
- అభివృద్ధి పనులకు రాష్ట్ర వాటా ఇస్తలే
- మ్యాచింగ్ గ్రాంట్ రిలీజ్ చేయక ఆగిన పనులు
హైదరాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో చేపడుతున్న అభివృద్ధి పనులు, కొన్ని స్కీములకు రాష్ట్ర సర్కార్ తన వాటా నిధులు ఇవ్వడం లేదు. రీజినల్ రింగ్ రోడ్డు, స్మార్ట్ సిటీలు, హైవేలు, ఎంఎంటీఎస్ ఫేజ్ 2 తదితర ప్రాజెక్టులకు రాష్ట్రం డబ్బులు రిలీజ్ చేయడం లేదు. డబ్బుల్లేక ఆయా పనులు ఆగిపోతున్నాయి. ఏండ్లు గడుస్తున్నా వాటిని పట్టించుకోవడం లేదు. కొన్ని స్కీముల పరిస్థితి కూడా ఇలానే ఉంది. పంటల బీమాకు రాష్ట్ర వాటా రిలీజ్ చేయకపోవడంతో ఆ పథకమే నిలిచిపోయింది. ఇక ప్రధాన మంత్రి ఆవాస్ యోజన(పీఎంఏవై) కింద ఇండ్ల నిర్మాణానికి కేంద్రం నుంచి నిధులు వచ్చినప్పటికీ.. వాటిని సరిగ్గా వినియోగించడంలో రాష్ట్రం ఫెయిల్ అయింది. వాటికి యూసీలు ఇవ్వడం లేదు. ఫలితంగా కేంద్రం నుంచి రావాల్సిన డబ్బులు ఆగిపోయాయి. మరోవైపు ఉపాధి హామీ పథకం కింద చేసిన పనుల్లో అక్రమాలు చోటు చేసుకోవడంతో.. ఆ నిధులు రికవరీ చేసి వెనక్కి ఇవ్వాలని కేంద్రం ఆదేశించింది. కానీ రాష్ట్ర సర్కార్ ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. దీంతో ఉపాధి హామీ పథకం కింద రావాల్సిన డబ్బులు రావడం లేదు.
నచ్చిన కాంట్రాక్టర్ల రోడ్లకు మాత్రం..
రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం తన వాటా ఫండ్స్ రిలీజ్ చేయడం లేదు. భూసేకరణ మధ్యలోనే నిలిచిపోయింది. రాష్ట్రం తన వంతు నిధులు రిలీజ్ చేయాలని కోరుతూ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్హెచ్ఏఐ) రెండు సార్లు లెటర్ రాసింది. ఉత్తర భాగం రోడ్డు సంగారెడ్డిలో మొదలై నర్సాపూర్, తూప్రాన్, గజ్వేల్, యదాద్రి, ప్రజ్ఞాపూర్, భువనగిరి, చౌటుప్పల్ వరకు ఉంటుంది. ఇందుకోసం దాదాపు 5 వేల ఎకరాలు సేకరించాలి. దీనికి రూ.5200 కోట్లు అవసరమని అంచనా వేశారు. ఇందులో 50 శాతం నిధులు కేంద్రం ఇస్తోంది. ఇంకో సగం రూ.2600 కోట్లు రాష్ట్రం ఇవ్వాల్సి ఉన్నది. అయితే రాష్ట్రం ఇంతవరకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. బడ్జెట్లో కేవలం రూ.500 కోట్లు ప్రతిపాదించింది. సర్కార్ తీరుతో ట్రిపుల్ ఆర్ మరింత లేటు అవుతోంది.
ఆగిన పీఎంఏవై, ఉపాధి హామీ ఫండ్స్
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) కింద కేంద్రం ఇచ్చిన నిధులను రాష్ట్ర సర్కార్ డబుల్బెడ్రూం ఇండ్ల నిర్మాణంలో వినియోగించింది. అలా నిర్మించిన ఇండ్లను ఇప్పటికీ పూర్తి స్థాయిలో లబ్ధిదారులకు పంపిణీ చేయలేదు. ఈ నిధులకు సంబంధించి యూసీలు పంపకపోవడంతో వాటిని కూడా వెనక్కి పంపాలని కేంద్రం స్పష్టం చేసింది. రాష్ట్ర సర్కారు తీరుతో మనకు రావాల్సిన ఫండ్స్ కూడా రాకుండాపోతున్నాయి. ఉపాధి హామీ పథకం విషయంలోనూ అదే జరుగుతోంది. నిధులను అడ్డదారుల్లో ఖర్చు చేయడంపై కేంద్రం సీరియస్ అయింది. ఉపాధి పథకంలో కాంట్రాక్టర్లను ఇన్వాల్వ్ చేసి రూ.150 కోట్లు దుర్వినియోగం చేయడంతో వాటిని వెనక్కి పంపాలని ఆదేశించింది. అలా అయితేనే మిగిలిన ఫండ్స్ ఇస్తమని తెలిపింది. ఇలా రాష్ట్ర సర్కార్ తీరుతో కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాకుండా పోతున్నాయి.
స్మార్ట్ సిటీలు.. ఎంఎంటీఎస్‌కు ఇయ్యలే
స్మార్ట్ సిటీస్ మిషన్ కింద గ్రేటర్ వరంగల్, కరీంనగర్ ను ఎంపిక చేసిన కేంద్రం.. 2015లో పథకం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు రూ.400 కోట్లు రిలీజ్చేసింది. రాష్ట్రం మాత్రం తన వంతు డబ్బులు రిలీజ్ చేయడం లేదు. కేంద్రం 2015 నుంచి నిధులు విడుదల చేసినప్పటికీ, రాష్ట్ర సర్కార్ ఆరేండ్లు ఆలస్యం చేసింది. నిరుడు కేవలం రూ.70 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకుంది. ఎంఎంటీఎస్ ఫేజ్–2కు రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతో 2018లోనే పూర్తి కావాల్సిన ప్రాజెక్టు.. ఇప్పటికీ కాలేదు. రాష్ట్రం రూ.556 కోట్లు విడుదల చేయాల్సి ఉంది. నిధులు విడుదల చేయాలని నాలుగు సార్లు కేంద్రం లెటర్ రాసినా రాష్ట్రం పట్టించుకోవడం లేదు. రాష్ట్రంలో 80 రోడ్ ఓవర్ బ్రిడ్జెస్(ఆర్వోబీ), రోడ్ అండర్ బ్రిడ్జెస్ (ఆర్‌యూబీ) పనులు పెండింగ్‌లో పడ్డాయి. కేంద్రం నిధులు ఇచ్చినప్పటికీ రాష్ట్ర సర్కార్ మాత్రం జమ చేయలేదు.