించనున్నారు.