ఆ తల, చెయ్యి.. శ్రద్ధవేనా?

ఆ తల, చెయ్యి.. శ్రద్ధవేనా?

గత జూన్‌లో దొరికిన పార్ట్స్‌.. డీఎన్‌ఏ టెస్టులకు శాంపిల్స్‌
మెహ్రౌలీ ఫారెస్ట్‌లో గుర్తించిన భాగాలూ టెస్టులకు..
రెండింటినీ మ్యాచ్‌ చేసి.. శ్రద్ధవో కాదో నిర్ధారించనున్న పోలీసులు

న్యూఢిల్లీ/ముంబై : అతి కిరాతకంగా హత్య జరిగింది.. హంతకుడు దొరికాడు.. కానీ డెడ్‌బాడీ లేదు.. హత్యకు ఉపయోగించిన ఆయుధం లేదు.. శ్రద్ధా వాకర్‌ హత్య కేసు పరిస్థితి ఇది. కీలక సాక్ష్యాధారాలేవీ దొరకలేదు. ఈ నేపథ్యంలో గత జూన్‌లో ఢిల్లీ పాండవ్‌ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తిలోక్‌పురి ఏరియాలో గుర్తించిన ఓ తల, చెయ్యి.. శ్రద్ధ వాకర్‌‌వేనా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శ్రద్ధ హత్య మే 18న జరగడం, తర్వాత కొన్నాళ్లకే తల, చెయ్యి దొరికడంతో.. వాటి శాంపిల్స్‌ను డీఎన్‌ఏ టెస్టులకు పంపారు. మరోవైపు మెహ్రౌలీ ఫారెస్ట్‌లో దొరికిన శరీర భాగాల శాంపిల్స్‌ను కూడా పరీక్షలకు పంపారు. రెండు శాంపిల్స్‌ రిజల్ట్ వచ్చిన తర్వాత మ్యాచ్ చేసి చూసి.. రెండు చోట్ల దొరికిన శరీర భాగాలు శ్రద్ధవేనా కాదా అనేది నిర్ధారించనున్నారు. 

ఆధారాలున్నా..

శ్రద్ధను అఫ్తాబ్‌‌‌‌‌‌‌‌ హత్య చేసినట్లుగా పోలీసుల వద్ద పలు ఆధారాలు ఉన్నాయి. తానే హత్య చేసినట్లు పోలీసు విచారణలో అఫ్తాబ్ ఒప్పుకున్నాడు. అయితే కోర్టులో అతను తన మాట మార్చే అవకాశం ఉంది. హత్య జరిగిన రోజు తర్వాత మే 19న అతను కత్తి, ఫ్రిజ్‌‌‌‌‌‌‌‌ని కొనుగోలు చేసినట్లు సాక్ష్యం ఉంది. అడవిలో ఎముకలు దొరికాయి. వంట గదిలో రక్తం ఆనవాళ్లు కనిపించాయి. శ్రద్ధ ఖాతా నుంచి అఫ్తాబ్ రూ.54,000 ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ఫర్ చేసుకున్నట్లు బ్యాంక్ వివరాలు, ఫోన్ కాల్ రికార్డులు, లొకేషన్ డేటా కూడా ఉన్నాయి. ఫ్లాట్ నుంచి శ్రద్ధ బ్యాగ్‌‌‌‌‌‌‌‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆమె తండ్రి, స్నేహితుల స్టేట్‌‌‌‌‌‌‌‌మెంట్స్‌‌‌‌‌‌‌‌ రికార్డు చేశారు. అయితే హత్యకు ఉపయోగించిన కత్తి లేదా రంపాన్ని, చనిపోయిన సమయంలో శ్రద్ధ ఒంటిపై ఉన్న బట్టలను ఇంకా పోలీసులు గుర్తించలేదు. నేరాన్ని నిరూపించేందుకు ఇవి చాలా కీలకం. మరో ముఖ్యమైన సాక్ష్యం.. శ్రద్ధ మొబైల్ ఫోన్ దొరకలేదు. మరోవైపు ఇప్పటిదాకా దొరికిన శరీర భాగాలు శ్రద్ధవో కాదో తెలియదు.

ఫుడ్ ఆర్డర్ చేసుకుని.. నెట్‌‌‌‌‌‌‌‌ఫ్లిక్స్ చూస్తూ..

