సర్కారీ చదువు.. సక్కగ లేదు

సర్కారీ చదువు.. సక్కగ లేదు

విద్యా రంగానికి 6 శాతం దాటని రాష్ట్ర సర్కార్

ఒక దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా చూడటానికి చదువే కొలమానం. 100% అక్షరాస్యత సాధించినందునే అమెరికా, ఇంగ్లాండ్, జర్మనీ, రష్యా, ఇటలీ, ఫ్రాన్స్, జపాన్, చైనా అగ్రరాజ్యాలుగా మారాయి. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ, ఎన్నికల మ్యానిఫెస్టోలోనూ టీఆర్ఎస్ పార్టీ కేజీ టు పీజీ వరకు ఉచిత విద్య అందిస్తామని, రాష్ట్రంలో విద్యారంగాన్ని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చింది. కానీ ప్రజల ఓట్లు కొల్లగొట్టి అధికారంలోకి వచ్చాక దాని ఊసే మరిచింది.

ఏటా రాష్ట్ర బడ్జెట్ పెరుగుతున్నప్పటికీ విద్యా రంగానికి కేటాయిస్తున్న నిధులు మాత్రం తగ్గుతూ వస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో విద్యా రంగానికి బడ్జెట్ లో 10% నిధులు కేటాయించగా తెలంగాణలో ఏటా తగ్గిస్తూ 2020-–-21 వచ్చేసరికి 6% నిధులే ఇచ్చే పరిస్థితి వచ్చింది. వాస్తవంగా విద్యారంగానికి బడ్జెట్ లో 20% నిధులు కేటాయించాలి. 2020–-21లో విద్యా శాఖ రూ.18 వేల కోట్లు కావాలని ప్రతిపాదనలు పంపగా రాష్ట్ర ప్రభుత్వం రూ.12 వేల కోట్లనే కేటాయించింది. ఈ అరకొర నిధుల్లో 85–-90% సిబ్బంది వేతనాలకే సరిపోతున్నాయి. దీంతో సర్కారీ స్కూళ్లు వసతులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. దక్షిణాదిలో విద్యారంగానికి తక్కువ నిధులు కేటాయిస్తున్నది తెలంగాణలోనే. ప్రాథమిక విద్యా ప్రమాణాల్లో దేశంలో తెలంగాణ 19వ స్థానంలో ఉన్నది.

టీచర్ పోస్టుల భర్తీ లేదు..

రాష్ట్రంలో 26,050 ప్రభుత్వ స్కూళ్లు ఉండగా, వీటిలో 18,230 ప్రైమరీ, 3,179 అప్పర్ ప్రైమరీ, 4,641 హైస్కూల్స్ ఉన్నాయి. వీటిలో 24 లక్షల మంది స్టూడెంట్లు, 1,41,343 మంది టీచర్లు ఉన్నారు. ప్రస్తుతం సర్కారీ బడుల్లో 32 వేల టీచర్ పోస్టులు, 5 వేల క్రాఫ్ట్, ఆర్ట్స్ టీచర్ పోస్టులు, 4 వేల కంప్యూటర్ టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక 2008 నుంచి జూనియర్ కాలేజీల్లో 2012 నుండి డిగ్రీ కాలేజీల్లో లెక్చరర్ల పోస్టులు భర్తీ చేయలేదు. మన దేశంలో ప్రతి 30 మంది స్కూడెంట్లకు ఒక టీచర్ ఉండగా ఆ నిష్పత్తి అమెరికాలో 12:1గా, చైనా, బ్రెజిల్ లో 19:1గా, బిటన్ 16:1, రష్యా 10:1, కెనడా 9:1గా ఉంది. ప్రైమరీ స్కూళ్లలో ఇద్దరు, అప్పర్ ప్రైమరీ స్కూళ్లలో ముగ్గురు టీచర్లు ఉండాలని నిబంధనలు ఉన్నాయి. కానీ, దేశంలో కొన్ని వేల బడులు ఒకే టీచర్ తో నడుస్తున్నాయి.

నిర్వీర్యం అవుతున్న సర్కారీ బడులు..

గత లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో టీచర్లు టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఓట్లు వేయలేదని సీఎం కేసీఆర్ వారిపై కక్ష గట్టారు. 2015 సెప్టెంబర్ 27న జీవో నంబర్ 6ను తెచ్చి 20 మందిలోపు స్టూడెంట్లు ఉన్న స్కూళ్లు మూసేయాలని నిర్ణయించారు. గతంలో ఈ జీవోను పాక్షికంగా అమలు చేయటం ద్వారా 916 ప్రభుత్వ స్కూళ్లను మూసేశారు. కానీ, ఇప్పుడు దీనిని పూర్తిగా అమలు చేయాలని కేసీఆర్ నిర్ణయించడంతో రాష్ట్రంలో 12 వేల ప్రభుత్వ స్కూళ్లు మూతపడే అవకాశం ఉంది. ఇదే జరిగితే 80 వేల మంది ప్రభుత్వ టీచర్లు ఉద్యోగాలు కోల్పోతారు. అలాగే పదేండ్ల వరకూ టీచర్ పోస్టులు భర్తీ చేయకపోతే రాష్ట్రంలో బీఈడీ, డీఈడీ చేసిన 6 లక్షల మంది నిరుద్యోగులుగా మారిపోతారు. అలాగే పేద స్టూడెంట్లు చదువుకు దూరమవుతారు. కేంద్రం విద్యా రంగానికి కేటాయించే నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం సరిగా వాడుకోవడం లేదు. కేంద్రం ఇచ్చిన నిధులకు “యుటిలైజేషన్ సర్టిఫికెట్” ఇవ్వకపోవడంతో రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులు ఆపేసింది.

టీచర్లకు బోధనేతర పనులు..

రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా టీచర్లకే ఆ విధులు అప్పగిస్తున్నారు. మధ్యాహ్న భోజన నిర్వహణ పనులు కూడా వారికే ఇస్తున్నారు. ఈ బాధ్యతలు అప్పగించవద్దని టీచర్లు అంటున్నా ప్రభుత్వం వినటం లేదు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో విద్యా బోధన పర్యవేక్షించి, విద్యా ప్రమాణాలు పెంచాల్సిన డీఈవో, డిప్యూటీ డీఈవో, డైట్ లెక్చరర్లు, ఎంఈవో పోస్టులు 1,029 అందుబాటులో ఉండగా వీటిలో 948 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

సంక్షేమ హాస్టళ్లను నాశనం చేస్తున్న సర్కారు..

రాష్ట్రంలో 878 ఎస్సీ, 312 ఎస్టీ, 687 బీసీ, 18 దివ్యాంగ సంక్షేమ హాస్టళ్లున్నాయి. వీటిలో 2,13,134 మంది స్టూడెంట్లు వసతి పొందుతున్నారు. కానీ, రాష్ట్ర ప్రభుత్వం వీటిపై సవతి తల్లి ప్రేమ చూపిస్తూ నిధులు కేటాయించటం లేదు. 90% హాస్టళ్లలో రక్షిత మంచినీరు లేదు. చాలా చోట్ల భవనాలు శిథిలావస్థలో ఉన్నాయి. 80% హాస్టళ్లలో బాత్రూంలు అపరిశుభ్రంగా ఉన్నాయి. చాలా హాస్టళ్లలో జ్వరం, దగ్గు, జలుబు, మందు గోళీలు కూడా ఉండటం లేదు. ఒక్క వార్డెన్ 3-4 హాస్టళ్లకు ఇన్ చార్జీలుగా కొనసాగుతుండటంతో పర్యవేక్షణ లోపించింది.

చదువు కోసం ప్రజల ఖర్చు ఎక్కువే..

దేశంలోని పలు రాష్ట్రాలతో పోల్చుకుంటే తెలంగాణలో పిల్లల చదువు కోసం చేసే వ్యయం ఎక్కువగా ఉన్నది. జాతీయ సగటుతో పోల్చినా అది ఎక్కువే. ప్రి–ప్రైమరీ నుంచి పీజీ వరకు సాధారణ కోర్సులపై దేశంలో ఒక్కో కుటుంబం సంవత్సరానికి సగటున రూ. 8,331 వ్యయం చేస్తుండగా, తెలంగాణలో రూ.13,095 వ్యయం చేస్తున్నారు. ఇది జాతీయ సగటు వ్యయం కంటే 58% ఎక్కువ. రాష్ట్రంలో 2,350 కార్పొరేట్ స్కూల్స్ ఉండగా, 150 వరకు సీబీఎస్ఈ, ఐసీఎస్ సిలబస్ బోధించే ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. వీటిపై ప్రభుత్వ నియంత్రణ లేక పోవడంతో రూ.40 వేల నుంచి 7 లక్షల వరకు ఫీజులు వసూలు చేస్తున్నారు. అయినా ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. కరోనా సంక్షోభం కారణంగా ఈ ఏడాది ప్రైవేటు స్కూళ్లు ఎలాంటి ఫీజులు పెంచరాదని, ట్యూషన్ ఫీజు మాత్రమే.. అది కూడా నెలనెలా వసూలు చేయాలని జీవో 46ను జారీ చేసింది. అయినా కొన్ని పాఠశాలలు 10-–20% ఫీజును పెంచాయి. ఆన్ లైన్ క్లాసుల కోసం పిల్లలకు ట్యాబ్ లు, ల్యాప్ టాప్ లు కొనాలని వేధిస్తున్నాయి.

