మోడీ వచ్చాకే ఢిల్లీలో లాబీయింగ్ లేని పాలన

మోడీ వచ్చాకే ఢిల్లీలో లాబీయింగ్ లేని పాలన
  • ఒక్క రూపాయి అవినీతి లేని ప్రభుత్వం బీజేపీ నడుపుతోంది
  • విజయవాడ జన ఆశీర్వాద యాత్రలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

విజయవాడ: ఢిల్లీలో లాబీయింగ్ లేని పాలన నరేంద్ర మోదీ నిర్వహిస్తున్నారని, అంతేకాదు.. ఒక్క రూపాయి అవినీతిలేని ప్రభుత్వాన్ని బీజేపీ నడుపుతోందని కేంద్ర పర్యాటక శాఖా మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. దేశంలో జాతీయ రహదారుల అభివృద్ధి కేవలం బిజెపి ద్వారానే సాధ్యమైందని ఆయన తెలిపారు. విజయవాడలో జన ఆశీర్వాద యాత్రలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. తిరుపతి నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు వచ్చిన  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కి ఘన స్వాగతం లభించింది. గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి విజయవాడ వరకు బీజేపీ శ్రేణులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన జన ఆశీర్వాద యాత్ర సభలో అతిథులను  బిజెపి అధికార ప్రతినిధి సత్యమూర్తి ఆహ్వానించగా, ఏలూరు పార్లమెంట్ అధ్యక్షుడు బబ్బూరి శ్రీరాం సభను ప్రారంభించారు. 
రిక్షాలో బీజేపీ ఆఫీసుకు వచ్చేవాడిని
జన ఆశీర్వాద యాత్ర సభలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  పాత రోజులను గుర్తు చేసుకున్నారు. ఇక్కడ కార్యకర్తలతో తనకు బాగా పరిచయం ఉందని, రిక్షాలో పార్టీ కార్యాలయానికి వచ్చినరోజులు బాగా గుర్తున్నాయన్నారు. సామాన్య కార్యకర్తగా పనిచేశానని, భారత్ మాతాకీ జై అనే నినాదం ఇచ్చేవాడినని తెలిపారు. కాశ్మీర్ కోసం పార్టీ పనిచేసిందని, 370ఆర్టికల్ తొలగిస్తామని పార్టీ స్థాపించినప్పటి నుండి హామీ ఇచ్చామన్నారు. ఈ హామీ మేరకు మహమ్మద్ ఆలీ జిన్నా తీసుకుని వచ్చిన ఆర్టికల్ 370ని రద్దు చేశామని, ఈ ఆర్టికల్ ను రద్దు చేసిన సమయంలో హోం శాఖ సహాయ మంత్రిగా ఉండడంతో నా జీవితం ధన్యమైందన్నారు.
సభలో కొత్త మంత్రుల పరిచయాన్ని ప్రతిపక్షాలు అడ్డుకున్నాయి
కేంద్రంలో కొత్త మంత్రులను లోక్ సభలో పరిచయం చేయడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రయత్నం చేయగా ప్రతిపక్షాలు అడ్డుకున్నాయని, ఇది చాలా దారుణం అన్నారు. మంత్రులు నేరుగా ప్రజల వద్దకు వెళతారని అడ్డుకున్న ప్రతిపక్షాలుకు సమాధానంగా మంత్రులు నేరుగా ప్రజల వద్దకే వెళుతున్నారని తెలిపారు. ప్రజలు ఎవరూ మాస్క్ లేకుండా బయటకు రావద్దని, జాగ్రత్తలు తీసుకుంటే కరోనా మూడో వేవ్ రాదన్నారు. ఈనెల చాలా ముఖ్యమైనదని, స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలైందని గుర్తు చేస్తూ, ఎన్నో ఆకాంక్ష లతో స్వాతంత్ర్యం తెచ్చుకోవడం జరిగిందన్నారు.
ప్రపంచంలో అందరికంటే ముందు వ్యాక్సిన్ మనకే
 కరోనా వ్యాక్సిన్ ప్రతి ఒక్కరికీ అందించడం జరుగుతోందని, ప్రపంచ దేశాల కంటే ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాక్సిన్ మనదేశానికి అందించారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కొనియాడారు. నరేంద్ర మోదీ ఉన్నారు కాబట్టే ప్రజలను సంఘటితం చేసి కరోనాను ఎదుర్కొన్నామన్నారు. అన్ని రంగాల్లోని  ప్రజల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు కేంద్రం అమలు చేస్తోందని, రైతులకు సంవత్సరానికి ఆరువేల రూపాయలు వారి అక్కౌంట్లో వేస్తున్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వివరించారు.