తండ్రిపై కేసు.. చట్టం కంటే ఎవరూ గొప్ప కాదన్న సీఎం

తండ్రిపై కేసు.. చట్టం కంటే ఎవరూ గొప్ప కాదన్న సీఎం

వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సీఎం తండ్రిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దానిపై స్పందించిన ఆ ముఖ్యమంత్రి చట్టం కంటే ఎవరూ గొప్ప వాళ్లు కాదని అన్నారు. తన తండ్రి చేసిన కామెంట్స్ విని బాధపడ్డానని, ఆయన మాటల మత సామరస్యం దెబ్బతీసేలా ఉన్నాయని, చట్టం తీసుకోవాల్సిన చర్యలను ప్రభుత్వం తీసుకుంటుందని అన్నారు. ఈ వ్యాఖ్యలు చేసింది చత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ బఘేల్. 86 ఏండ్ల వయసున్న ఆయన తండ్రి నంద కుమార్ బఘేల్ మతపరమైన వ్యాఖ్యలు చేయడంతో పోలీసులు ఆయనపై ఎఫ్‌ఐఆర్ రిజిస్టర్ చేశారు.

బ్రాహ్మణులను ఓల్గా నది ఒడ్డుకు పంపేయాలని..

దేశవ్యాప్తంగా అన్ని గ్రామాల ప్రజలను ఒక్కటే కోరుతున్నా.. మీ ఊర్లలోకి బ్రాహ్మణులను ప్రవేశించనీయొద్దు. నేను ప్రతి కులం వాళ్లతో మాట్లాడుతాను.. బ్రాహ్మణులను పూర్తిగా వెలివేయాలి. వాళ్లను మళ్లీ ఓల్గా నది ఒడ్డుకు (ఐరోపా దేశాల నుంచి వచ్చిన ఆర్యులు అనే ఉద్దేశంలో) తరిమేయాలి”  అంటూ ఇటీవల తీవ్ర వివాదాస్పద కామెంట్స్ చేశారు నంద కుమార్ బఘేల్‌. 

తండ్రికి కొడుకుగా గౌరవిస్తా.. కానీ సీఎంగా క్షమించలేను

సీఎం తండ్రి కామెంట్స్‌పై సర్వ బ్రాహ్మణ సమాజ్ అనే సంస్థ డీడీ నగర్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. దీంతో నంద కుమార్ బఘేల్‌పై శనివారం రాత్రి పోలీసులు 153ఏ, 505(1)(బీ)  సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. ఈ నేపథ్యంలో ఇవాళ చత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ బఘేల్ మాట్లాడుతూ మన దేశంలో చట్టమే సుప్రీం అని, దానికి లోబడి ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. చట్టం కంటే ఎవరూ గొప్ప వాళ్లు కాదని, దానికి ఎవరూ అతీతులు కారని సీఎం అన్నారు. ఆ వ్యక్తి తన తండ్రి అయిన సరే చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని చెప్పారు. కులాలు, మతాలు, తెగల మనోభావాలను చత్తీస్‌గఢ్ ప్రభుత్వం గౌరవిస్తుందని, తన తండ్రి నంద కుమార్ చేసిన కామెంట్స్ ఒక కులానికి వ్యతిరేకంగా ఉన్నాయని అన్నారు. ఆయన కామెంట్స్ సమాజంలో శాంతిభద్రతలకు భంగం కలిగించేలా ఉన్నాయని సీఎం అన్నారు. ఒక కొడుకుగా తాను ఆయనను గౌరవిస్తానని, సీఎంగా మాత్రం ఆయన చేసిన తప్పులను క్షమించలేనని భూపేశ్ స్పష్టం చేశారు.