ప్రభుత్వ ఆస్పత్రిలో డాక్టర్లు ఉంటలేరు.. ఇచ్చిన మందులు పనిచేస్తలేవు

ప్రభుత్వ ఆస్పత్రిలో డాక్టర్లు ఉంటలేరు.. ఇచ్చిన మందులు పనిచేస్తలేవు
  • వైద్యం అందుతలేదని డీఎంహెచ్ఓతో రోగుల ఆవేదన
  • పోలీసులను పిలవమంటారా అంటూ ఆఫీసర్  ఆగ్రహం
  • ములుగు జిల్లా ఏటూరునాగారంలో ప్రైవేట్​ ఆస్పత్రిని సందర్శించిన డీఎంహెచ్ఓ

ఏటూరునాగారం, వెలుగు : వర్షాకాలం మొదలైనప్పటి నుంచి సీజనల్  వ్యాధులు ఏజెన్సీ ప్రజలను పట్టిపీడిస్తుండడంతో ప్రభుత్వ దవాఖానాలతో పాటు ప్రైవేటు ఆసుపత్రులు కూడా రోగులతో కిటకిటలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం ములుగు డీఎంహెచ్ఓ ఆలెం అప్పయ్య మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు హాస్పిటల్ ను విజిట్​ చేసి అక్కడి రోగులతో మాట్లాడారు. సర్కారు ఆసుపత్రుల్లో మంచి వైద్యం అందుతుంటే పైసలు పెట్టి ప్రైవేటు ఆసుపత్రులకు ఎందుకు వెళ్తున్నారని రోగులను ఆయన ప్రశ్నించారు. తాము ఇచ్చిన మందులను మూడు రోజులు వాడిన తరువాత ప్రైవేటు హాస్పిటల్​కు వెళ్తే ప్రైవేటు ఆస్పత్రుల డాక్టర్లు ఇచ్చిన మందులకు కాకుండా తాము ఇచ్చిన మందుల వల్లే జ్వరాలు, ఇతర జబ్బులు నయం అయితున్నాయని వారితో డీహెచ్ఓ అన్నారు.

దీంతో అక్కడున్న రోగులంతా ఆయనపై విరుచుకుపడ్డారు. రోగాల బారినపడిన తాము సర్కారు ఆసుపత్రికి వెళ్తే అక్కడ డాక్టర్లు ఉండడం లేదని, సరైన మందులు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందుబాటులో ఉన్న సిబ్బందే మందులు ఇచ్చి పంపుతున్నారు తప్ప సర్కారు దవాఖానలో సరైన వైద్యం అందడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జ్వరాలు, కాళ్ల నొప్పులతో ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే, అక్కడ ఇచ్చిన మందులు పనిచేయడం లేదని ఓ పేషెంట్​ తెలిపాడు. మోకాళ్ల నొప్పులకు తమ దగ్గర మందులు లేవని, జ్వరాలను నయం చేస్తామని అప్పయ్య పేర్కొన్నారు. దీంతో మహిళా రోగులు ప్రభుత్వ ఆస్పత్రిలో అస్సలు వైద్యం అందడం లేదని, డాక్టర్లు ఉండడం లేరని చెప్పారు. టెస్టులు చేయడం లేదని, మందులు సరిగా ఇవ్వడం లేదని తెలిపారు. దీంతో అసహనానికి గురైన అప్పయ్య.. ‘‘ఎందుకు గొడవ చేస్తున్నారు? పోలీసులను పిలవమంటారా?” అంటూ రోగులపై మండిపడ్డారు. కాగా, డీఎంహెచ్ఓ అప్పయ్య తీరుపై ఉమ్మడి వరంగల్​ జిల్లావ్యాప్తంగా సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.