ఏపీలో ఫీల్డ్​లోనే పట్టాలు..  ఇక్కడ ధరణితో తిప్పలు

ఏపీలో ఫీల్డ్​లోనే పట్టాలు..  ఇక్కడ ధరణితో తిప్పలు
  • ఏపీలో ఫీల్డ్​లోనే పట్టాలు..  ఇక్కడ ధరణితో తిప్పలు
  • భూ సమస్యల పరిష్కారంలో తెలుగు రాష్ట్రాల తీరిది
  • అక్కడ శాశ్వత పరిష్కారాలు.. ఇక్కడ కొత్త సమస్యలు
  • భూసర్వే చేస్తూ, హద్దు రాళ్లు పాతుతూ, పాస్ బుక్స్ ఇస్తున్న ఏపీ
  • రాష్ట్రంలో ఫీల్డ్ ఎంక్వైరీ లేకుండానే పాత రికార్డ్స్​తో కొత్త పాస్​బుక్స్ 
  • ఏపీలో ‘మీ భూమి’తో తప్పుల సవరణ
  • మన దగ్గర ఆగమాగం చేసిన ధరణి.. తప్పుల తడకగా రికార్డులు
  • వివాదాల పరిష్కారానికి అక్కడ మండలానికో అప్పీలేట్ ట్రిబ్యునల్
  • ఇక్కడ గతంలో ఉన్న రెవెన్యూ కోర్టులు కూడా ఎత్తివేత
  • పాత, కొత్త భూసమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడ్తున్న రాష్ట్ర రైతులు

కరీంనగర్, వెలుగు:  ‘‘తప్పుల తడకగా మారిన భూరికార్డులను ప్రక్షాళన చేస్తాం.. సమగ్ర భూసర్వే చేసి రైతులకు కొత్త పాస్ బుక్స్ ఇస్తాం.. భూవివాదాలను శాశ్వతంగా పరిష్కరిస్తాం’’ అంటూ తెలంగాణ, ఏపీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు వేర్వేరు సందర్భాల్లో ప్రకటనలు చేశారు. కానీ భూ సమస్యల పరిష్కారం కోసం పొరుగు రాష్ట్రం లెక్క తెలంగాణ సర్కారు పని చేస్తలేదు. ఏపీలో ఊరూరా, సర్వే నంబర్ల వారీగా భూసర్వే చేస్తున్న ఆఫీసర్లు, రైతుల సమక్షంలోనే హద్దురాళ్లు పాతి, అక్కడే పాస్ బుక్స్ ఇస్తున్నారు. కానీ తెలంగాణలో చేపట్టిన భూరికార్డుల ప్రక్షాళనలో సమగ్ర భూసర్వే లేదు.  ఫీల్డ్ వెరిఫికేషన్ లేదు. పాత రికార్డుల ఆధారంగా మక్కీకి మక్కీ ఆన్ లైన్‌‌లో ఎక్కించి, అదే డేటాను ధరణిగా తీసుకొచ్చారు. ఏపీలో ‘మీ భూమి’ పోర్టల్‌‌తో సమస్యలను పరిష్కరిస్తుంటే.. తెలంగాణలో ధరణి పోర్టల్‌‌తో కొత్త సమస్యలను సృష్టించారు. ఏపీలో వివాదాల పరిష్కారానికి మండలానికో అప్పిలేట్ ట్రిబ్యునల్‌‌ను ఏర్పాటు చేయగా.. మన రాష్ట్రంలో గతంలో ఉన్న రెవెన్యూ కోర్టులను రద్దు చేసి భూవివాదాలపై అప్పీల్ చేసుకునే చాన్స్ కూడా లేకుండా చేశారు. 

పాత రికార్డులను ముందరేసుకుని..

ఏపీ కంటే ముందే మన రాష్ట్రంలో భూరికార్డుల ప్రక్షాళనకు సర్కారు శ్రీకారం చుట్టింది. ఫీల్డ్ లెవల్‌‌లో భూములన్నింటినీ సర్వే నంబర్ల వారీగా ప్రతి అంగుళం కొలిచి, రికార్డులను మాడిఫై చేస్తామని, ఆ ప్రకారం కొత్త పాస్​బుక్​లు వచ్చాక భవిష్యత్​లో గెట్టు పంచాయితీలనేవే ఉండవని సీఎం కేసీఆర్ చెప్పారు. ఆయన ఆదేశాలతో 2017 సెప్టెంబర్ 15న రికార్డుల ప్రక్షాళన ప్రారంభమైంది. కావాల్సిన మ్యాన్​పవర్, టెక్నాలజీ, ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌ను సమకూర్చుకొని ఒక పద్ధతి ప్రకారం రికార్డులను ప్రక్షాళన చేయాల్సి ఉండగా.. అలాంటి కసరత్తేమీ జరగలేదు. ఏదో కొంపలు మునిగిపోయినట్టు రెవెన్యూ సిబ్బందికి టార్గెట్ పెట్టి మరీ 2018 మార్చి నాటికి కొత్త పాస్ బుక్స్ ఇచ్చేలా పురమాయించారు. కేవలం ఆరు నెలల గడువే ఇవ్వడంతో ఎక్కడా ఫీల్డ్ సర్వే చేయలేదు. పాత రికార్డులను ముందరేసుకుని ఆన్ లైన్ లో ఎక్కించారు. వీటిని కొత్తగా తెచ్చిన ధరణి పోర్టర్​లో నమోదు చేశారు.

సమస్యలను పట్టించుకోలే..

రికార్డుల్లో ఎక్కువ భూమి ఉండి, ఫీల్డ్​లో తక్కువ భూమి ఉండడం.. ఫీల్డ్​లో ఎక్కువ భూమి ఉండి, రికార్డుల్లో తక్కువ భూమి ఉండడం లాంటి సమస్యలను అధికారులు పట్టించుకోలేదు. సాదాబైనామాల ద్వారా ఏండ్ల కింద అమ్ముకున్న భూములకు, ప్రక్షాళన నాటికి ఇతరుల పేర్లపై రిజిస్ట్రేషన్ అయ్యి మ్యుటేషన్ పెండింగ్​లో ఉన్న భూములకు పాత ఓనర్ల పేర్లే ఎక్కించారు. ఎప్పుడో భూములు వదిలివెళ్లిన దొరలు, దేశ్ ముఖ్​ల పేర్లు పట్టాదారు  కాలమ్​లో నమోదు చేశారు. బయటికి రాని ఇలాంటి ఘటనలెన్నో ఉన్నాయి. 

l    పెద్దపల్లి జిల్లా అంతర్ గాం మండలం మొగల్ పహాడ్​లో రాజా వెంకట మురళీ మనోహర్ రావు పేరిట 697 ఎకరాలు నమోదు చేశారు.
l    సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలంలో ఎర్రపహాడ్​ దొర వారసుల పేరుతో ధరణిలో ఏకంగా 1,842 ఎకరాలు ఎక్కించారంటే 
రికార్డుల ప్రక్షాళన ఎంత గుడ్డిగా సాగిందో అర్థం చేసుకోవచ్చు.
l    నాన్ లేఔట్ వెంచర్లలో ప్లాట్లన్నీ అమ్ముడు పోయినా.. మళ్లీ వెంచర్లన్నీ వ్యవసాయ భూములుగా రికార్డులకెక్కాయి. వీటికి పాత పట్టాదార్ల పేరిట పాస్ బుక్స్ జారీ అయ్యాయి.
l    పేర్లలో తప్పులు దొర్లాయి.‘శ్రీ, పట్టాదారు పేరు తెలియదు, 9999, 666’ అనే పేరిట లక్షలాది ఎకరాల భూములు రికార్డుల్లోకి ఎక్కాయి.
l    కాల్వలకు, రోడ్లకు, ఇతర ప్రభుత్వ అవసరాలకు ఇచ్చాక మిగిలిన ప్రైవేట్ పట్టా భూములు, మాజీ సైనికులు, ఫ్రీడం ఫైటర్లకు ఇచ్చిన అసైన్డ్  భూములు ప్రొహిబిటెడ్ జాబితాలో చేర్చారు.
l    పట్టా భూములను కొన్ని గ్రామాల్లో ఫారెస్టు, ఇనాం, అసైన్డ్, దేవాదాయ, వక్ఫ్​గా పేర్కొంటూ భూమి స్వభావాన్నే మార్చేశారు.
l    ఒక్కో ఊరిలో పదుల సంఖ్యలో సర్వే నంబర్లు, బై నంబర్లు మిస్సయ్యాయి.

ప్రతి ఊరిలో 150 పైనే భూ సమస్యలు

ఊరికో తీరు, భూమికో విధమైన సమస్యలు లక్షల్లో ఉన్నాయి. ధరణి పోర్టల్ అమల్లోకి వచ్చాక అందుబాటులో ఉన్న మాడ్యూల్స్ ద్వారానే రెండున్నరేండ్లలో వివిధ సమస్యలపై 12 లక్షలకుపైగా దరఖాస్తులు వచ్చాయి. రికార్డుల ప్రక్షాళన, ధరణి వల్ల రాష్ట్రంలో భూ సమస్యలు పరిష్కారం కాకపోగా అనేక కొత్త సమస్యలు తెరపైకి వచ్చాయి. ఒక్కో ఊరిలో 150 నుంచి 300 వరకు భూ సమస్యలు పెండింగ్‌‌లో ఉన్నాయి. కోర్టుల్లో రోజుకు 50 నుంచి 100 వరకు సివిల్ కేసులు దాఖలవుతున్నాయి. మొత్తంగా రెవెన్యూ ఆఫీసర్లు, సిబ్బంది చేసిన తప్పులకు రైతులు శిక్ష అనుభవిస్తున్నారు.

రెండు రాష్ట్రాల్లో ఇట్లున్నది

భూరికార్డుల ప్రక్షాళనలో భాగంగా తొలుత రూ.వెయ్యి కోట్లు ఖర్చు చేశారు. 4,500 సర్వే బృందాలు, 2 వేల రోవర్ల ద్వారా భూముల రీసర్వేకు శ్రీకారం చుట్టి విజయవంతంగా పూర్తి చేశారు. ప్రతి భూకమతానికి విడిగా అక్షాంశ, రేఖాంశాలతో మ్యాప్ ఇచ్చారు. గ్రామాల్లోనే రికార్డులు అందుబాటులో ఉంచారు.2014 మేనిఫెస్టోలోనే సమగ్ర భూసర్వే చేపడుతామని ప్రకటించినా చేయలేదు. 2017లో రికార్డు టు రికార్డు నమోదు చేశారు తప్ప ఫీల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వెళ్లలేదు. ధరణి విఫలమయ్యాక.. తెలంగాణలో ​సమగ్ర భూసర్వే చేపడుతామని 2021 జూన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సీఎం కేసీఆర్ ప్రకటించారు. రెండేండ్లు బడ్జెట్​లో నిధులు కేటాయించినా సర్వే మొదలు కాలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో గెట్టు తగాదాలు వస్తే మొత్తం సర్వే నంబర్ హద్దులు చూపిస్తున్నారే తప్పా.. ఆ నంబర్ లోని బై నంబర్ల హద్దులు చూపించే పరిస్థితి లేదు.