కొండపోచమ్మ ఆలయంలో కనీస సౌకర్యాలు కరువు.. ఇబ్బందుల్లో భక్తులు

కొండపోచమ్మ ఆలయంలో కనీస సౌకర్యాలు కరువు.. ఇబ్బందుల్లో భక్తులు
  • అమలుకు నోచని  రూ.45 కోట్ల ప్రతిపాదనలు 
  • ప్రైవేటు వ్యాపారులదే ఇష్టారాజ్యం
  • పట్టించుకోని ప్రజాప్రతినిధులు.. అధికారులు 

సిద్దిపేట/కొమురవెల్లి, వెలుగు :  సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలంలోని తీగుల్ నర్సాపూర్ పంచాయతీ పరిధిలోని కొండపోచమ్మ అమ్మవారి దర్శనానికి ఏటా భక్తుల సంఖ్య పెరుగుతున్నా అందుకనుగుణంగా అభివృద్ధి పనులు జరగడం లేదు. భక్తులు కొమురవెల్లి మల్లన్న దర్శనం అనంతరం ఆనవాయితీగా కొండ పోచమ్మ ఆలయానికి వస్తుంటారు. ఈ నెలలో మల్లన్న జాతర ప్రారంభం కానుండటంతో వచ్చే మూడునెలలు కొండ పోచమ్మ ఆలయం భక్తులతో రద్దీగా ఉంటుంది. ఏటా రూ.2 కోట్ల ఆదాయం వస్తున్నా ఆలయం వద్ద కనీస వసతులు కల్పించకపోవడంపై భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. 

ప్రతిపాదనలు చేసిన్రు.. పనులు మరిచిన్రు.. 

కొండపోచమ్మ రిజర్వాయర్ ప్రారంభం సందర్భంగా 2020 జూన్​లో సీఎం కేసీఆర్ ఆలయాన్ని సందర్శించి అభివృద్ధికి ప్రతిపాదనలు రూపొందించాలని ఆదేశించారు.  దీంతో ఆలయ నిర్మాణానికి రూ.20 కోట్లు,  యాగశాల, కాటేజీలు, మండపాల నిర్మాణానికి మరో రూ.25 కోట్లు ఖర్చువుతుందని అధికారులు  ప్రతిపాదనలు రూపొందించారు. తరువాత మంత్రులు హరీశ్​రావు, తలసాని శ్రీనివాస్​ యాదవ్  ఆలయ అభివృద్ధిపై ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. కానీ ఇప్పటికీ పనుల్లో ఎలాంటి పురోగతి లేదు. ఆలయ అభివృద్ధికి ప్రత్యేక యాక్షన్​ ప్లాన్​ తయారు చేయాలని ఎంపీ ప్రభాకర్​రెడ్డి ఆదేశాలు, ఆలయ సమీపంలోని చెరువును మినీ ట్యాంక్​ బండ్​గా మారుస్తామన్న ఇతర నేతల హామీలు కూడా ఇంకా అమలుకు నోచలేదు.

సౌలతుల్లేక..

కొండ పోచమ్మ ఆలయం వద్ద కనీస సౌకర్యాలు లేక భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. సరైన వసతి లేక పడరాని పాట్లు పడుతున్నారు. ఇదే అదనుగా ప్రైవేటు వ్యాపారులు రెచ్చిపోతున్నారు. దేవస్థానం రూములు దొరకకపోవడంతో ప్రైవేటు రూములు, తడకలతో ఏర్పాటు చేసిన స్థలాల్లో  భక్తులు సేద తీరాల్సి వస్తోంది. దీంతో  ప్రైవేట్​ వ్యక్తులు భారీగా వసూలు చేస్తున్నారు. జాతర సమయంలో రూములు, టెంట్లకు వేల రూపాయలను అద్దెగా తీసుకుంటున్నారు. వాహనాల పార్కింగ్ కు స్థలం లేకపోవడంతో  ప్రైవేటు స్థలాల్లోనే పెట్టాల్సిన పరిస్థితి ఉంది. దీంతో ఇష్టారీతిగా పార్కింగ్ ఫీజులు వసూలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఆలయం వద్ద పారిశుధ్య పనులు సరిగా లేకపోవడంతో చెత్తాచెదారం పేరుకుపోతోంది. రోడ్లపైనే మురుగు నీరు నిలుస్తున్నా పట్టించుకునేవారే లేరు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ఆలయం వద్ద అభివృద్ధి పనులు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. 

ఇబ్బందిగా ఉంది.. 

కొండ పోచమ్మ ఆలయం వద్ద సౌలతులేమీ లేవు. అమ్మవారి దర్శనానికి వేల సంఖ్యలో భక్తులు వస్తున్నా అధికారులు అభివృద్ధి పనులు చేయకపోవడం సరికాదు. ప్రైవేటు వ్యాపారులు ఇష్టమొచ్చినట్లు వసూలు చేస్తున్నా పట్టించుకునేవారే లేరు. ఈ పరిస్థితితో మస్తు ఇబ్బందిగా ఉంది. 
- కిషోర్,  భక్తుడు, హైదరాబాద్

ఆలయ అభివృద్ధికి ప్రత్యేక మాస్టర్ ప్లాన్

కొండపోచమ్మ ఆలయం అభివృద్ధికి ప్రత్యేక మాస్టర్ ప్లాన్ ను రూపొందించాం. దీంతో పాటు ఇతర అభివృద్ధి పనుల నిర్వహణ ప్రతిపాదనలకు దేవాదాయ  కమిషనర్  ఆమోదం పొందింది. పనుల కోసం ప్రైవేట్ వ్యక్తుల నుంచి  స్థల సేకరణ చేయాల్సి ఉండటంతో కొంతమేర ఆలస్యానికి కారణమవుతోంది. ఆలయం వద్ద కనీస వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
- మోహన్ రెడ్డి, కొండ పోచమ్మ ఆలయ ఈఓ