
- సర్కారు బళ్లను ఎట్టికి వదిలేసిన ప్రభుత్వం
- స్కూళ్లకు ఇప్పటికీ రాని మెయింటనెన్స్ గ్రాంట్
- స్కావెంజర్లు లేక కంపుకొడ్తున్న టాయిలెట్లు
- సబ్బులు, పినాయిల్కూ టీచర్ల జేబుల్లోంచి పెట్టాల్సిందే
కరీంనగర్ జిల్లా చొప్పదండి జడ్పీ గర్ల్స్ హై స్కూల్ లో 220 మంది స్టూడెంట్స్ ఉన్నారు. సర్కారు స్కావెంజర్లను తొలగించడంతో స్కూలు క్లీన్ చేసేందుకు నెలకు రూ. 2,500 ఇచ్చి టెంపరరీ వర్కర్‌ను పెట్టుకున్నారు. 10 మంది టీచర్లు తలా రూ. 250 కలెక్ట్ చేసి వర్కర్ కు ఇస్తున్నారు. కరెంట్ బిల్లు బకాయిలు భారీగా పేరుకుపోవడంతో ట్రాన్స్‌కో ఆఫీసర్లు కనెక్షన్ తొలగించారు. ఆఫీసర్లు పట్టించుకోకపోవడంతో బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ ఫండ్స్మీద వచ్చిన ఇంట్రెస్ట్ అమౌంట్ నుంచి కరెంట్ బిల్లు కట్టారు. ఇంకా రూ. 50 వేల వరకు కరెంట్ బిల్ డ్యూ ఉంది.
మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం దేవులవాడ జడ్పీ హై స్కూల్లో 300 మంది స్టూడెంట్స్ చదువుతున్నారు. గతంలో ఉన్న స్వీపర్, స్కావెంజర్లను తొలగించా రు. జీపీలో ఇద్దరే వర్కర్లు ఉండడంతో స్కూళ్లలో శానిటేషన్ చేయలేకపోతున్నారు. హెచ్ఎం సర్పంచ్ కు ఫోన్ చేసి బతిమాలితే నాలుగైదు రోజులకోసారి వర్కర్లను పంపుతున్నారు. మిగతా రోజుల్లో స్టూడెంట్లే క్లాస్ రూమ్స్ క్లీన్ చేసుకుంటున్నా, టాయ్ లెట్స్ దుర్వాసన వస్తున్నాయి. కరెంట్ బిల్స్, ఇతర ఖర్చుల కోసం హెచ్ఎం సొంతంగా నెలకు అయిదారు వేలు పెట్టుకుంటున్నారు. మంచిర్యాలలోని జడ్పీ బాయ్స్ హై స్కూల్ లో స్కావెంజర్ లేకపోవడంతో ఒక వర్కర్ ను పెట్టుకున్నారు. టీచర్లు తలా వంద, రెండు వందలు కలెక్ట్ చేసి నెలకు రూ.3వేలు చెల్లిస్తున్నారు.
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కంకరబోడ్ జడ్పీ హైస్కూల్లో 13 క్లాస్ రూమ్స్ ఉండగా, 4 శిథిలావస్థలో ఉన్నాయి. 4 టాయ్‌లెట్స్ రిపేర్లు చేయక నిరుపయోగం కాగా, రెండింటినే వాడుతున్నారు. టాయ్ లెట్స్ దుర్వాసన వస్తున్నాయి. ఇక్కడ 280 మంది స్టూడెంట్స్ చదువుతున్నారు. స్కావెంజర్‌ను తొలగించడంతో టీచర్లే శానిటేషన్ చేసుకుంటున్నారు. స్కూల్ గ్రాంట్స్ రాకపోవడంతో కరెంట్ బిల్లు, మెయింటనెన్స్ ఖర్చులు, ప్రైవేట్ స్వీపర్ జీతానికి హెచ్ఎం సొంత డబ్బులు చెల్లిస్తున్నారు.
