పొల్యూషన్​ సర్టిఫికెట్​ లేకుంటే డీజిల్, పెట్రోల్ పోయొద్దు

పొల్యూషన్​ సర్టిఫికెట్​ లేకుంటే డీజిల్, పెట్రోల్ పోయొద్దు
  • పొల్యూషన్​ సర్టిఫికెట్​ లేకుంటే డీజిల్, పెట్రోల్ పోయొద్దు
  • ఈ నెల 25 నుంచి ఢిల్లీలో కొత్త రూల్

న్యూఢిల్లీ: ఢిల్లీలో వాహన కాలుష్యాన్ని తగ్గించేందుకు ఆప్​ సర్కార్​ కీలక నిర్ణయం తీసుకుంది. పొల్యూషన్​ అండర్​ కంట్రోల్(పీయూసీ) సర్టిఫికేట్​చూపిస్తేనే ఫ్యూయల్​ వేయాలని ఆదేశించింది. అన్ని బంకులకు ఈ నిబంధన వర్తిస్తుందని స్పష్టంచేసింది. అక్టోబర్​ 25 నుంచి ఈ కొత్త రూల్​ అమల్లోకి వస్తుందని పర్యావరణ శాఖ మంత్రి గోపాల్​ రాయ్​ ప్రకటించారు. వింటర్​ సీజన్​ను దృష్టిలో పెట్టుకుని, ఢిల్లీ వాసులకు స్వచ్ఛమైన గాలి ఇవ్వాలనే ఉద్దేశంతో పర్యావరణ, రవాణ, ట్రాఫిక్​ అధికారులతో మాట్లాడి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. త్వరలోనే విధివిధానాలను ఖరారు చేస్తామన్నారు.

సరి–బేసి సంఖ్యల విధానం అమలుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని మంత్రి చెప్పారు. కిందటేడాదిలాగే వెహికల్​ పొల్యూషన్, డస్ట్​ పొల్యూషన్, చెత్తను బహిరంగంగా కాల్చడం వంటి ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు. క్రాకర్స్​పైనా నిషేధం కొనసాగుతుందన్నారు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ‘పర్యావరణ్​ మిత్రాస్’ సాయం తీసుకుంటున్నామని వివరించారు. పొల్యూషన్ కు కారణాలపై అధ్యయనం ప్రారంభించామని, అక్టోబర్​ 20 తర్వాత ప్రతీ ఏరియా నుంచి రిపోర్టులు తీసుకుంటామని తెలిపారు.

ఢిల్లీలో 13 హాట్​స్పాట్​లు ఉన్నాయని, వాటి ఆధారంగానే పనిచేస్తున్నామని వివరించారు. వార్​ రూంను మరింత మెరుగుపరుస్తున్నామని, గ్రేడెడ్​ రెస్పాన్స్​ యాక్షన్​ ప్లాన్ (జీఆర్​ఏపీ) శనివారం నుంచే అమలు చేస్తున్నట్టు తెలిపారు. జీఆర్​ఏపీ అమలు, పర్యవేక్షణను వార్​రూంతో లింక్​ చేస్తామని, దీంతో ఇక్కడి నుంచే ప్రతిదీ తెలుసుకోవచ్చన్నారు.