3 నెలలుగా పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ లకు నిధుల్లేవ్

3 నెలలుగా పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ లకు నిధుల్లేవ్
  • పైసల్లేక లోకల్​బాడీల్లో పనులు బంద్
  • కార్మికులకు అందని జీతాలు.. ఇల్లు గడవక కష్టాలు

హైదరాబాద్, వెలుగు: గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్ లకు మూడు నెలలుగా రాష్ట్ర సర్కార్ నిధులు విడుదల చేయడం లేదు. దీంతో గ్రామాలు, మండలాల్లో డెవలప్ మెంట్ వర్క్స్ నిలిచిపోతున్నాయి. ఏటా 15వ ఆర్థిక సంఘం నుంచి ఎన్ని నిధులు వస్తయో వాటికి సమానంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఫండ్స్​ఇస్తుందని సీఎం కేసీఆర్ ప్రకటించారు. 15వ ఆర్థిక సంఘం నుంచి ఏటా రూ.1415 కోట్లు గ్రాంట్ గా ఇస్తుండగా, అంతే మొత్తం రాష్ట్రం ఇస్తోంది. ప్రతి నెల గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ లకు రూ.256 కోట్లు విడుదల చేస్తున్నరు. అయితే ఈ నిధుల్లో ఎక్కువ భాగం పల్లె ప్రగతి పనులకే ఖర్చువుతున్నాయని సర్పంచ్ లు చెబుతున్నారు.

నేరుగా ఇస్తం.. వద్దు మా ద్వారా ఇవ్వండి

ఈ ఏడాది నుంచి జనవరి నుంచి 15వ ఆర్థిక సంఘం నిధులు రావట్లేదని పంచాయతీ రాజ్ అధికారులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం నేరుగా స్టేట్ ట్రెజరీ నుంచి గ్రామ పంచాయతీలకు పీఎఫ్ ఎంఎస్ ( పబ్లిక్ ఫైనాన్స్ మేనేజ్ మెంట్ సిస్టం ) ద్వారా నిధులను బదిలీ చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రతి గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ లకు బ్యాంక్ ఖాతా ఓపెన్ చేయించి, డిజిటల్ లాకర్ ను ఏర్పాటు చేసింది. ఈ అంశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య గ్యాప్ ఉందని పంచాయతీ రాజ్ శాఖకు చెందిన ఓ అధికారి తెలిపారు. కేంద్రం ఖరారు చేసిన ప్రాసెస్ కు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించటం లేదని ఆయన అన్నారు. రాష్ట్ర సర్కార్ మాత్రం కమిషనర్ కు పంపాలని, ఇక్కడి నుంచి విడుదల చేస్తామని కేంద్రానికి ప్రతిపాదన చేసినట్లు సదరు అధికారి తెలిపారు. ఈ విషయం పై క్లారిటీ వస్తే నిధులు వచ్చే అవకాశం ఉందన్నారు.

కార్మికులకు జీతాలు బంద్ 

నిధులు రాకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న సుమారు 40వేల మంది కార్మికులకు జీతాలు నిలిచిపోయాయి. గ్రామ పంచాయతీలే వీరికి జీతాలు ఇవ్వాల్సి ఉండటంతో ప్రతి నెల ప్రభుత్వం ఫండ్స్ ఇవ్వకపోవటంతో కార్మికులకు జీతాలు అందడం లేదు. అసలే నెలకు రూ.8,500 వేల తక్కువ జీతంతో పనిచేస్తున్న కార్మికులకు అవి కూడా రాకపోవడంతో  తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మాకు ఆరు నెలలుగా పైసా రాలే

మా గ్రామ పంచాయతీకి ఏప్రిల్ నుంచి నిధులు రావట్లేదు. డీపీవో ను అడిగితే స్పందన లేదు. కార్మికులకు సైతం జీతాలు ఇవ్వటం లేదు. మేం సబ్ ట్రెజరీలో సబ్మిట్ చేసిన చెక్కులు కూడా 3 నెలల నుంచి క్లియర్ కాట్లేదు. అధికార పార్టీ సర్పంచ్ లు సైతం ఇబ్బందులు పడుతున్నరు. నిధులు లేక గ్రామ పంచాయతీలు నిర్వీర్యం అవుతున్నయి.  - శ్రీరామ్ రెడ్డి, సర్పంచ్, దామెర, హనుమకొండ 

నిధులు లేక అభివృద్ధి ఆగింది

3 నెలలుగా గ్రామ పంచాయతీలకు నిధులు ఆగినయి. కార్మికులకు జీతాలు కూడా ఇవ్వలేక పోతున్నం. వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నరు. గతంలో పల్లె ప్రగతి ఉందని గ్రాంట్ విడుదల చేశారు. అది అయిపోయిన తర్వాత నుంచి నిధులు రావట్లే. అప్పుడు నిధులు విడుదల చేసి అందరిని హడావుడి చేశారు. గ్రామ పంచాయతీ కార్మికులకు ఇచ్చేదే తక్కువ.. వెంటనే నిధులు విడుదల చేయాలని కోరుతున్నం. - నిజామాబాద్ కు చెందిన సర్పంచ్

కార్మికుల జీతాలు చెల్లించాలి

గ్రామపంచాయతీ కార్మికులకు నాలుగు నెలలుగా వేతనాలు పెండింగ్ లో ఉన్నయి. ఇల్లు గడవక తీవ్ర ఇబ్బందులు పడుతున్నం. దసరా దీపావళి ఇలాంటి పెద్ద పండగలు కూడా చేసుకునే పరిస్థితి లేదు. మల్టీపర్పస్ విధానాలతో కార్మికులతో వెట్టి చాకిరి చేయించుకుంటున్నరు. అప్పులతో కుటుంబాన్ని గడిపే పరిస్థితి ఏర్పడింది. - మహేశ్, కార్మికుడు, నాగర్ కర్నూల్ జిల్లా