వర్ధన్నపేటలో వీగిపోయిన అవిశ్వాసం

వర్ధన్నపేటలో వీగిపోయిన అవిశ్వాసం

వర్ధన్నపేట, వెలుగు: వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్మన్లపై పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. గత నెలలో తొమ్మిది మంది కౌన్సిలర్లు కలిసి చైర్ పర్సన్, వైస్ చైర్మన్లపై అవిశ్వాస నోటీస్​ఇవ్వగా, బుధవారం ఉదయం స్థానిక మున్సిపల్​ఆఫీసులో ఆర్డీఓ వాసుచంద్ర ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఆరుగురు కౌన్సిలర్లు(1, 5, 7, 8, 10, 12 వార్డులు) మాత్రమే హాజరవ్వడంతో, కోరం లేదని సమావేశాన్ని మధ్యాహ్నానికి వాయిదా వేశారు. మధ్యాహ్నం కౌన్సిలర్లు ఎవరూ రాకపోవడంతో అవిశ్వాసం వీగిపోయినట్లు ఆర్డీఓ ప్రకటించారు.

అనంతరం ఆరుగురు కౌన్సిలర్లు మీడియాతో మాట్లాడారు. మున్సిపాలిటీలో జరిగిన అక్రమాలను ఎండగడుతూ.. గత నెలలో తొమ్మిది మంది కౌన్సిలర్లం కలిసి అవిశ్వాసం పెట్టామని చెప్పారు. అయితే ఇద్దరు కౌన్సిలర్లు ప్రలోబాలకు లొంగి చైర్ పర్సన్, వైస్ చైర్మన్లకు మద్దతు పలికారన్నారు. ఇప్పటికే తాము ఎన్నోసార్లు మున్సిపాలిటీలో అవినీతి జరిగిందంటూ రోడ్డెక్కామని గుర్తుచేశారు. ఇద్దరు కౌన్సిలర్లు సమావేశంలో పాల్గొనకుండా, అవినీతికి మద్దతు తెలిపారని మండిపడ్డారు. కొన్ని నెలలుగా మున్సిపల్​చైర్ పర్సన్, వైస్ చైర్మన్లపై కాంగ్రెస్​కౌన్సిలర్లు గుర్రుగా ఉన్నారు. రూ.6 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపిస్తున్నారు.

గతంలో కమిషనర్ ను కలిసి ఫిర్యాదు కూడా చేశారు. వారికి కొందరు బీఆర్ఎస్ కౌన్సిలర్లు మద్దతు పలకగా, అప్పటి బీఆర్ఎస్​ఎమ్మెల్యే జోక్యంతో అంతర్గత విభేదాలు సద్దుమణిగాయి. తాజాగా కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో కాంగ్రెస్​ కౌన్సిలర్లు అవిశ్వాసానికి తెరలేపగా, కొందరు బీఆర్ఎస్​కౌన్సిలర్లు వారికి మద్దతు తెలిపారు. చివరికి కోరం లేకపోవడంతో అవిశ్వాసం వీగిపోయింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఏసీపీ రఘుచందర్, సీఐ శ్రీనివాస్, ఎస్సై ప్రవీణ్ వర్ధన్నపేటలో బందోబస్త్​ఏర్పాటు చేశారు.