నెట్ వర్క్/తంగళ్లపల్లి, వెలుగు: కరోనా ఎఫెక్ట్‌తో మూతపడ్డ సర్కారు బళ్లు18 నెలల తర్వాత సెప్టెంబర్1న రీ ఓపెన్ అయ్యాయి. చాలా రోజులు మూసి ఉండడం వల్ల స్కూళ్లలో తలుపులు, కిటికీలు పాడయ్యాయి. స్లాబులు పెచ్చులూడుతున్నాయి. ఊడి పడి స్టూడెంట్లకు, టీచర్లకు గాయాలవుతున్నాయి. వీటికి రిపేర్లు చేయించాలి. బళ్లలో కరోనా రూల్స్ కఠినంగా పాటించాలని ఆఫీసర్లు చెప్పారేగానీ ఎక్కడా అమలు కావడం లేదు. మెయింటనెన్స్గ్రాంట్రాక ఏ స్కూల్లోనూ హ్యాండ్‌వాష్, హ్యాండ్శానిటైజర్స్ కొనడం లేదు. కనీసం సబ్బులనూ అందుబాటులో ఉంచట్లేదు. చాక్‌పీస్‌లు, రిజిస్టర్లు కొనేందుకు కూడా తమ జేబులోంచి పెట్టుకోవాల్సి వస్తోందని హెచ్ఎంలు అంటున్నారు. సర్కారు బళ్లలో ఇలాంటి పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదని వాపోతున్నారు.
సర్కారు ఇచ్చినా కరెంట్ బిల్లులకే చెల్లు
రాష్ట్రవ్యాప్తంగా 26,067 గవర్నమెంట్, లోకల్బాడీస్స్కూల్స్ఉన్నాయి. ఆయా స్కూళ్ల స్ట్రెంథ్‌ను బట్టి ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ స్కూళ్లకు రూ.12,500 నుంచి రూ. లక్ష వరకు, హై స్కూళ్లకు రూ.25,000 నుంచి రూ.లక్ష వరకు మెయింటనెన్స్ గ్రాంటు ఇవ్వాల్సి ఉంది. కానీ విద్యాసంవత్సరం మొదలై నాలుగు నెలలైనా సర్కారు నుంచి గ్రాంట్రాలేదు. డిజిటల్ క్లాసుల నిర్వహణ వల్ల ప్రతి స్కూల్‌కు నెలనెలా తక్కువలో తక్కువ రూ. వెయ్యి నుంచి రూ.1,500 వరకు కరెంటు బిల్లులు వచ్చాయి. స్కూళ్లకిచ్చిన కరెంట్కనెక్షన్లు కమర్షియల్ కేటగిరీ కింద చేర్చడంతో బిల్లులు వాచిపోతున్నాయి. ఇప్పటికే ఒక్కో స్కూలు రూ. 5 వేల నుంచి రూ.20వేలకు పైగా ట్రాన్స్‌కోకు బకాయి పడింది. కొన్నిచోట్ల బిల్లులు కట్టలేదని కనెక్షన్తొలగిస్తున్నారు. ఒకవేళ ఏడాది చివర్లో సర్కారు నుంచి గ్రాంట్ విడుదల చేస్తే కరెంట్ బిల్లులకే సరిపోతాయని హెచ్ఎంలు చెబుతున్నారు.
శానిటైజేషన్ చేస్తలేరు
జీతాలివ్వలేక స్టేట్‌వైడ్28,200 మంది స్కావెంజర్లను తొలగించిన ప్రభుత్వం.. స్కూళ్లలో పారిశుధ్య పనుల బాధ్యతను లోకల్‌బాడీలకు అప్పగించింది. పట్టణాలు, గ్రామాల్లో పారిశుధ్య పనులే తలకు మించిన భారం కావడంతో మున్సిపల్, పంచాయతీ శానిటరీ వర్కర్లు స్కూళ్ల దిక్కు చూడడమే లేదు. దీంతో చాలా చోట్ల స్కూళ్లలో శానిటేషన్ అధ్వానంగా మారింది. దీంతో టీచర్లు స్టూడెంట్లతో క్లాస్‌రూములు ఊడిపిస్తూ, మరుగుదొడ్లు కడిగిస్తున్నారు.
హెచ్ఎంల జేబుల్లోంచే జీతాలు
కరోనా రూల్స్వల్ల శానిటేషన్‌కు ప్రియారిటీ ఇవ్వక తప్పడం లేదు. బాత్రూమ్ల క్లీనింగ్‌కు ఫినాయిల్, హ్యాండ్‌వాష్, శానిటైజర్ల కొనుగోలుకు తడిసి మోపడవుతోంది. పిల్లలతో గదులు ఊడిపిస్తే విమర్శలు వస్తున్నాయి. దీంతో చాలా స్కూళ్లలో శానిటేషన్ పనులు చేసేందుకు, బెల్కొట్టడానికి ఒకరిద్దరు ప్రైవేట్ వర్కర్లను పెట్టుకుంటున్నారు. వీరికి నెలకు రూ.2 వేల నుంచి 3 వేల వరకు జీతాలు ఇస్తున్నారు. ఈ జీతాన్ని కొన్నిచోట్ల హెచ్ఎంలే ఇస్తుండగా కొన్నిచోట్ల టీచర్లూ తలాకొంత వేసుకుంటున్నారు. చాక్‌పీసులు, వైట్ పేపర్లు, రిజిస్టర్లు, ఇతర స్టేషనరీ ఖర్చులనూ టీచర్లో.. హెచ్ఎంనో పెట్టుకుంటున్నారు. టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నచోట గతంలో పనిచేసిన విద్యావలంటీర్లను ప్రభుత్వం తొలగించింది. దీంతో ఆయాచోట్ల క్లాసులు జరగక, విద్యాకమిటీల ఆధ్వర్యంలో ప్రైవేట్‌గా వీవీలను పెట్టుకుంటున్నారు.
