
- కీలక విషయాలపై మాట్లాడేటప్పుడు సంయమనం పాటించాలి
- పాకిస్తాన్ సీజ్ ఫైర్ లో మూడోపక్షం ప్రమేయం లేదని వెల్లడి
- ఢిల్లీలో ఎన్డీయే సీఎంలు, డిప్యూటీ సీఎంల మీటింగ్
- 20 రాష్ట్రాల సీఎంలు, 18 రాష్ట్రాల డిప్యూటీ సీఎంలు హాజరు కులగణన,
- ఆపరేషన్ సిందూర్ పై తీర్మానాలు ..భారత సైన్యానికి ప్రశంసలు
- పహల్గాం ఉగ్రదాడి మృతులకు నివాళి
- పాల్గొన్న బీజేపీ ప్రెసిడెంట్ నడ్డా, కేంద్రమంత్రులు
న్యూఢిల్లీ: ఎన్డీయే ప్రజాప్రతినిధులు, నేతలు ఎక్కడా నోరుజారొద్దని ప్రధాని నరేంద్ర మోదీ వార్నింగ్ ఇచ్చారు. ముఖ్యంగా ఆపరేషన్ సిందూర్ లాంటివాటిపై మాట్లాడేటప్పుడు సంయమనం పాటించాలని, విచక్షణారహిత వ్యాఖ్యలు చేయొద్దని సూచించారు. మధ్యప్రదేశ్, హర్యానా రాష్ట్రాలకు చెందిన బీజేపీ నాయకులు చేసిన వివాదాస్పదవ్యాఖ్యలు పార్టీకి ఇబ్బంది కలిగించాయని వార్తలు వచ్చిన నేపథ్యంలో మోదీ ఈ ఆదేశాలు జారీచేసినట్టు సమాచారం.
ఢిల్లీలోని అశోక హోటల్లో ఆదివారం నిర్వహించిన ఎన్డీయే సీఎంల కాన్ క్లేవ్కు మోదీ అధ్యక్షత వహించారు. బీజేపీ జాతీయ అధ్యక్షు డు జేపీ నడ్డా. కేంద్ర మంత్రులు అమిత్షా, రాజానాథ్ సింగ్ హాజరయ్యారు. 20 రాష్ట్రాల సీఎంలు, 18 రాష్ట్రాల డిప్యూటీ సీఎంలు భేటీలో పాల్గొన్నారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారి ఈ సమావేశాన్ని నిర్వహిస్తుండడంతో దానికి సంబంధించిన వివరాలను సీఎంలు, డిప్యూటీ సీఎంలకు కేంద్ర మంత్రులు వివరించారు. పహల్గాం దాడి మృతులకు నివాళి అర్పించారు. కుల గణన, ఆపరేషన్ సిందూర్ పై రెండు తీర్మానాలను ప్రవేశపెట్టి, ఆమోదించారు.
కుల రాజకీయాలను ఎన్డీయే నమ్మదు : నడ్డా
ఆపరేషన్ సిందూర్ పై తీర్మానాన్ని రాజస్తాన్ సీఎం భజన్ లాల్ శర్మ ప్రతిపాదించగా.. ఏక్ నాథ్ షిండే మద్దతు ఇచ్చారు. కుల గణన తీర్మానాన్ని హర్యానా సీఎం నయాబ్ సింగ్ సైనీ ప్రవేశపెట్ట గా.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా జేపీ నడ్డా మాట్లాడుతూ.. ఎన్డీయే కూటమి కుల రాజకీయాలను నమ్మదని, కానీ, కుల గణన వివిధ రంగాల్లో వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి దోహదపడుతుందని చెప్పారు.
సీఎంల కాంక్లేవ్లో మావోయిస్టులకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారంపై కూడా చర్చించినట్టు తెలిపారు. నక్సలిజంపై ఎలా పోరాడామో, ఎలా విజయం సాధించామోచత్తీస్ గఢ్ సీఎం వివరించారని చెప్పారు. తమ తమరా ష్ట్రాల్లో ఎన్డీయే కూటమి ప్రభుత్వాలు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ఆయా రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలు వివరించారని తెలిపారు. కాగా, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్ నాథ్ షిండే మాట్లా డుతూ.. "సమావేశం రెండు తీర్మానాలను ఆమోదించింది. మొదటిది ఆపరేషన్ సిందూర్, రెండోది కుల గణన. ఆపరేషన్ సిందూర్ సమయంలో ప్రధాని సాయుధ దళాలకు పూర్తి అధికారాలు ఇచ్చి ముందుకు నడిపించారు.
ఉగ్రవాదులకు, వారిని పోషిస్తున్న వారికి ఆపరేషన్ సిందూర్ మన సాయుధ బలగాలు తగిన బుద్ధి చెప్పాయి" అని అన్నారు. ఆపరేషన్ సిందూర్ ప్రతిభారతీయ పౌరుడిలో ఆత్మవిశ్వాసాన్ని నింపిందన్నారు. కేంద్రం విధానాలు, మన సాయుధ దళాల పరాక్ర మం, ప్రధాని మోదీ ధైర్యానికి సెల్యూట్ చేస్తున్నట్టు చెప్పారు.
పాకిస్తాన్ రిక్వెస్ట్ మేరకే కాల్పుల విరమణ: మోదీ
పాకిస్తాన్ తో చేసుకున్న సీజ్ ఫైర్ లో మూడో పక్షం ప్రమేయం లేదని మోదీ క్లారిటీ ఇచ్చారు. పాకిస్తాన్ చేసిన అభ్యర్ధన మేరకే కాల్పుల విరమణ చేసుకున్నట్టు వెల్లడించారు. ఢిల్లీలో సీఎంలు, డిప్యూటీ సీఎంలతో భేటీ తర్వాత మోదీ 'ఎక్స్' వేదికగా ఆ వివరాలను వెల్లడించారు. "ఎన్డీయే సీఎంల కాంక్లేవ్ లో పాల్గొన్నా. వాటర్ కన్జర్వేషన్, ఫిర్యాదుల పరిష్కారం, అడ్మినిస్ట్రేటివ్ ఫ్రేమ్ వర్క్ ను బలోపేతం చేయడం, విద్య, మహిళా సాధికారత, క్రీడలు, విభిన్న రంగాల్లో చేపడుతున్న బెస్ట్ ప్రాక్టీసెస్ ను ఆయా రాష్ట్రాలు ప్రదర్శించాయి. ఈ అనుభవాలను వినడం చాలా అద్భుతంగా ఉంది" అని మోదీ పేర్కొన్నారు.
తమ సర్కారు ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న కుల గణన.. దేశంలో వెనుకబడిన వర్గాల అభివృద్ధికి ముందడుగు అని తెలిపారు. ఆపరేషన్ సిందూర్ తో దేశం సాధించిన స్వయం స్వావలంబన నిరూపితమైందని, దేశీయ రక్షణ సాంకేతికతను చాటిందని చెప్పారు.