ఎర్రబెల్లి ఇట్ల.. కడియం అట్ల!

ఎర్రబెల్లి ఇట్ల.. కడియం అట్ల!
  •      ఉమ్మడి వరంగల్​ జిల్లాలో ఖాళీ అయిన కారు
  •     మిగిలిన ఇద్దరు కీలక నేతలకు కొత్త తలనొప్పులు

వరంగల్, వెలుగు: నిన్నమొన్నటిదాకా బీఆర్ఎస్​కు కంచుకోటలా ఉన్న  ఉమ్మడి వరంగల్​ జిల్లాలో ఆ పార్టీ పరిస్థితి నానాటికీ దిగజారుతోంది. పార్లమెంట్​ ఎన్నికల్లో వరంగల్‍ (ఎస్సీ), మహబూబాబాద్‍ (ఎస్టీ) నియోజకవర్గాల్లో పార్టీని విజయపథంవైపు నడిపించాల్సిన  బలమైన దళిత, గిరిజన నాయకులు గులాబీ  పార్టీకి దూరమయ్యారు. ఇలాంటి టైంలో ఎన్నికలను భుజాలమీద వేస్కోని పనిచేస్తారని భావించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావును ఫోన్‍ ట్యాపింగ్‍ కేసు టెన్షన్ ​పెడ్తుండగా, వరంగల్​ టికెట్​ విషయంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి సొంత పార్టీ నేతల నుంచి అసమ్మతి  ఎదుర్కొంటున్నారు.  ఇలాంటి పరిస్థితుల్లో సిట్టింగ్ ​సీట్లను ఎలా కాపాడుకోవాలో తెలియక హైకమాండ్​ తలపట్టుకుంటోంది. 

పార్టీని వీడిన సీనియర్లు..

మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య, పార్టీ వరంగల్‍ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎస్సీ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్‍, వరంగల్‍ సిట్టింగ్ ఎంపీగా పసునూరి దయాకర్‍ బీఆర్ఎస్​లో బలమైన దళిత లీడర్లుగా ఉండేవారు. వీరిలో ఆరూరి రమేశ్‍, తెలంగాణ ఉద్యమ సమయంలో కాకతీయ యూనివర్సిటీ కేంద్రంగా ఎనలేని సేవలందించిన గిరిజన నేత, మాజీ ఎంపీ అజ్మీరా సీతారాం నాయక్‍  బీజేపీలో చేరగా.. పసునూరి దయాకర్ తో పాటు సీనియర్‍ దళిత నేతలైన మాజీ ఎమ్మెల్సీ పుల్లా పద్మావతి భాస్కర్‍ దంపతులు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. 

తాటికొండ రాజయ్య సైతం బీఆర్ఎస్​కు దూరమయ్యారు.  మహబూబాబాద్‍లో సిట్టింగ్‍ ఎంపీ మాలోతు కవితకు బీఆర్ఎస్​ టికెట్ ఇవ్వగా.. ఆమెతో ఉన్న విభేదాల దృష్ట్యా మహబూబాబాద్‍ మాజీ ఎమ్మెల్యే శంకర్‍నాయక్‍, ఎమ్మెల్సీ మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‍ కవిత కోసం పనిచేసే పరిస్థితి కనిపించడంలేదు.  

ఫోన్‍ ట్యాపింగ్‍ కేసులో ఎర్రబెల్లికి టెన్షన్ 

ఉమ్మడి వరంగల్‍ జిల్లాలో బీఆర్ఎస్​కు పెద్దన్నలా వ్యవహరించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు ఫోన్‍ ట్యాపింగ్ కేసులో హైరానా పడ్తున్నారు. ఎస్ఐబీ డీఎస్పీ దుగ్యాల ప్రణీత్​రావు కస్టడీ తర్వాత ఈ కేసుకు సంబంధించి కొత్తగా పలువురు నేతలు, పోలీస్​ఆఫీసర్ల పేర్లు బయటకు వస్తున్నాయి. ఈ క్రమంలో అరెస్టులు కూడా మొదలయ్యాయి. ఫోన్ ​ట్యాపింగ్​లో భాగంగా వరంగల్‍ జిల్లా పర్వతగిరి కేంద్రంగానూ ఓ వార్​రూమ్​ ఏర్పాటుచేశారని వార్తలు వచ్చాయి. 

అందుకు తగ్గట్లే ఇక్కడ ఇన్​చార్జీలుగా పనిచేసిన ఇద్దరు పోలీస్​ఆఫీసర్లను కూడా అదుపులోకి తీసుకోవడంతో ‘పర్వతగిరి వార్​ రూమ్’​  అంశానికి మరింత బలం చేకూరింది.  ఇప్పటికే పాలకుర్తి నియోజకవర్గంలో ఊహించని ఓటమితో తీవ్ర నిరాశలో ఉన్న ఎర్రబెల్లిని ఈ ఫోన్‍ ట్యాపింగ్ కేసు కలవరపెడుతోంది. ఏ క్షణంలోనైనా ఎర్రెబెల్లిని అరెస్ట్  చేయవచ్చనే ప్రచారం జరుగుతుండడంతో ఆ ఇష్యూ నుంచి ఎలా బయటపడాలో తెలియక మాజీ మంత్రి తీవ్ర ఆందోళనలో ఉన్నట్లు ఆయన అనుచరులు చెప్తున్నారు.

బిడ్డకు ఎంపీ టికెట్‍తో.. ఏకాకిలా కడియం..
 
స్టేషన్‍ ఘన్​పూర్ ఎమ్మెల్యేగా గెలిచిన కడియం శ్రీహరి తన ఆధిపత్య రాజకీయాలతో బీఆర్ఎస్​లోని మిగిలిన లీడర్లను తొక్కేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఆయన తీరు నచ్చకే మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య, పార్టీ వరంగల్‍ జిల్లా అధ్యక్షుడు ఆరూరి రమేశ్, సిట్టింగ్‍ ఎంపీ పసునూరి దయాకర్‍ పార్టీని వీడారని అంటున్నారు. ఎర్రబెల్లికి, కడియం శ్రీహరికి ఎప్పటినుంచో వైరం ఉంది.  కొద్ది రోజులుగా జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్​రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు శ్రీహరితో పొసగడంలేదు. 

ఇక ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయం కోసం ముందుండి నడిచిన ఉద్యమకారులు, కేయూ జేఏసీ నేతలు, మాజీ కార్పొరేటర్లు కడియం పేరు చెబితే భగ్గుమంటున్నారు. సీనియర్లు, ఉద్యమకారులను తొక్కేసి.. పార్టీతో, ఉద్యమంతో సంబంధంలేని తన బిడ్డకు ఎంపీ టికెట్​ ఎలా ఇప్పించుకుంటాడని బహిరంగంగానే మాట్లాడుతున్నారు.  కావ్య అభ్యర్థిత్వం విషయంలో హైకమాండ్‍ మరోసారి పునరాలోచన చేయాలని, లేదంటే  తమదారి తాము చూసుకుంటామని అల్టిమేటం ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.