బీఆర్కే భవన్ లోకి జనానికి నో ఎంట్రీ 

బీఆర్కే భవన్ లోకి జనానికి నో ఎంట్రీ 

ఎవరినీ లోపలికి పంపొద్దంటున్న ఐఏఎస్ లు 
కరోనా పోయినా రానిస్తలే 
లోపలి నుంచి ఫోన్ చేయించుకుంటేనే అనుమతి 
పెద్దలకు ఈజీగా ప్రవేశం
రెండున్నరేండ్లుగా జనాలకు తప్పని తిప్పలు 

హైదరాబాద్ :  రాష్ట్ర పరిపాలనకు గుండెకాయగా చెప్పుకునే సెక్రటేరియెట్​లో విజిటర్స్ ను ఐఏఎస్ ఆఫీసర్లు అనుమతించడం లేదు. సమస్యలను చెప్పుకొందామని జిల్లాల నుంచి వస్తున్న సామాన్య జనం తాత్కాలిక సెక్రటేరియెట్(బీఆర్కే భవన్)లోకి వెళ్లాలంటే పెద్ద యుద్ధమే చేయాల్సి వస్తోంది. చివరకు పది మందో.. ఇరవై మందో లోపలికి వెళితే.. ఎలా లోపలికి వచ్చారంటూ సంబంధిత ఐఏఎస్​లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేషీ సిబ్బందిపై అరుస్తూ తమ చాంబర్​లోకి పంపొద్దని, బీజీగా ఉన్నామని వెనక్కి పంపాలని ఆదేశిస్తున్నారు. దీంతో సమస్యలు పరిష్కారం అవుతాయని ఎన్నో ఆశలతో వస్తున్న వాళ్లు నిరాశతోనే వెనుదిరుగుతున్నారు. పై ఆఫీసర్లకు సమస్య చెప్పుకుంటే ఏదైనా సాయం అయితదనుకుని వస్తున్నామని, వాళ్లు చేసేదేమో కానీ.. అసలు కలుస్తనేలేరని వాపోతున్నారు. కింద గేటు దగ్గర లోపలికి రానియ్యడానికే కాళ్లావేళ్లా పడాల్సి వస్తోందని, అయినా పెద్ద సార్లు తమ సమస్యను, ఇబ్బందులను వినడానికి కూడా ముందుకు రాకపోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాత సెక్రటేరియేట్ కూల్చివేత కంటే ముందు పక్కనే ఉన్న బీఆర్కే భవన్​ను తాత్కాలిక సెక్రటరేరియేట్ గా మార్చారు. కరోనా టైంలో మొదలైన నో విజిటింగ్ ఆంక్షలు ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. సామాన్య ప్రజలకే కాకుండా, జిల్లాల కమిషనరేట్లు, డైరెక్టరేట్లలో పనిచేస్తున్న కింది స్థాయి ప్రభుత్వ సిబ్బందికి కూడా బీఆర్కే భవన్​లోకి ఎంట్రీ అంతా ఈజీగా కావడంలేదు. లోపలి నుంచి ఎంట్రీ గేట్ దగ్గర ఉండే ఎస్పీఎఫ్ పోలీసు సిబ్బందికి ఫోన్ వస్తేనే పంపిస్తున్నారు.  

సీఎస్ ఆదేశాలతోనే.. రానియ్యట్లే  
బీఆర్కే భవన్​లో పనిచేస్తున్న కొందరు ఐఏఎస్​ల తీరు ప్రభుత్వ పనితీరుకు అద్దం పడుతున్నదనే విమర్శలు వస్తున్నాయి. తన కొడుకుకి స్కాలర్​షిప్ రాలేదని, ఆసరా పెన్షన్ మంజూరు చేస్తలేరని, దళితబంధు జాబితాలో చేర్చాలని, తమ బిడ్డలను గురుకులాల్లో చేర్చుకోవాలని, డబుల్ బెడ్రూం ఇల్లు ఇప్పించాలని, ఓవర్సీస్ స్కాలర్​షిప్ శాంక్షన్ కానందున విదేశాల్లో బిడ్డ ఇబ్బందులు పడుతున్నాడని.. ఇలా అనేక రకాల ఇబ్బందులు, సమస్యలతో రోజూ150 నుంచి 200 మంది విజిటర్స్ బీఆర్కే భవన్ కు వస్తున్నారు. ఇందులో అష్టకష్టాలు పడి లోపలికి వెళ్లేది30 నుంచి 50 మందిలోపే. అన్నీ దాటుకుని సంబంధిత శాఖ సెక్రటరీ చాంబర్ దగ్గరకు వెళ్తే.. నో విజిటర్స్ మీట్​ అంటూ ఐఏఎస్​లు వారిని కలవడం లేదు. వాస్తవానికి పాత సెక్రటేరియట్ లో మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విజిటర్స్ కు అనుమతి ఉండేది. ఆ టైంలో వివిధ శాఖలకు చెందిన సెక్రటరీలు అందుబాటులో ఉండేవారు. కరోనా ముగిసినా.. సీఎస్ సోమేష్ కుమార్ ఆదేశాలతో లోపలికి ఎవరినీ రానివ్వట్లేదు.  