విస్తరిస్తున్న కార్పొరేట్ జూనియర్ కాలేజీలు

రాష్ట్రంలో 404 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, 1,460 ప్రైవేటు జూనియర్ కాలేజీలు, 226 కార్పొరేట్ కాలేజీలు మొత్తంగా 2,600 జూనియర్ కాలేజీలున్నాయి. వీటిలో 4.5 లక్షల మంది స్టూడెంట్లు చదువుతున్నారు. వీరిలో లక్ష మంది మాత్రమే ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో చదువుతున్నారు. కార్పొరేట్ కాలేజీలన్నీ హైదరాబాద్ లోని 1-2 బ్రాంచీల్లో వచ్చే స్టూడెంట్ల ర్యాంకులను రాష్ట్ర మంతా ప్రచారం చేసుకుని తల్లిదండ్రుల నుంచి లక్షలాది రూపాయలు ఫీజులు వసూలు చేస్తున్నాయి. గతంలో కార్పొరేట్ కాలేజీలు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోనే ఎక్కువగా కొనసాగాయి. కానీ, టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక కార్పొరేట్ కాలేజీ యాజమాన్యాలు.. ప్రభుత్వ పెద్దలతో కుమ్మక్కై కరీంనగర్, వరంగల్, మెదక్, సిద్దిపేట, నల్గొండ, మహబూబ్ నగర్, వనపర్తి, వికారాబాద్, భువనగిరిల్లో కాలేజీల ఏర్పాట్లకు ప్రయత్నాలు చేస్తున్నాయి.

పతనావవస్థకు ఉన్నత విద్యారంగం..

రాష్ట్రంలోని ప్రభుత్వ ఉన్నత విద్యారంగం పతనావస్థకు చేరుకుంది. రాష్ట్ర ప్రభుత్వం పోస్టులు భర్తీ చేయకపోవడంతో క్లాసులన్నీ లెక్చరర్ల కోసం ఎదురుచూస్తున్నాయి. స్టూడెంట్ల సంఖ్యకు సరిపోను అధ్యాపకులు లేక ప్రమాణాలు దెబ్బతింటున్నాయి. ఈ కారణం వలన ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదివే స్టూడెంట్లు, ఎంసెట్, నీట్, జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్ వంటి పరీక్షల్లో వెనకబడి ఉన్నారు. రాష్ట్రంలోని 55 పాలిటెక్నిక్, 404 జూనియర్, 131 డిగ్రీ కాలేజీలు, 11 యూనివర్సిటీల్లో 14,538 అధ్యాపకుల పోస్టులు అందుబాటులో వీటిలో 9,937 పోస్టులు ఖాళీగా ఉన్నవి. సరిపడా లెక్చరర్లు లేక డిగ్రీ, పీజీ కాలేజీలకు, యూనివర్సిటీలకు కేంద్రం నుంచి అనుకున్న స్థాయిలో నిధులు రావటం లేదు. 2020-21 విద్యా సంవత్సరంలో ఉన్నత విద్యా మండలి రాష్ట్రంలో కొత్త కోర్సులతో ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో దాదాపు 1.50 లక్షల సీట్లను కేటాయించింది. కానీ డిగ్రీ కాలేజీలను లెక్చరర్ల కొరత వేధిస్తున్నది. యూజీసీ నిబంధనల ప్రకారం 6,500 మంది లెక్చరర్లు ఉండాల్సి ఉండగా.. ప్రస్తుతం 1,276 మంది పర్మినెంట్ లెక్చరర్లు, 841 మంది కాంట్రాక్ట్, 1,940 గెస్ట్ లెక్చరర్లు కలిపి మొత్తం 4,098 మంది మాత్రమే ఉన్నారు.

కాలేజీల ఏర్పాటులో మాట తప్పిన కేసీఆర్..

2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే రాష్ట్రంలో నియోజకవర్గానికి ఒక పాలిటెక్నిక్ కాలేజీ, జిల్లాకు ఒక ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీ నిర్మిస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారు. ఇదే విషయాన్ని ఎన్నికల మ్యానిఫెస్టోలో కూడా చేర్చారు. కానీ, ప్రజల ఓట్లు కొల్లగొట్టి అధికారంలోకి వచ్చిన తరువాత దాని ఊసే మరిచి ఒక్క పాలిటెక్నిక్ కాలేజీగానీ, ఇంజనీరింగ్ కాలేజీగానీ నిర్మించకుండా మాట తప్పాడు.

ప్రైవేటులోనూ రీయింబర్స్ మెంటు ఇవ్వాలె..

పేద, దిగువ మధ్య తరగతి స్టూడెంట్లకు ప్రైవేటు స్కూళ్లలో నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో 2009లో కేంద్ర ప్రభుత్వం ఉచిత నిర్భంద విద్యా హక్కు చట్టాన్ని తెచ్చింది. దీని ప్రకారం ప్రతి ప్రైవేటు స్కూల్ లో పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ స్టూడెంట్లకు 25% సీట్లు ఉచితంగా కేటాయించి.. ఫీజును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 55:45 నిష్పత్తిలో చెల్లించాలి. ఈ పథకం యూపీ, మధ్యప్రదేశ్, ఢిల్లీ, గుజరాత్, కేరళ, తమిళనాడుల్లో అమలవుతున్నా మన రాష్ట్రంలో అమలు కావడం లేదు.

– కపిలవాయి దిలీప్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ, టీఆర్ఎల్డీ రాష్ట్ర అధ్యక్షుడు

For More News..

ఉపఎన్నికల్లో సెంటిమెంట్‌‌‌‌ పన్జేయట్లే..

2021 సెలవుల లిస్ట్ వచ్చేసింది..

గ్రామాల్లో ఇండ్ల మ్యుటేషన్‌కు చార్జీ రూ.800