
- రూ.360 తీసుకునే కాడ రూ.700 గుండుతున్నరు
- బావుల కాడ ఫూజులు పట్కపోతున్నరు
- ట్రాన్స్ ఫార్మర్లకు కరెంట్ రాకుండా ఫీడర్లు బంద్
- ఒక్కరు కట్టకపోయినా అందరికీ పనిష్ మెంట్
జయశంకర్ భూపాలపల్లి, వెలుగు : పై రెండు చోట్లనే కాదు. తెలంగాణ స్టేట్‌నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ (టీఎస్ ఎన్‌పీడీసీఎల్) పరిధిలోని అన్ని జిల్లాల్లో ప్రస్తుతం ఇదే పరిస్థితి కొనసాగుతోంది. సర్కారు ఫ్రీ కరెంట్ అని చెబుతున్నా ఎక్కడా అమలు కావడం లేదు. ప్రతి ఏడాది వసూలు చేసే కస్టమర్సర్వీస్ఛార్జీలు వసూలు చేయడం కోసం ఆఫీసర్లు ఏం చేయాలో అంతా చేస్తున్నారు. కేవలం రూ.360 రూపాయల కోసం రైతులను ఇబ్బందులు పెడుతున్నారు. ట్రాన్స్ ఫార్మర్ల దగ్గరికి కరెంట్ రాకుండా సబ్ స్టేషన్ల దగ్గరే ఫీడర్లను బంద్ చేస్తున్నారు. వ్యవసాయ మోటార్ల బిల్లుల వసూళ్ల కోసం ఇంటి కరెంట్‌ను కూడా కట్‌చేస్తున్నారు. బావుల దగ్గరికి వెళ్లి ఫ్యూజులు పట్కపోతున్నారు. దీంతో కొద్ది రోజులుగా రైతులు రోడ్లెక్కి ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారు.
రూ.360 కాదు..రూ.600..రూ.700
తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయం కోసం 24 గంటల ఉచిత కరెంటు ఇస్తామని ప్రకటించింది. అయితే ఏడాదికి ఒక వ్యవసాయ మోటార్‌పై కస్టమర్ ఛార్జీల పేరిట ఎన్‌పీడీసీఎల్ రూ.360 చొప్పున వసూలు చేస్తోంది. ఇలా ప్రతీ జిల్లాలో ఉన్న వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల ఆధారంగా రూ.20 లక్షల నుంచి రూ.కోటికి పైగా వసూలు చేయాలని టార్గెట్ పెట్టుకుంది. ప్రతీ యేటా డిసెంబర్ లో ఈ బిల్లులు వసూలు చేస్తుంటారు. కానీ, ఈ ఏడాది బిల్లుల వసూళ్ల విషయంలో ఎన్‌పీడీసీఎల్ ఆఫీసర్లు అతి చేస్తున్నారు. సర్కారు కట్టాలని చెప్పిన రూ.360 కాకుండా ఒక్కో ఏరియాలో ఒక్కో తరహాలో బిల్లులు వసూలు చేస్తున్నారు. ఒక మండలంలో రూ.500, మరో మండలంలో రూ.600, ఇంకో మండలంలో రూ.700 చొప్పున తీసుకుంటున్నారు. తమ గుట్టు బయటపడుతుందని రశీదులు కూడా ఇవ్వడం లేదు. ఒకవేళ ఆన్‌లైన్‌లో చూసినా కనిపించడం లేదు. అధికంగా వసూలు చేసిన డబ్బులను ఏఈ, లైన్‌మెన్, జూనియర్ లైన్‌మెన్లు వాటాలు వేసుకొని పంచుకుంటున్నారని రైతు సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు.
ఇంట్ల కరెంట్ కట్ చేస్తున్నరు
ఈ ఏడాది రైతుల నుంచి కస్టమర్సర్వీస్ఛార్జీల వసూళ్ల కోసం ఎన్‌పీడీసీఎల్ ఆఫీసర్లు సరికొత్త ఎత్తుగడ వేశారు. ఇంటి కరెంట్ బిల్లుకే వ్యవసాయ విద్యుత్ బిల్లును అటాచ్ చేశారు. ఎవరైతే వ్యవసాయ విద్యుత్ బిల్లు చెల్లించలేదో వాళ్ల ఇంటికి వెళ్లి కరెంట్ కట్ చేస్తున్నారు. దీంతో రైతు కుటుంబం మొత్తం చీకట్లో ఉండాల్సి వస్తోంది. వ్యవసాయ కరెంట్ బిల్లు చెల్లిస్తేనే తిరిగి ఇంటి కరెంట్ సరఫరా పునరుద్ధరిస్తున్నారు.