డబ్బుల వసూలుపై పేరెంట్స్ ఆందోళన
కోరుట్ల టౌన్‌లోని ఏకీన్ పూర్ గవర్నమెంట్ప్రైమరీ స్కూల్లో ఐదుగురికిగాను ఇద్దరు రెగ్యులర్ టీచర్లు, మరొకరు డిప్యూటేషన్ మీద పని చేస్తున్నారు. క్లాసులకు ఇబ్బంది అవుతుండడంతో మరో ఇద్దరు విద్యావలంటీర్లను నియమించాలని, వీరికి ఇచ్చే జీతాలకు సంబంధించిన డబ్బులు స్టూడెంట్ల నుంచి వసూలు చేయాలని స్కూలు అభివృద్ధి కమిటీ నిర్ణయించింది. ఒక్కో స్టూడెంట్ ఏడాదికి రూ. 3,600 కట్టాలని ఆదేశించింది. కమిటీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఇటీవల పిల్లల తల్లిదండ్రులు స్కూల్ ముందు నిరసనకు దిగారు. పిల్లలకు ఫ్రీగా చదువు చెప్తారని సర్కారు బడికి పంపిస్తే ఇలా ఫీజులు వసూలు చేయడం ఏమిటని నిలదీశారు. దీంతో ఏం చేయాలో తెలియక అక్కడి హెచ్ఎం తలపట్టుకున్నారు.
టీచర్లే జేబు నుంచి పెడుతున్రు
స్కూల్ గ్రాంట్లు ఎవరికీ రాలేదు. స్కూల్ టీచర్లే జేబు నుంచి పైసలు పెట్టాలి. స్వచ్ఛభారత్ వర్కర్లు ఉన్నా పనిచేయడం లేదు. టీచర్లే చాక్ పీస్ లు, రిజిస్టర్లు, ఇతర మెటీరియల్ కొనుక్కుంటున్నారు. బిల్లు వచ్చిన తర్వాత తిరిగి టీచర్లకు అమౌంట్ ఇస్తాం.
- వెంకటస్వామి, ఎంఈవో, తిర్యాణి
ఈ గ్రాంటు సరిపోదు
స్కూల్ మెయింటనెన్స్ గ్రాంట్ ఈ ఏడాది ఇంకా రిలీజ్ కాలేదు. గతంలో రూ. 20 వేల నుంచి 40 వేల వరకు గ్రాంటు వచ్చేది. లాస్ట్ ఇయర్ మాత్రం రూ. 80 వేలు వచ్చింది. ఇందులో రూ. 20 వేలు కరెంట్ బిల్లుకు పోగా, మిగతా అమౌంట్ చాక్‌పీసులు, డస్టర్లు, హ్యాండ్ వాష్, సబ్బులు, వాటర్, బాత్రూమ్ మెయింటెనెన్స్ కు ఖర్చు చేయాలి. ఈ గ్రాంట్ సరిపోక ఇబ్బంది పడుతున్నాం. కరోనాతో మెయింటనెన్స్ ఖర్చులు పెరిగాయి. కొంతమేరకు దాతల నుంచి తీసుకుంటున్నాం. కంప్యూటర్ రూమ్ స్లాబ్ కూలి నాలుగేండ్లయ్యింది. కొన్ని రూమ్స్ స్లాబులు వర్షాలకు ఉరుస్తున్నాయి. స్కూల్లో 270 మంది స్టూడెంట్లు ఉన్నారు. కాబట్టి ఏటా రూ. లక్ష నుంచి లక్షన్నర వరకు గ్రాంట్ ఇవ్వాలి.
- శీలం శ్రీనివాసరెడ్డి, హెచ్ఎం, కుర్నవల్లి హైస్కూల్, తల్లాడ మండలం, ఖమ్మం