సెక్రటరీలు అందరికీ దూరం
దీపావళికి రెండ్రోజుల మందు పాలమూరు నుంచి ఒక మహిళ తన బిడ్డకు గురుకులలో సీటు కోసం బీఆర్కే భవన్​కు వచ్చింది. సిబ్బందిని ఉదయం11 నుంచి బతిలాడితే సాయంత్రం 4 గంటలకు ఆమెను లోపలికి పంపారు. ఇంతా చేసి పైన సెక్రటరీ చాంబర్ దగ్గరకు పోతే విజిటర్​ను ఎవరు పైకి పంపించారంటూ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ఎస్పీఎఫ్​ పోలీసులు చెబుతున్నారు. చివరకు ఆ మహిళ సెక్రటరీని కలవకుండానే తీవ్ర నిరాశతో వెనక్కి వెళ్లింది. రిటైర్ అయిన కూడా కొన్ని బెనిఫిట్స్ ఇంకా ఇవ్వట్లేదని ఫైనాన్స్ డిపార్ట్​మెంట్​లో కలిసేందుకు వస్తున్న రిటైర్డ్ ఎంప్లాయీస్​ను అసలు లోపలికి పంపడం లేదు. టీ ప్రైడ్​తో పాటు కొన్ని ఇండస్ర్టీ సబ్సిడీలు ఆగిపోయిన ఎంటర్ ప్రెన్యూర్లకు కూడా సంబంధిత సెక్రటరీని కలిసేందుకు అనుమతి దొరకడం లేదు. అదే పెద్ద కంపెనీలు, ఐటీ సంబంధిత ఉన్నతస్థాయి వాళ్లకి మాత్రం ఎంట్రీ ఈజీగా దొరుకుతున్నది. ఇక సంక్షేమ శాఖలు చూస్తున్న సెక్రటరీలు అయితే ఎప్పుడు అందుబాటులో ఉంటారో కూడా తెలియడం లేదు. రెండేళ్ల ఎక్స్​టెన్షన్ తెచ్చుకుని స్పెషల్ సీఎస్​గా కొనసాగుతున్న రిటైర్డ్​ ఐఏఎస్ ను ఇన్సెంటివ్ కోసం పాడి రైతులు, శాలరీల కోసం గోపాల మిత్రలు వస్తుంటే వారిని ఆ ఉన్నతాధికారి కలవడం లేదు. 

సీఎస్ పేషీకెళ్లడం సాహసమే 
బీఆర్కే భవన్​లోకి ఎంట్రీ ఒక ఎత్తు అయితే.. సీఎస్ సోమేశ్​కుమార్ చాంబర్ దాకా వెళ్లడం మరొక ఎత్తు. కనీసం సీఎస్ పేషీ వరకు వెళ్లాలన్నా ఆ ఫ్లోర్​లో ఎస్పీఎఫ్ పోలీసులను మరోసారి దాటాల్సి ఉంటుంది. పర్మిషన్ తీసుకుని వచ్చామని చెప్పినా సరే అంత ఈజీగా లోపలికి పంపట్లేదు. జూనియర్ ఐఏఎస్​లు, ఇతర గ్రూప్ 1 స్థాయి ఆఫీసర్లు ఎవరైనా సరే సీఎస్ అనుకుంటేనే కలుస్తున్నారు. కనీసం వినతిపత్రం ఇచ్చుకునే అవకాశం కూడా లేదని విజిటర్స్ వాపోతున్నారు.

లోపలికే పోనియ్యలే
డబుల్ బెడ్రూం ఇల్లు కావాలని అడిగేందుకు వచ్చిన. గంట బతిలాడినా లోపలికి పంపలేదు. జిల్లాలో అడిగితే పట్టించుకుంటలేరు. ఇక్కడకు వచ్చి చెప్తే అయినా సాయం చేస్తారేమో అనుకుంటే ఇక్కడా పట్టించుకుంటలేరు. - సైదులు, మహబూబాబాద్​

నేను వెళ్లినా సెక్రటరీ కలవలే
సమస్యలపై వినతి పత్రం ఇద్దామని బుధవారం బీఆర్కే భవన్​కు వచ్చిన. గతంలో మధ్యాహ్నం 3 నుంచి 5 వరకు విజిటర్స్​కు అనుమతి ఉండే. అప్పుడు చాంబర్లలో అందరూ సెక్రటరీలు అందుబాటులో ఉంటుండే. ఇప్పుడు తెలిసిన వాళ్లతో ఫోన్ చేయించుకుని లోపలికి వెళితే సెక్రటరే కలవలేదు. - జాజుల శ్రీనివాస్ గౌడ్, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు