పాక్​ ఏకాకి..ఇండియాకు యూఎన్ఓ,అమెరికా,చైనా

పాక్​ ఏకాకి..ఇండియాకు యూఎన్ఓ,అమెరికా,చైనా

వాషింగ్టన్: కాశ్మీర్ సమస్యకు సంబంధించి తమ పాలసీలో ఎలాంటి మార్పులేదని అమెరికా స్పష్టం చేసింది. ఇండియా, పాకిస్తాన్ ఓర్పును పాటించాలని, పరిష్కారం కోసం రెండుదేశాలు చర్చలు జరపాలని సూచించింది. కాశ్మీర్​పై అమెరికా విధానంలో మార్పు ఉంటుందా? అని ఓ రిపోర్టర్ అడగ్గా.. ‘లేదు’ అని స్టేట్ డిపార్ట్​మెంట్ అధికార ప్రతినిధి మోర్గాన్ ఓర్టాగస్ సమాధానం చెప్పారు. రెండు దేశాలు కాశ్మీర్‌‌ వివాదంపై చర్చలు జరుపుకోవాలని, దానికి అమెరికా మద్దతు ఉంటుందని చెప్పారు. ఇండియా, పాక్​లతో అమెరికాకు బలమైన సంబంధాలున్నాయన్నారు. జమ్మూ కాశ్మీర్​లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులను తాము గమనిస్తున్నామని చెప్పారు. కాశ్మీర్‌‌లో ఇండియా మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందన్న పాక్ ప్రధాని ఇమ్రాన్‌‌ ఖాన్ ఆరోపణలపై స్పందిస్తూ.. వివాదాస్పద ప్రాంతాల్లో చట్ట ప్రకారం వెళ్లాలని తాము కోరతామని, హ్యూమన్ రైట్స్, అంతర్జాతీయ నిబంధనలను గౌరవించాలని సూచించారు. ఆర్టికల్ 370 రద్దుపై ఇండియా తమకు ముందే సమాచారం ఇచ్చిందన్న స్టేట్​మెంట్లలో నిజం లేదని, తమకు ఎవరూ చెప్పలేదని మరోసారి స్పష్టం చేశారు.

పాక్కు చైనా ఝలక్

బీజింగ్​: కాశ్మీర్​పై పాక్​ గోలను ఇంటర్నేషనల్​ కమ్యూనిటీ పెద్దగా పట్టించుకోలేదు. ఆఖరికి ఆప్తమిత్రుడైనా చైనా కూడా పాక్​కు ఝలకిచ్చింది. ఇండియాను నిలువరించేలా కాశ్మీర్​పై ఏదోఒక ప్రకటన చేయాలన్న పాక్​ అభ్యర్థనను చైనా తోసిపుచ్చింది. అకస్మాత్తుగా బీజింగ్​ పర్యటనకెళ్లిన పాక్​ విదేశాంగ మంత్రి షా మొహ్మద్​ ఖురేషీ శుక్రవారం చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌‌ యుతో భేటీ అయ్యారు. ఇండియా నిర్ణయాలపై స్పందించబోమని, ఏదైనా ఉంటే రెండు దేశాలు శాంతియుతంగా మాట్లాడుకోవాలని వాంగ్​ సూచించారు. నాలుగురోజుల కిందట లడక్​ను యూనియన్​ టెరిటరీగా మార్చడంపై అభ్యంతరం వ్యక్తంచేసిన చైనా మళ్లీ ఆ విషయంపై నోరెత్తలేదు.

యూఎన్లో పాక్కు షాక్

కాశ్మీర్​పై జోక్యం చేసుకోబోమన్న యూఎన్​ సెక్రటరీ జనరల్​

యునైటెడ్​ నేషన్స్​: జమ్మూకాశ్మీర్​కు స్పెషల్​ స్టేటస్​ ఎత్తేస్తూ ఇండియా తీసుకున్న నిర్ణయంపై తక్షణమే స్పందించాలన్న పాకిస్తాన్​ అభ్యర్థనను యునైటెడ్​ నేషన్స్​(యూఎన్​) తోసిపుచ్చింది. కాశ్మీర్​ పరిణామాల్ని ఎప్పటికప్పుడు నిశితంగా గమనిస్తున్నామని, అంతమాత్రాన వెంటనే జోక్యం చేసుకోబోమని, ఎలాంటి ఆదేశాలు ఇవ్వబోమని యూఎన్​ సెక్రటరీ జనరల్​ ఆంటోనియో గుటెరస్​ క్లారిటీ ఇచ్చారు. ఈ విషయంలో రెండు దేశాలూ అసలేమాత్రం తొందరపడొద్దని, యూఎన్​ చార్టర్ ప్రకారమే శాంతియుత మార్గాల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సెక్రటరీ జనరల్​ సూచించినట్లు ఆయన అధికారిక ప్రతినిధి స్టీఫెన్‌‌ డుజారిక్‌‌ మీడియాకు తెలిపారు. కాశ్మీర్​లో భారీ ఎత్తున సెక్యూరిటీ బలగాల్ని మోహరించి ఇండియా మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నదని, దీనిపై ఇంటర్నేషనల్​ కమ్యూనిటీ కలుగజేసుకుని మోడీ సర్కార్​ను నిలువరించాలన్న ఇమ్రాన్ అభ్యర్థనపై యూఎన్​ ఈ మేరకు స్పందించింది. పాక్​ తరఫున యూఎన్​లో ఆ దేశ శాశ్వత రాయబారి మలీహా లోథి సెక్యూరిటీ కౌన్సిల్​కు ఫిర్యాదు చేసిన తర్వాత, ఈ అంశాన్ని సెక్రటరీ జనరల్​ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై గుటెరస్‌‌ స్పందిస్తూ.. 1972నాటి సిమ్లా అగ్రిమెంట్​ను గుర్తుచేశారు. ‘‘సిమ్లా అగ్రిమెంట్​ ప్రకారం కాశ్మీర్..ఇండియా, పాకిస్తాన్ల మధ్య ద్వైపాక్షిక అంశం. దీంట్లో థర్డ్​ పార్టీ ప్రమేయం అనవసరం’’అని సెక్రటరీ జనరల్​ అభిప్రాయపడినట్లు స్టీఫెన్​ చెప్పారు. జమ్మూకాశ్మీర్​ విషయంలో ఏదో జరిగిపోతోందనే ప్రాపగండాచేస్తున్న పాకిస్తాన్​.. తన ఆక్రమణలో ఉన్న కాశ్మీర్​(పీవోకే)లో దారుణాలకు పాల్పడుతున్న వైనం మరోసారి చర్చకొచ్చింది. ఇండియాది ఏకపక్ష నిర్ణయమంటూ గోల చేస్తున్న పాక్​.. చాలా ఏండ్ల కిందటే పీవోకే స్వరూపం మారిపోయేలా ‘గిల్గిట్​ బాలిస్తాన్​’ ప్రాంతాన్ని విడదీసి అంతర్జాతీయ ఒప్పందాలకు తూట్లు పొడిచిన విషయాన్ని విశ్లేషకులు గుర్తుచేస్తున్నారు. కాశ్మీర్​ ముమ్మాటికీ అంతర్గత అంశమేనని మొదటి నుంచీ వాదిస్తోన్న ఇండియా.. ఆర్టికల్​ 370 రద్దు తర్వాత కూడా పాక్​తో దోస్తీ కొనసాగించడానికే ప్రయత్నించింది.