వచ్చే రెండుమూడు నెలల్లో చైనాలో కొత్త వేవ్ కు నో చాన్స్

వచ్చే రెండుమూడు నెలల్లో చైనాలో కొత్త వేవ్ కు నో చాన్స్
  • చైనా సీడీసీ చీఫ్ ఎపిడెమాలజిస్ట్ వెల్లడి 
  • మూడేండ్ల తర్వాత ఘనంగా న్యూఇయర్ వేడుకలు 

బీజింగ్: చైనాలో ఇప్పటివరకూ దాదాపు 80% మందికి కరోనా వైరస్ సోకి ఉంటుందని చైనా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ)కు చెందిన చీఫ్ ఎపిడెమాలజిస్ట్ వూ జున్యోయూ వెల్లడించారు. దేశంలో పెద్ద సంఖ్యలో జనానికి వైరస్ వ్యాపించినందున వచ్చే రెండు మూడు నెలల్లో కొత్త వేవ్ వచ్చే అవకాశంలేదని అంచనా వేస్తున్నట్లు ఆయన శనివారం చైనీస్ సోషల్ మీడియా సైట్ ‘వీబో’లో పేర్కొన్నారు. ప్రస్తుతం చైనీస్ న్యూఇయర్ సందర్భంగా దేశవ్యాప్తంగా కోట్లాది మంది రాకపోకలు సాగిస్తుండటంతో వైరస్ వ్యాప్తి కూడా భారీగా పెరగొచ్చని, కానీ అది మరో వేవ్ కు దారి తీసే చాన్స్ లేదన్నారు.  

వారంలో 13 వేల మంది మృతి 

సీడీసీ లెక్కల ప్రకారం చైనాలో జనవరి 12 నాటికి మొత్తం 60 వేల మంది కరోనాతో మృతిచెందారు. ఈ నెల 13 నుంచి 19 మధ్య వారం రోజుల్లోనే దేశవ్యాప్తంగా ఆస్పత్రుల్లో  దాదాపు 13 వేల మంది కరోనాతో చనిపోయారు. వైరస్ బారిన పడి ఇండ్లలో చనిపోయినోళ్ల డేటాను మాత్రం సీడీసీ వెల్లడించలేదు. అయితే, ప్రభుత్వ లెక్కల కంటే వాస్తవ మరణాల సంఖ్య ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. దేశంలో కరోనా ఆంక్షలను ఎత్తేసినప్పటి నుంచే దాదాపు 6 లక్షల మంది వైరస్ కు బలైపోయి ఉంటారని అఫిర్నిటీ అనే వెబ్ సైట్ అంచనా వేసింది.

ఘనంగా న్యూఇయర్ వేడుకలు 

చైనాలో ఏటా జనవరిలో న్యూఇయర్ జరుపుకుంటారు. కోట్లాదిమంది సొంత ఊర్లకు వెళ్లి, కుటుంబసభ్యులు, బంధువు లను కలుసుకుంటుంటారు. కరోనా ఆంక్షల కారణంగా రెండేళ్లుగా ఈ వేడుకలు పెద్ద ఎత్తున జరగలేదు. ఈసారి ఆంక్షలు ఎత్తేయడంతో కోట్లాది మంది సొంతూర్లకు క్యూ కట్టారు. ఆదివారం దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున వేడుకలు చేసుకు న్నారు. అయితే, న్యూఇయర్ జర్నీలు, వేడుకలతో కరోనా వ్యాప్తి పెరుగుతుందనే ఆందోళనలు  వ్యక్తమవుతున్నాయి.