ఉమ్మడి మెదక్ ​జిల్లాలోని మున్సిపాలిటీల్లో ‘అవిశ్వాస ’ సెగలు

ఉమ్మడి మెదక్ ​జిల్లాలోని మున్సిపాలిటీల్లో ‘అవిశ్వాస ’ సెగలు
  • తెరవెనుక ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేల పాత్ర ఉందనే అనుమానాలు 
  • సొంత పార్టీ కౌన్సిలర్ల తిరుగుబాటుతో కంగుతింటున్న చైర్మన్లు 
  • నిన్నమొన్నటివరకు కలిసి ఉన్నవాళ్లే ఇప్పుడు కాదనడంతో ఆందోళన  
  • ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. రసవత్తరంగా మారుతున్న రాజకీయం 

సంగారెడ్డి/మెదక్, వెలుగు :ఉమ్మడి మెదక్ ​జిల్లాలోని మున్సిపాలిటీల్లో ‘అవిశ్వాస ’ సెగలు ఆసక్తి రేపుతున్నాయి. సాధారణ ఎన్నికల హడావుడి మొదలవుతుండడంతో సెకండ్​ కేడర్ లీడర్లుగా ఉన్న మున్సిపల్​ చైర్మన్లు ఎమ్మెల్యే టికెట్​ కోసం ప్రయత్నాలు చేస్తున్నారని వారికి చెక్​ పెట్టేందుకు ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు వారిపై అవిశ్వాసం తీర్మానాలకు ప్లాన్​ చేస్తున్నట్లు పలువురు చర్చించుకుంటున్నారు. నిన్నమొన్నటి వరకు కలిసి వెన్నంటే ఉన్న సొంత పార్టీ కౌన్సిలర్లే ఒక్కసారిగి తిరుగుబాటు జెండా ఎగురవేయడం అధికార పార్టీ చైర్మన్లకు అంతుచిక్కడం లేదు. సంగారెడ్డి జిల్లాలో సంగారెడ్డి, అందోల్–జోగిపేట మున్సిపల్ చైర్మన్,  వైస్ చైర్మన్లపై సొంత పార్టీ కౌన్సిలర్లు అవిశ్వాసం తీర్మానం పెట్టడం చర్చనీయాంశంగా మారింది. ఒకటి, రెండు రోజుల్లో సదాశివపేట మున్సిపాలిటీలో కూడా ఇదే పరిస్థితి నెలకొనే అవకాశం కనిపిస్తోంది. 

సంగారెడ్డిలో ముందస్తు వ్యూహమే..?

సంగారెడ్డి గ్రేడ్ వన్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ చైర్ పర్సన్ బొంగుల విజయలక్ష్మి, వైస్ చైర్ పర్సన్ లత విజయేందర్ రెడ్డిపై 22 మంది సొంత పార్టీ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం పెట్టిన  విషయం తెలిసిందే. ఈ విషయం ఇప్పుడు నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది. ఒకరిద్దరు ముఖ్య నేతలు ఈ వ్యవహారాన్ని చాటుగా ఉండి నడిపిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. చైర్ పర్సన్ విజయలక్ష్మి భర్త బొంగుల రవి ఈసారి ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేయనున్నారన్న గాసిప్స్ జోరందుకోవడంతో ముందస్తు వ్యూహంలో భాగంగా ‘అవిశ్వాస’ అస్త్రంతో అతడిని రాజకీయంగా ఎదగనివ్వకుండా చేస్తున్నారనే చర్చ నడుస్తోంది. 

 ఆ రెండు మున్సిపాలిటీలోనూ అదే పరిస్థితి.. 

సంగారెడ్డి జడ్పీ చైర్ పర్సన్ మంజుశ్రీ, స్థానిక ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ మధ్య కొంతకాలంగా రాజకీయంగా ఎడమొహం.. పెడమొహంగా ఉంటున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారం కాస్త అందోల్–జోగిపేట మున్సిపల్ పాలకవర్గంపై పడిందన్న ప్రచారం జరుగుతోంది. ఇక్కడున్న 12 మంది కౌన్సిలర్లు చైర్మన్, వైస్​ చైర్మన్​పై శనివారం అవిశ్వాసం పెట్టిన విషయం తెలిసిందే. సదాశివపేట మున్సిపాలిటీలో కూడా బీఆర్ఎస్ కౌన్సిలర్లు కొందరు మాజీ ఎమ్మెల్యే, చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్ పై ఉన్న అసంతృప్తి చైర్ పర్సన్ పిల్లోడి జయమ్మ పదవికి ఎసరు పెట్టిందన్న ప్రచారం జరుగుతోంది. కొంతకాలంగా చైర్ పర్సన్ కు, మాజీ ఎమ్మెల్యే కు రాజకీయంగా దూరం పెరిగిందని, అందుకే ఇలాంటి రాజకీయాలు ఎక్కువయ్యాయని జయమ్మ వర్గీయులు ఆరోపిస్తున్నారు. ఏదేమైనా సాధారణ ఎన్నికలు దగ్గరపడేకొద్దీ ఆయా నియోజకవర్గాల్లో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. 

పార్టీ మారిండని గద్దె దించేందుకు ప్లాన్​ 

మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎర్రగొల్ల మురళీ యాదవ్ బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పోటీలో ఉండే అవకాశం ఉంది. దీంతో రాజకీయంగా ఆయన ఎదుగుదలకు చెక్​ పెట్టేందుకు అవిశ్వాసతో  గద్దె దించేందుకు బీఆర్ఎస్ కౌన్సిలర్లు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. 2020లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ పై  కౌన్సిలర్ గా గెలిచిన మురళీ యాదవ్ చైర్మన్ అయ్యారు. కాగా మున్సిపల్ చైర్మన్ పదవి దక్కినప్పటికీ తనకు పార్టీ సముచిత స్థానం కల్పించడం లేదని మురళీ యాదవ్ అసంతృప్తితో ఉన్నాడు. ఈ క్రమంలో బీఆర్ఎస్ లో బీసీలకు అన్యాయం జరుగుతుందంటూ పార్టీ అధిష్టానం, సీఎం కేస్ఆర్ పై తీవ్ర విమర్శలు చేయగా ఆయనను బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. దీంతో మురళీ యాదవ్​ బీజేపీలో చేరారు. అప్పటి నుంచి ఆయన ప్రభుత్వంపై, స్థానిక ఎమ్మెల్యే పై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో కారు గుర్తు మీద కౌన్సిలర్ గా గెలిచి చైర్మన్ పదవి అధిష్టించి పార్టీకి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న మురళీ యాదవ్ మీద అవిశ్వాసం పెట్టేందుకు బీఆర్ఎస్ కౌన్సిలర్లు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా ఇటీవల పలువురు కౌన్సిలర్లు హైదరాబాద్ వెళ్లి స్థానిక ఎమ్మెల్యే మదన్ రెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీతా రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా మంత్రి హరీశ్ రావును కలిశారు. విషయాన్ని మినిస్టర్​దృష్టికి తీసుకెళ్లడంతో అవిశ్వాసానికి వారు కూడా ఓకే చెప్పినట్లు తెలిసింది.