అనుకుందే అయ్యింది.. బిగ్బాస్లో నో ఎలిమినేషన్

అనుకుందే అయ్యింది.. బిగ్బాస్లో నో ఎలిమినేషన్

బిగ్‌బాస్‌ ఆరో సీజన్ మొదలయ్యాక వచ్చిన మొదటి వీకెండ్ మస్తుమస్తుగా సాగింది. శనివారం ఎపిసోడ్‌లో అందరికీ చురకలు అంటించిన నాగార్జున.. ఆదివారం ఎపిసోడ్‌లో మాత్రం హుషారు రేకెత్తించారు. ఒక్కో కంటెస్టెంట్‌ని సేవ్ చేస్తూ.. చివరికి ఎవరు వెళ్లిపోతారోననే టెన్షన్ అంతకంతకూ పెంచుతూ అద్భుతంగా ఎంటర్‌‌టైన్ చేశారు.

స్టార్ ఆఫ్ ద వీక్

ముందుగా కంటెస్టెంట్స్ అందరినీ పరీక్షించారు నాగార్జున. కొన్ని ప్రశ్నల ద్వారా ఒకరి గురించి ఒకరు ఎంత తెలుసుకున్నారో ఆరా తీశారు. గెలిచినవారికి స్టార్‌‌ ఆఫ్ ద వీక్‌ అనే ట్యాగ్ వస్తుందని కూడా చెప్పారు. ఆర్జే సూర్య ఎంతమందిని మిమిక్రీ చేయగలడు అని అడిగితే చాలామందిని చేయలగడు అంటూ అతి తెలివి ప్రదర్శించింది ఇనయా. కానీ ఆరోహి మాత్రం ఇరవై మందిని అంటూ కరెక్ట్ ఆన్సర్ చెప్పింది. హౌస్‌లోకి రాగానే శ్రీహాన్ మొదట ఎక్స్ప్లోర్ చేసిన ప్లేస్ ఏంటని అడిగితే వాష్‌రూమ్ అని చెప్పింది నేహ. షానీ పేరుకి ఫుల్‌ఫామ్ ఏమిటని అడిగితే ఎవరూ చెప్పలేకపోయారు. దాంతో శ్రీలత, హర్షిత, అనిత, నిషా, ఇషా అనే పేర్లలోని మొదటి అక్షరాలన్నీ కలిపితే షానీ అయ్యిందని నాగ్ చెప్పారు. అయితే బాలాదిత్య తన ఆన్సర్స్తో నాగ్‌ని ఇంప్రెస్ చేశాడు. హౌస్‌లో బుట్టబొమ్మ ఎవరంటే మెరీనా అని చెప్పాడు. శ్రీసత్య శేఖర్ కమ్ముల సినిమా హీరోయిన్ అని, అభినయశ్రీ రౌడీ అని, ఫైమా ఫ్లవర్ కాదు ఫైర్ అని, నేహా స్ప్రింగ్ అని, కీర్తి బంగారుతల్లి అని, ఆరోహి సీమ టపాకాయ్ అని, వాసంతి గ్లామర్ ఆఫ్ బిగ్‌బాస్ అని, ఇనయా మిస్ స్మైల్ అని అన్నాడు. గీతూని అయితే గీతక్క అన్నాడు. దానికి గీతూ నేను బయట గట్టిగా ఉన్నా లోపల స్వీట్‌గా ఉంటానంది. అయితే నిన్ను పగలగొట్టాలంటావా అని నాగార్జున సెటైర్ వేయడంతో అందరూ నవ్వేశారు. గీతూ ఉడుక్కుంది. స్టార్ ఆఫ్ ద వీక్ ట్యాగ్‌ బాలాదిత్యని వరించింది. 

కొత్త ఆట.. ఏమిటా పాట?

