‘మునుగుడు’ ముచ్చట.. అప్పుడో మాటా.. ఇప్పుడో మాట!

‘మునుగుడు’ ముచ్చట.. అప్పుడో మాటా.. ఇప్పుడో మాట!
  • సున్నంబట్టి, కె.కాశీనగరం ముంపుపై మాట మార్చిన ఆఫీసర్లు
  • వరదల సమయంలో హామీల వర్షం
  • ప్రస్తుతం చడీచప్పుడు చేయడం లేదు
  • ప్యాకేజీ అడిగితే పట్టించుకోవడం లేదు
  • బాధిత గ్రామాలవాసుల ఆవేదన

భద్రాచలం,వెలుగు: గోదావరి నదికి 2022లో వచ్చని వరదల్లో తీవ్రంగా నష్టపోయిన గ్రామం సున్నంబట్టి. ఇక్కడ130 కుటుంబాలు ఉంటాయి. ఈ గ్రామంతోపాటు పక్కనే ఉన్న కె.కాశీనగరంలో 70 కుటుంబాలు ఉంటాయి. ఈ రెండు గ్రామాలు గోదారి వరదలకే కాదు సీతమ్మ సాగర్​ బ్యారేజీ నిర్మాణంలో కూడా ముంపునకు గురవుతున్నాయి. వరదలు తగ్గాక ఆఫీసర్లు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రి పువ్వాడ అజయ్​కుమార్​తోపాటు కలెక్టర్, ఇతర ఆఫీసర్లంతా ఈ గ్రామానికి వెళ్లి హామీల వర్షం కురిపించారు. ‘ఊరు ఖాళీ చేస్తే మీకు డబుల్ ​బెడ్​రూం ఇల్లు కట్టించి ఇస్తం.. సకల సౌలత్​లు కల్పిస్తం’.. అని నమ్మబలికారు. ‘మన బతుకులు మారతయి’.. అని సంబర పడ్డ వరద బాధితులు పక్కనే ఉన్న రామచంద్రాపురం గ్రామంలో 15 ఎకరాల స్థలం చూపిస్తే ఓకే అన్నారు. అంతామంచే జరుగుతుందని అనుకున్నారు. కరకట్ట కోసం కూడా గ్రామంలో కొంత స్థలం తీసుకుని పరిహారం ఇచ్చారు. ఆఫీసర్లతో తమకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. రామచంద్రాపురంలో స్థలం చూపించి డబుల్​బెడ్ రూం ఇల్లు ఇస్తే సరిపోదు. తాము ఇక్కడ ఉపాధిని కోల్పోతున్నందున ప్యాకేజీ కావాలని వారు అడిగారు. దీంతో ఆఫీసర్ల వాయిస్​మారిపోయింది. కరకట్ట కడుతున్నాం.. కాబట్టి ఊరు మునగదు. ఇక్కడే ఉండొచ్చు’.. అంటూ వారిని నమ్మించే ప్రయత్నం చేశారు. ఫలితంగా సున్నంబట్టి వాసులు ఖంగుతిన్నారు. వరదలప్పుడు వల్లమాలిన సానుభూతిని చూపించిన ఆఫీసర్లు ఇప్పుడు ప్యాకేజీని ప్రస్తావిస్తే మాట మారుస్తున్నారని ఆరోపిస్తున్నారు.

సర్వం కోల్పోయిన నిర్వాసితులు..

సీతమ్మసాగర్​ప్రాజెక్టు బ్యాక్ వాటర్ కారణంగా సున్నంబట్టి, కె.కాశీనగరం గ్రామాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉంది. ఇందుకు గతేడాది వచ్చిన వరదలే సాక్ష్యం. 210 కుటుంబాలు వరదల్లో సర్వం కోల్పోయాయి. గ్రామాలైతే నామరూపాల్లేకుండా పోయాయి. ఇళ్లు కొట్టుకుపోయాయి. వేసిన పంటలు మునిగిపోయాయి. దారీతెన్నూ లేక విలవిల్లాడారు. వచ్చే వర్షకాలంలోనూ ఇదే పరిస్థితి రిపీట్​అవుతుందని స్థానికులు భయపడుతున్నారు. గ్రామంలోని నిర్వాసితులకు ప్యాకేజీ ఇవ్వకుండా కేవలం కరకట్ట కట్టి నీళ్లు రాకుండా చూస్తామని ఇటు పాలకులు, అటు ఆఫీసర్లు చెబుతున్నారు తప్ప సరైన హామీ ఇవ్వడం లేదు. ముందు మునుగుతుందని ఊరు ఖాళీ చేయించి వేరే చోట ఇళ్లు కట్టించి ఇస్తామన్న ఆఫీసర్లు ఒక్కసారిగా మాటమార్చడంపై నిర్వాసితులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ రెండు గ్రామాల్లో ఎన్జీవో ద్వారా వరద బాధితులకు ఇల్లు కట్టడానికి ఆఫీసర్లు పర్మిషన్​ ఇచ్చారు. వరదల సమయంలో ముంపు పేరు చెప్పి, ఇప్పుడేమో ముంపే ఉండదనే నాల్కల ధోరణితో వ్యవహరిస్తున్న ఆఫీసర్ల తీరుపై నిర్వాసితులు మండిపడుతున్నారు. సీతమ్మసాగర్​ బ్యారేజీతో ముంపునకు గురవుతున్న నేపథ్యంలో ఆర్అండ్ఆర్ ప్యాకేజీ అడిగినందుకే ఆఫీసర్ల స్వరం మారిందని రెండు గ్రామాల ప్రజలు అంటున్నారు. 

పోరాటం చేస్తం..

కరకట్ట కట్టి ముంపు లేదని తప్పించుకుంటే ఊరుకోం. పోరాటం చేస్తం. సున్నంబట్టి, కె.కాశీనగరంలకు సీతమ్మసాగర్​బ్యారేజీతో కల్గే నష్టానికి ప్యాకేజీ, పరిహారం ఇచ్చేంత వరకు ఆందోళనలు చేస్తం. వరదలప్పుడు గ్రామాలు మునుగుతయి అని చెప్పి, ఇప్పుడేమో మునగవని తప్పించుకోవడం దారుణం. అంజిపాక, మంగువాయిబాడువ, రామచంద్రాపురంలలో స్థలం చూశారు. కలెక్టర్​వచ్చి ఇల్లు కట్టించి ఇస్తమన్నరు. ఇప్పుడేమో మాటమారింది.–నల్లగొర్ల ప్రభాకర్, సున్నంబట్టి

స్థలం చూసి ఎంపిక చేశాం...

వరదల సమయంలో సున్నంబట్టి, కె.కాశీనగరం గ్రామాల బాధితులకు స్థలం చూడమంటే సర్వే నెంబరు32లో చూసి ఎంపిక చేశాం. రామచంద్రాపురంలోని ఈ స్థలం వారికి ఇచ్చేందుకు నివేదిక కూడా పంపించాం. కానీ తర్వాత ఎటువంటి ఆర్డర్స్ రాలేదు. సర్వేయర్​తో ప్రభుత్వ స్థలాలు సర్వే చేయించాం. ఉన్నతాధికారులే నిర్ణయం తీసుకోవాలి.–ప్రతాప్, తహసీల్దార్, దుమ్ముగూడెం