కాంగ్రెస్లో ఆ నేతలకు కలిసిరాని డీసీసీ పదవి

కాంగ్రెస్లో ఆ నేతలకు కలిసిరాని డీసీసీ పదవి

పదవి ఉన్నా.. లేకున్నా.. పార్టీ కోసమే పని చేస్తామనేది కామన్ గా వినిపించే మాట. పదవి ఉంటే ఇంకా బాగాచేస్తామనేది లోపలి మాట. అయితే.. ఓ పార్టీలో ఓ పోస్టుకు మాత్రం విపరీతమైన బ్యాడ్ సెంటిమెంట్ ఉందంట. పనిచేయడం, చేయకపోవడం అనే మాట అట్ల ఉంచితే.. ఆ పోస్టు ఉండడమే నెగిటివ్ సెంటిమెంట్ గా మారిపోయిందట.

ఉమ్మడి రంగారెడ్డి జిల్లా భూములకే కాదు రాజకీయాలకూ డిమాండ్ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో సీన్ మరో రకంగా ఉందట. రంగారెడ్డి జిల్లా DCC ప్రెసిడెంట్ గా చేసిన ఏ లీడర్ కు అదృష్టం కలిసి రావట్లేదట. పార్టీ బ‌లోపేతానికి ఎంత చేసినా చివరికి టికెట్ ద‌క్క‌డం లేదట. రాకరాక టికెట్ ద‌క్కినా నేత‌ల స‌హ‌కారం అంతంత మాత్రంగానే ఉంటుందట. దీంతో రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులుగా ప‌నిచేసిన లీడర్లంతా కాంగ్రెస్ కి గుడ్ బై చెప్పి.. త‌మ దారి తాము చూసుకుంటున్నారనే డిష్కషన్ జరుగుతోందట. 

2018 ఎన్నిక‌లప్పుడు రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్య‌క్షుడిగా క్యామ మ‌ల్లేష్ ప‌ని చేశారు. ఇబ్ర‌హీంప‌ట్నం టికెట్ ఆశించినా ఆయ‌న‌కు టికెట్ ద‌క్కలేదు. దీంతో కాంగ్రెస్ కు రాజీనామా చేసి కారెక్కారు. ఎమ్మెల్సీ ఇస్తామ‌ని గులాబీ బాస్ సీఎం కేసీఆర్ హ‌మీ ఇచ్చినా అది అమ‌లు కాలేదు. ఈసారి ఇబ్ర‌హీంప‌ట్నం BRS టికెట్ త‌న‌కేనని న‌మ్మిన‌ప్ప‌టికీ సిట్టింగ్ కే సీటు ద‌క్కింది. దీంతో తన ఫ్యూచర్ ఏంటనే ఆలోచనలో పడ్డారట క్యామ మ‌ల్లేశం.

ఇక ఉమ్మ‌డి రంగారెడ్డి జిల్లా నుంచి విడిపోయి ఏర్పాటైన మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ అధ్య‌క్షుల‌కు ఇదే అనుభవం ఎదుర‌వుతోందట. గతంలో DCC అధ్యక్షుడిగా పనిచేసిన కూన శ్రీశైలం గౌడ్.. లాస్ట్ టైమ్ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత బీజేపీలో చేరారు. కూన శ్రీశైలం త‌ర్వాత మేడ్చెల్- మల్కాజిగిరి డీసీసీ ప్రెసిడెంట్ గా వ్య‌వ‌హ‌రించిన నందికంటి శ్రీధ‌ర్ ది అదే ప‌రిస్థితి. గ‌త ఎన్నిక‌ల్లో మల్కాజిగిరి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావించినా పొత్తులో భాగంగా టీజేఏస్ కు టిక్కెట్ కేటాయించారు. ఈసారైనా టికెట్ వస్తుందనుకుంటే బీఆర్ఎస్ స్థానిక ఎమ్మెల్యే మైనంప‌ల్లి హ‌న్మంత్ రావు చేరిక‌తో టికెట్ గల్లంతైంది. దీంతో కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరిపోయారు నందికంటి శ్రీధర్. 

ALSO READ :  కాంగ్రెస్ ముసుగులో .. తెలంగాణలో ఆంధ్రోళ్ల పెత్తనం: గంగుల

కొత్త డీసీసీ కోసం కాంగ్రెస్ అన్వేషణ మొద‌లు పెట్టినా.. ఎవరూ ముందుకు రావటం లేదట. డీసీసీ ప‌ద‌వీ అంటేనే హ‌స్తం నేత‌లు బెంబేలెత్తిపోతున్నారట. మాకొద్దు బాబోయ్ అంటున్నార‌ట‌. ఐదేండ్లు పార్టీ కోసం క‌ష్ట‌ప‌డాలి.. తీరా ఎన్నిక‌లప్పుడు టికెట్ మాత్రం ద‌క్క‌దు.. అంతదానికి శ్ర‌మించ‌డం అవ‌స‌ర‌మా అంటున్నార‌ట‌ కాంగ్రెస్ లీడర్లు. 

ఇక రంగారెడ్డి డీసీసీ అధ్య‌క్షుడిగా ఉన్న చ‌ల్లా న‌ర్సింహారెడ్డి.. మ‌హేశ్వ‌రం టికెట్ ఆశిస్తున్నారు. సీన్ లో మాత్రం టికెట్ బ‌డంగ్ పేట్ మేయ‌ర్ కి వ‌స్తుంద‌న్న ప్రచారం ఉంది. టికెట్ వస్తుందో రాదోనని చ‌ల్లా న‌ర్సింహారెడ్డి టెన్ష‌న్ ప‌డుతున్నారట. మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో మేడ్చల్ మల్కాజ్ గిరి, రంగారెడ్డి డీసీసీ పదవీ కలిసిరాదన్న చర్చ మాత్రం జోరుగా నడుస్తోందట.