హౌస్‌మేట్స్ని రెండు టీమ్స్ గా చేసి మరో ఆట ఆడించారు నాగ్. తాను చూపించే వస్తువును బట్టి సాంగ్‌ని గెస్ చేయమన్నారు. ముందుగా పువ్వును చూపిస్తే పువ్వుల్లో దాగున్న అంటూ జీన్స్ మూవీలోని పాటందుకున్నాడు శ్రీహాన్. అది తప్పయ్యింది. తర్వాత బంతిపూల జానకి అంటూ రేవంత్ కరెక్ట్ గా గెస్ చేశాడు. గోంగూర తోటకాడ కాపు కాశా, మ మ మహేశా లాంటి మరికొన్ని పాటల్ని సభ్యులు గెస్ చేసి పాడగలిగారు. అయితే మధ్యలో ఆదిరెడ్డి ఓ పాటకి వేసిన డ్యాన్స్ చూసి నాగ్‌కి తెగ నవ్వొచ్చింది. అందరినీ ఆపేసి అతనిని మాత్రమే చేయమన్నారు. అప్పుడతను వేసిన స్టెప్పులు చూసి నవ్వుతూ ఎంజాయ్ చేశారు. కాసేపటి తర్వాత గీతూని, శ్రీ సత్యని రెండు టీములకు ప్రతినిధులుగా పిలిచారు. తాను మ్యూజిక్ ప్లే చేస్తానని, ఎవరు ముందుగా బజర్ నొక్కితే వారికే ఛాన్స్ అని అన్నారు. సూపర్ స్పీడ్‌లో బజర్ నొక్కి గీతూని శ్రీసత్య డామినేట్ చేసింది. ఆమె ధాటికి తట్టుకోలేక మరొకరిని అక్కడ నిలబెట్టి గీతూ తప్పుకుంది. వెళ్లి కూర్చున్నావేంటని నాగ్ అడిగితే.. ఆ అమ్మాయి చేతులు పొడవుగా ఉన్నాయి, నా చేతులు పొట్టి కనుక తనే ముందు బజర్ ప్రెస్‌ చేసేస్తోందంటూ అతకని స్టోరీ ఒకటి చెప్పింది. దాంతో నాగ్.. పోటీకొస్తే తల్లిందండ్రులనైనా ఓడిస్తానన్నావుగా, వచ్చి ఆడు అంటూ సెటైర్ వేశారు. ఇక తప్పక గీతూ వచ్చింది. శ్రీసత్య చేతిలో ఓడిపోయింది. 

అనుకున్నదే అయ్యింది

ఈ వారం ఎలిమినేషన్ ఉండదు అంటూ జరిగిన ప్రచారం నిజమయ్యింది. హౌస్‌ నుంచి ఎవ్వరూ బైటికి పోలేదు. శనివారం ఎపిసోడ్‌లో చలాకీ చంటి, శ్రీసత్య సేఫ్ అయ్యారు. ఆదివారం ఎపిసోడ్‌లో రేవంత్, ఇనయా, ఫైమా సేఫ్ ముందుగా సేఫ్ అయ్యారు.  ఆరోహి, ఇనయా, అభినయశ్రీ మిగిలారు. వారిలో ఎవరితో మీకు ప్రాబ్లెమ్ ఉందంటూ హౌస్‌మేట్స్ ని అడిగారు నాగ్. ఏకంగా పద్నాలుగు మంది ఇనయాతో ప్రాబ్లెమ్ అని చెప్పారు. సంబంధం లేని విషయాల్లో దూరిపోతుందని, ముగిసిపోయిన విషయాన్ని మళ్లీ కొత్తగా మొదలెట్టి గొడవ చేస్తుందని, ప్రతిదానికీ ఆర్గ్యుమెంట్‌కి దిగుతుందని.. ఇలా ఎవరి కారణాలు వాళ్లు చెప్పారు. దాంతో తన గదిలోకి వెళ్లిపోయి ఘొల్లుమంది ఇనయా. నేహా వెళ్లి ఓదార్చింది. ఆ తర్వాత ఆరోహి సేఫ్ అయ్యి ఇనయా, అభినయ మిగిలారు. వాళ్లిద్దరికీ సెండాఫ్ ఇవ్వమని నాగ్ చెప్పడంతో అందరూ ఇచ్చారు. ఆ తర్వాత ఇద్దరినీ గార్డెన్ ఏరియాలోకి తీసుకెళ్లి, కౌంట్ డౌన్ పూర్తయ్యాక అక్కడున్న హ్యామర్స్ ని ఎత్తమన్నారు. ఎవరు ఎత్తగలిగితే వాళ్లు సేఫ్ అని చెప్పారు. ఇద్దరూ ఎత్తేయడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఇంకా ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రాసెస్‌లోనే ఉన్నారు కనుక ఈ వారం ఎవరినీ ఎలిమినేట్ చేయడం లేదంటూ చల్లగా చెప్పారు నాగ్. 

మొత్తానికి ఈ వీకెండ్ ఒకరోజు క్లాసులతోటి, మరో రోజు ఆట పాటలతోటీ గడిచింది. నెక్స్ట్ వీక్ ఎలా ఉంటుందోననే క్యూరియాసిటీ పెరిగింది. ప్రోమోని బట్టి నామినేషన్ ప్రక్రియ గరమ్‌ గరమ్‌గానే సాగేలా ఉంది. గీతూ మరోసారి గలాటా చేసినట్టు కనిపిస్తోంది. ఆ సంగతేంటో తెలుసుకోవాలంటే ఇంకొన్ని గంటలు వేచి చూడాల్సిందే!