రెండు రోజులపాటు శ్రద్ధ శరీరాన్ని 35 ముక్కలు చేసిన అఫ్తాబ్.. మధ్య మధ్యలో బ్రేక్ ఇచ్చాడు. బీర్లు తాగాడు.. సిగరెట్లు కాల్చాడు. పని పూర్తయ్యాక ఫుడ్ ఆర్డర్ చేసుకుని, నెట్‌‌‌‌‌‌‌‌ఫ్లిక్స్‌‌‌‌‌‌‌‌లో సినిమా చూశాడు. ‘‘బాడీని ముక్కలు చేయడానికి 10 గంటలకు పైగా పట్టింది. అలసిపోయినప్పుడల్లా.. బ్రేక్ తీసుకున్నా. భాగాలను కడగడానికి కొన్ని గంటలు పట్టింది. ఈ సమయంలో బీర్లు తాగాను. సిగరెట్లు కాల్చాను” అని విచారణలో నిందితుడు చెప్పినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ‘‘ఈ నెల ప్రారంభంలో మహారాష్ట్రలోని మాణిక్‌‌‌‌‌‌‌‌పూర్ పోలీసులు విచారణకు పిలిచినప్పుడు అఫ్తాబ్‌‌‌‌‌‌‌‌ ముఖంలో ఎలాంటి పశ్చాత్తాపం లేదు. కాన్ఫిడెంట్‌‌‌‌‌‌‌‌గా కనిపించాడు. శ్రద్ధ మిస్సింగ్‌‌‌‌‌‌‌‌ కేసులో అతడు విరుద్ధమైన ప్రకటనలు చేయడంతో అనుమానాలు బలపడ్డాయి. తర్వాత ఢిల్లీ పోలీసులను ఆశ్రయించి.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నాం” అని ముంబై పోలీసులు చెప్పారు. కేసు బయటపడకముందే తన కుటుంబాన్ని వసై నుంచి ముంబైకి తరలించాడని తెలిపారు.

లాయర్ల నిరసన

అఫ్తాబ్‌కు వ్యతిరేకంగా సాకేత్ జిల్లా కోర్టు ఆవరణలో లాయర్లు నిరసన తెలిపారు. కోర్టులో మధ్యాహ్నం 3 గంటలకు గుమిగూడిన 100 మందికి పైగా అడ్వకేట్లు.. అఫ్తాబ్‌కు ఉరి శిక్ష వేయాలంటూ డిమాండ్ చేశారు.

కీలకంగా నీళ్ల బిల్లు

ఢిల్లీలో నెలకు 20 వేల లీటర్ల వరకు నీటిని ఉచితంగా సరఫరా చేస్తారు. ఆపైన నీళ్లు వాడుకుంటే బిల్లు వేస్తారు. అయితే మెహ్రౌలీలో అఫ్తాబ్ ఉండే కాలనీలో దాదాపు ఎవరూ 20 వేల లీటర్లకు మించి వాడుకోరు. అఫ్తాబ్ ఉండే ఇంటికి మాత్రం రూ. 300 బిల్లు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. శ్రద్ధ డెడ్‌‌‌‌‌‌‌‌బాడీని రంపంతో ముక్కలు చేస్తున్నప్పుడు సౌండ్ రాకుండా ఉండేందుకు అతడు ట్యాప్స్ నిరంత రంగా ఆన్‌‌‌‌‌‌‌‌లోనే ఉంచినట్లు, రక్తాన్ని కడిగేందుకు, గోడలపై పడ్డ మరకలను తుడిచేందుకు నీటిని ఎక్కువగా వాడినట్లు పోలీసులు అనుమాని స్తున్నారు. అందుకే అఫ్తాబ్ ఫ్లాట్‌‌‌‌‌‌‌‌కు నీటి బిల్లు వచ్చినట్లు భావిస్తున్నారు. అంత మొత్తంలో వాటర్ బిల్లు రావడంతో తాను ఆశ్చర్యపోయానని ఫ్లాట్ ఓనర్ రాజేంద్ర చెప్పారు. రెంట్ ఎప్పుడూ ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో చెల్లించే వాడని, ఫ్లాట్‌‌‌‌‌‌‌‌కు వెళ్లాల్సిన అవసరం తనకు రాలేదని తెలిపారు.

అఫ్తాబ్​ నార్కో టెస్ట్​కు ఢిల్లీ కోర్టు పర్మిషన్

నిందితుడు అఫ్తాబ్ అమీన్ పూనావాలాను మరో ఐదు రోజుల పోలీసు కస్టడీకి ఢిల్లీ కోర్టు గురువారం అప్పగించింది. కేసు చిక్కుముడులు వీడేందుకు.. నిందితుడికి నార్కో అనాలసిస్ టెస్ట్ చేసేందుకు పర్మిషన్ ఇచ్చింది. మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ అవిరల్ శుక్లా ఈమేరకు ఉత్తర్వులు జారీ చేశారు. నార్కో టెస్టు ద్వారా మరిన్ని కీలక విషయాలు వెల్లడయ్యే అవకాశం ఉందని, కేసు దర్యాప్తులో అవి కీలకం కావచ్చని పోలీసులు భావిస్తున్నారు.