హుజురాబాద్‌‌లో చైర్‌‌‌‌పర్సన్‌‌పై అవిశ్వాస తీర్మానం

హుజురాబాద్‌‌లో చైర్‌‌‌‌పర్సన్‌‌పై అవిశ్వాస తీర్మానం
  • 25 మంది కౌన్సిలర్ల తిరుగుబాటు 
  • చొప్పదండిలోనూ ‘అవిశ్వాస’ ప్రయత్నం 

కరీంనగర్/హుజురాబాద్, వెలుగు: కరీంనగర్​ జిల్లా మున్సిపాలిటీల్లో అవిశ్వాస ముసలం పుట్టింది. హుజురాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ గందె రాధికపై కౌన్సిలర్లు తిరుగుబాటు ప్రకటించారు. 22 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లతోపాటు ముగ్గురు బీజేపీ కౌన్సిలర్లు  అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తూ లెటర్ ను గురువారం కలెక్టర్ ఆఫీసులో సమర్పించారు. మున్సిపల్ చైర్‌‌‌‌పర్సన్​ కౌన్సిల్ సమావేశానికి ముందురోజు ఎజెండా చెప్పకుండానే ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటూ, ప్రశ్నించిన సభ్యులను బెదిరిస్తూ బిల్లులను పాస్​ చేయించుకుంటున్నారని లేఖలో ఆరోపించారు. చైర్‌‌‌‌పర్సన్​ భర్త శ్రీనివాస్ అన్ని విషయాల్లో జోక్యం చేసుకుంటూ బినామీలతో టెండర్లు వేయించి కమీషన్లు తీసుకుంటున్నారని ఆరోపించారు. మరోవైపు కేటీఆర్ నియోజకవర్గంలో పర్యటించిన రెండు రోజుల్లోనే తిరుగుబాటు రావడం హాట్ టాపిక్‌‌గా మారింది. గతంలో కౌన్సిలర్లు చైర్‌‌‌‌పర్సన్‌‌కు వ్యతిరేకంగా బాహటంగానే మాట్లాడినా.. నాయకులు సర్ధిచెప్పారు. కానీ ఈ సారి మాత్రం వారు తగ్గేదే లేదంటున్నారు. చైర్‌‌‌‌పర్సన్ భర్త ఒంటెత్తు పోకడల కారణంగా కౌన్సిలర్లు విసిగిపోయినట్లు తెలుస్తోంది.

రంగంలోకి ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి 

అవిశ్వాస తీర్మానం ఇచ్చేందుకు కౌన్సిలర్లు తాళ్లపల్లి శ్రీనివాస్, వి.కిషన్ ను కలెక్టరేట్‌‌కు పంపించి మిగతా కౌన్సిలర్లు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకొని రహస్య ప్రాంతానికి వెళ్లిపోయారు. అవిశ్వాస తీర్మానం పెట్టినట్లు సమాచారం అందడంతో ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి రంగంలోకి దిగి వారిని సముదాయించే ప్రయత్నం చేశారు. తాము రాజీకి వచ్చేది లేదని, ఇప్పుడున్న చైర్‌‌‌‌పర్సన్​ తప్ప ఎవరినై‌‌‌‌నా తాము ఒప్పుకుంటామని స్పష్టం చేసినట్లు తెలిసింది.  కౌన్సిలర్లతో మాట్లాడిన ఆయన పార్టీ హైకమాండ్​దృష్టికి తీసుకెళ్తానని,  రెండు రోజులు వెయిట్ చేయాలని కోరినట్లు సమాచారం. ఒకవేళ చైర్‌‌‌‌పర్సన్‌‌ను మార్చాల్సి వస్తే అవిశ్వాస తీర్మానం ద్వారా కాకుండా రాజీమార్గంగానే కొత్త చైర్‌‌‌‌పర్సన్‌‌ను ఎన్నుకుందామని చెప్పినట్లు తెలిసింది. కాగా చైర్ పర్సన్ పదవికి ప్రస్తు వైస్ చైర్‌‌‌‌పర్సన్​కొలిపాక నిర్మల, కౌన్సిలర్లు దండ శోభ, మంద ఉమాదేవి, రమాదేవి పోటీపడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. వీరంతా క్యాంపు రాజకీయాల్లో నిమగ్నమైనట్లు తెలిసింది.   

అవిశ్వాసం దిశగా చొప్పదండి.. 

చొప్పదండి మున్సిపాలిటీలోనూ చైర్‌‌‌‌పర్సన్ గుర్రం నీరజపై అవిశ్వాసం పెట్టేందుకు కొందరు కౌన్సిలర్లు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. మున్సిపాలిటీలో 14 మంది కౌన్సిలర్లు ఉండగా చైర్‌‌‌‌పర్సన్ కు వ్యతిరేకంగా అవిశ్వాసం పెట్టేందుకు దాదాపు 10 మంది పావులు కదుపుతున్నట్లు సమాచారం. చైర్‌‌‌‌పర్సన్‌‌ మీద అసంతృప్తితో ఇటీవల కొందరు కౌన్సిలర్లు సమావేశమై అవిశ్వాసం పెట్టేందుకు నిర్ణయించుకున్నట్లు తెలిసింది.