ఎండుతున్న వరినార్లు
విద్యుత్ శాఖలో తక్కువ మంది ఉద్యోగులు ఉన్నారనే నెపంతో బిల్లుల వసూళ్ల కోసం సబ్ స్టేషన్ నుంచే త్రీఫేజ్ కరెంట్ సరఫరా ఫీడర్లను బంద్ చేస్తున్నారు. దీనివల్ల బిల్లు చెల్లించిన రైతులు కూడా ఇబ్బంది పడాల్సి వస్తోంది. సాధారణంగా ఒక ఫీడర్‌పై రెండు, మూడు గ్రామాలకు కరెంట్ సరఫరా అవుతుంది. ఒక గ్రామంలో బకాయిలు ఉన్నాయని ఫీడర్ మొత్తం బంద్ చేస్తుండడంతో వేరే గ్రామాల రైతులు కష్టాలు పడాల్సి వస్తోంది. కరెంట్ రాక నీళ్లు పెట్టకపోవడంతో వరి నారు మడులు ఎండిపోతున్నాయి. దీంతో కొన్నిచోట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తుండడంతో వ్యవసాయ మోటార్ల దగ్గరికి వెళ్లి ఫ్యూజులు తీసుకెళ్తున్నారు. లేదంటే త్రీఫేజ్ కరెంట్ ట్రాన్స్ ఫార్మర్లను బంద్ చేస్తున్నారు.
ఈ ఫొటోలో రాస్తారోకో చేస్తున్న రైతులది జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి. వ్యవసాయ విద్యుత్ మోటార్ల కరెంట్ బిల్లులు కట్టలేదని బావుల కాడికి వచ్చే కరెంటును కట్‌చేయడంతో గురువారం నిరసనకు దిగారు. కొందరు బిల్లులు చెల్లించినా ఫీడర్ మొత్తం కరెంటు బంద్ చేయడంతో నారుమడులు, పంటలు ఎండిపోతున్నాయని, ఆఫీసర్లను అడిగితే పట్టించుకోకపోవడం లేదని ఫైర్అయ్యారు. చివరకు తహసీల్దార్హామీతో ఆందోళన విరమించారు.
ఈ రైతు పేరు మోత్కూరి రవి. ఈయన ఊరు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం మీనాజీపేట. ఇతడికి ప్రత్యేకంగా ట్రాన్స్‌ఫార్మర్ ఉంది. దీని కింద 5 ఎకరాల్లో పంట పండించుకుంటున్నాడు. కరెంట్బిల్లులు సక్రమంగానే కడుతున్నాడు. అయితే ఈ ఏడాది రూ.360 బిల్లు కట్టడం ఆలస్యమైందని మూడు రోజుల పాటు కరెంట్కట్చేశారు. దీంతో యాసంగిలో చల్లిన వరి నారుమడి దెబ్బతింది. గ్రామంలో ఉన్న మరో ఏడు ట్రాన్స్‌ఫార్మర్లకు కూడా ఇలాగే కరెంట్ కట్ చేయడంతో చాలా మంది రైతులు ఇబ్బందులు పడ్డారు. తీరా రైతులందరూ బిల్లులు చెల్లించిన తర్వాతే 3 రోజులకు సరఫరా పునరుద్ధరించారు.
రూ.720 తీసుకున్నరు
ఈసారి కరెంటోళ్లు ముందస్తుగానే విద్యుత్కట్ చేసి బిల్లుల వసూళ్లకు వచ్చారు. నా బావికి రూ.720 తీసుకున్నారు. ఒక్క రైతు బిల్లు కట్టకున్నా అందరికీ కరెంటు సరఫరా నిలిపివేస్తామని బెదిరిస్తున్నారు. డబ్బులు వసూలు చేయడంలో ఆఫీసర్లు కనికరం చూపడం లేదు.
‒మండల తిరుపతి, తిరుమలగిరి రైతు, రేగొండ మండలం
ఇండ్లలో కరెంట్ కట్ చేసుడేంది
బిల్లులు కట్టలేదని విద్యుత్‌శాఖాధికారులు ఫీడర్లు, ట్రాన్స్‌ఫార్మర్లు బంద్ చేస్తున్నారు. బిల్లులు చెల్లించలేదని కొన్ని చోట్ల ఇండ్లల్లో కరెంట్ తీసేస్తున్నరు. ఇదేం పద్ధతి? రూ.360 తీసుకోవాలని ఉంటే కొన్నిచోట్ల ఇష్టం వచ్చినట్లుగా రూ.500, రూ.600 తీసుకుంటున్నరు. ఇదంతా చూస్తూ ప్రభుత్వం ఎందుకు సైలెన్స్‌గా ఉందో అర్థం కావడం లేదు.
‒ ఎన్‌రెడ్డి హంసరెడ్డి, రైతు సంఘం నాయకులు, హనుమకొండ జిల్లా