బీ ఫాం నాకే.. పోటీపై వెనక్కి తగ్గేది లేదన్న రాజయ్య

బీ ఫాం నాకే.. పోటీపై వెనక్కి తగ్గేది లేదన్న రాజయ్య

 

  • జనగామ, జహీరాబాద్, పటాన్​చెరులోనూ వర్గ విభేదాలు  
  • వేములవాడ, భూపాలపల్లి, ఆసిఫాబాద్​లో లీడర్ల మధ్య కుదరని సయోధ్య
  • చివరిదాకా చూసి కారు దిగుదామనుకుంటున్న కొందరు లీడర్లు

హైదరాబాద్/జనగామ, వెలుగు: స్టేషన్​ఘన్​పూర్​టికెట్​పంచాయితీ మళ్లీ మొదటికి వచ్చింది. ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి టికెట్​ఇచ్చినా బీ ఫాంపై సిట్టింగ్​ఎమ్మెల్యే డాక్టర్​రాజయ్య ధీమాగా ఉన్నారు. రెండు రోజుల క్రితమే కడియం శ్రీహరితో పాటు రాజయ్యను ప్రగతి భవన్​కు పిలిపించి కేసీ ఆర్​ బుజ్జగించారు. కడియం గెలుపు కోసం పనిచేయా లని సూచించారు. రాజయ్యకు రైతుబంధు సమితి చైర్మన్​గా అవకాశం కల్పిస్తామని కూడా ఇదే టైమ్​లో కేటీఆర్​హామీ ఇచ్చారు. పార్టీ వర్కింగ్ ​ప్రెసిడెంట్​ముందు ఈ ప్రపోజల్​కు దాదాపు ఓకే చెప్పిన రాజయ్య నియోజకవర్గంలోకి వెళ్లాక మాట మార్చారు. ఆదివారం తన అనుచరులతో సమావేశంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. స్టేషన్​ఘన్​పూర్ నుంచి తానే పోటీ చేస్తానని తేల్చిచెప్పారు. టికెట్​విషయంలో వెనక్కి తగ్గేది లేదని, కలిసి ఫొటో దిగినంత మాత్రాన కాంప్రమైజ్​అయినట్టు కాదన్నారు. రైతుబంధు సమితి చైర్మన్ పదవి అనేది వట్టి ప్రచారమేనని కొట్టి పారేశారు. అన్ని పార్టీల కన్నా ముందే ఎన్నికల ప్రచారంలోకి దిగాలన్న లక్ష్యంతో కేసీఆర్115 సీట్లకు ఒకేసారి అభ్యర్థులను ప్రకటించారని, వారిలో కొందరిని మారుస్తామని అప్పుడే చెప్పా రని తెలిపారు. ఈ లెక్కన స్టేషన్​ఘన్​పూర్​టికెట్​తన దేనని అన్నారు. ఒకవేళ తనకు అవకాశం ఇవ్వలేకపోతే వరంగల్​ఎంపీ, ఎమ్మెల్సీగా అవకాశమిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ఎవ్వరూ తొందర పడొద్దని.. కేసీఆర్​ నాయకత్వంలోనే పని చేద్దామని సూచించారు. 

చాలా చోట్ల ఇదే పంచాయితీ  

జనగామలోనూ టికెట్​పంచాయితీ కొనసాగుతోంది. టికెట్​పై ఇంకో రెండు రోజుల్లో క్లారిటీ వస్తుందని.. తనకు కాకుండా పల్లా రాజేశ్వర్ రెడ్డికి టికెట్​ఇస్తామని చెప్తున్నట్టు వస్తున్న వార్తలు నిజం కాదని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి చెప్తున్నారు. ఎమ్మెల్యేగా ఉన్న ముత్తిరెడ్డిని కార్పొరేషన్​పదవికి పరిమితం చేస్తే తాము పార్టీకి అండగా ఉండబోమని ఆయన వర్గీయులు చెప్తున్నారు. ముత్తిరెడ్డితో పాటు పల్లాను కేటీఆర్​పిలిపించి మాట్లాడారు. ఈ భేటీలో టికెట్​దాదాపు పల్లాకే అన్న సంకేతాలు ఇచ్చారు. ముత్తిరెడ్డికి టీఎస్​ఆర్టీసీ చైర్మన్​పదవి ఇవ్వబోతున్నట్టు సమాచారం ఇచ్చారు. అయితే ఈ పదవి తీసుకోవద్దని తన అనుచరులు ఒత్తిడి చేస్తున్నారని ముత్తిరెడ్డి చెప్తున్నారు. భూపాలపల్లిలో గండ్రకు మద్దతిస్తానని ఎమ్మెల్సీ మధుసూదనాచారి చెప్పినా ఆయన కొడుకు మాత్రం నియోజకవర్గంలో తిరుగుతూ తానే పోటీ చేస్తానని చెప్తున్నారు. పటాన్​చెరు టికెట్ ​కోసం నీలం మధు ముదిరాజ్​గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. బీఆర్ఎస్ ముదిరాజ్​కులానికి ఒక్క టికెట్ ​కూడా ఇవ్వలేదు కాబట్టి తనకు చాన్స్​ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారు. జహీరాబాద్​లోనూ టికెట్​పంచాయితీ కంటిన్యూ అవుతోంది. తమకే చాన్స్​ఇవ్వాలని ఢిల్లీ వసంత్​తో పాటు ఎర్రోళ్ల శ్రీనివాస్​ప్రయత్నిస్తూనే ఉన్నారు. వైరా ఎమ్మెల్యే రాములు నాయక్​ బీఆర్ఎస్​లోనే ఉన్నా సహాయ నిరాకరణ కొనసాగిస్తున్నారు.  

కారు దిగేందుకూ రెడీ  

మల్కాజిగిరి టికెట్​స్థానికులు, తెలంగాణ ఉద్యమకారులకే ఇవ్వాలని, అల్వాల్​నుంచి లీడర్లను డంప్​ చేయొద్దని స్థానిక నాయకులు పట్టుబడుతున్నారు. అసంతృప్తులను పిలిపించి మాట్లాడినా, ఇతర అవకాశాలు కల్పిస్తామని చెప్పినా వాళ్లు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. చివరి నిమిషం వరకు వేచి చూసి బీ ఫాం ఇవ్వకపోతే కారు దిగే ప్రయత్నాల్లో చాలా మంది లీడర్లు ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. టికెట్​ఇవ్వకపోవడంతో ఇప్పటికే ఎమ్మెల్యే రేఖానాయక్, మాజీ ఎమ్మెల్యేలు వేముల వీరేశం, ఆరేపల్లి మోహన్​బీఆర్ఎస్ పార్టీని వీడారు.

క్యాడర్ కలిసిరావట్లే 


కాంగ్రెస్​నుంచి బీఆర్ఎస్​లోకి వచ్చినవారిలో తనకు మాత్రమే టికెట్​నిరాకరించడాన్ని ఎమ్మెల్యే ఆత్రం సక్కు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆదిలాబాద్​ఎంపీ టికెట్​ఇస్తామని చెప్తున్నా దానిపై అధికారిక ప్రకటన చేస్తే తప్ప నమ్మలేమని ఆయన వర్గీయులు అంటున్నారు. వేములవాడ టికెట్​చల్మెడ లక్ష్మీనర్సింహారావుకు ఇవ్వడాన్ని ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్​వర్గీయులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వాళ్లిద్దరి మధ్య సయోధ్య కోసం కేటీఆర్​ప్రయత్నిస్తున్నా.. క్యాడర్​మాత్రం కలిసి రావడం లేదు. నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్​రెడ్డి, మహిళా కమిషన్​చైర్​పర్సన్​సునీతా లక్ష్మారెడ్డితో సోమవారం కేటీఆర్​సమావేశమయ్యే అవకాశముంది. టికెట్​పై మదన్​రెడ్డి తగ్గేది లేదని చెప్తుండగా, తనకే చాన్స్​ఇస్తారని సునీతా లక్ష్మారెడ్డి ధీమాగా ఉన్నారు. ఒకవేళ మదన్​రెడ్డికి టికెట్​ఇవ్వకుంటే ఇండిపెండెంట్​గా పోటీ చేయాలని నియోజకవర్గానికి చెందిన ప్రజాప్రతినిధులంతా ఒత్తిడి చేస్తున్నారు.