- పదేండ్లలో 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తెచ్చాం
- గ్రామీణ ఉపాధి కల్పన కోసమే జీ రామ్ జీ చట్టం తీసుకొచ్చాం
- ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇండియా డిఫెన్స్ ఉత్పత్తులకు గిరాకీ పెరిగిందని వ్యాఖ్య
- ప్రారంభమైన పార్లమెంట్ సమావేశాలు
- ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం
- జీ రామ్ జీ చట్టంపై ప్రతిపక్షాల ఆందోళన
న్యూఢిల్లీ, వెలుగు: దేశంలో అవినీతి, కుంభకోణాలకు తావు లేకుండా, ప్రజాధనాన్ని సద్వినియోగం చేసుకుంటూ కేంద్ర ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. పన్ను చెల్లింపుదారుల ప్రతి రూపాయి అభివృద్ధి, సంక్షేమం కోసమే ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. ఉపాధి కల్పన కోసమే జీ రామ్ జీ చట్టాన్ని ప్రభుత్వం తీసుకొచ్చిందని స్పష్టం చేశారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా బుధవారం ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ముర్ము ప్రసంగించారు
దేశం వికసిత్ భారత్ వైపు వడివడిగా పయనిస్తోందని చెప్పారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని సంస్కరణల పథంలో దూసుకెళ్తోందన్నారు. పీఎల్‌ఐ స్కీం కింద పారిశ్రామికోత్పత్తిని ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల్లో గణనీయమైన ప్రగతి సాధించామని చెప్పారు. సముద్ర వ్యాపారాన్ని మరింత పెంచేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు వెల్లడించారు. పేదల అభ్యున్నతికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, గత పదేండ్లలో పేదల కోసం నాలుగు కోట్ల ఇళ్లు కట్టించామని రాష్ట్రపతి తెలిపారు. జల్ జీవన్ మిషన్ కింద గ్రామాలకు తాగునీరు అందిస్తున్నామని తెలిపారు.
‘‘పదేండ్లలో 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చాం. 10 కోట్లకు పైగా గ్యాస్ కనెక్షన్లు అందించాం. వందేభారత్, అమృత్ భారత్ రైళ్లతో సేవలు విస్తరించాం. ఆయుష్మాన్ భారత్‌తో గతేడాది 2.5 కోట్ల మందికి ఉచిత వైద్యం అందించాం. వరి ఉత్పత్తిలో ప్రపంచంలోనే ఇండియా అగ్రస్థానంలో నిలిచింది. ఆక్వా, పాల ఉత్పత్తుల్లోనూ ముందంజలో ఉంది’’ అని
పేర్కొన్నారు. సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ లక్ష్యంలో దళితులు, వెనకబడిన, అణగారిన వర్గాల అభివృద్ధిపై దృష్టి పెట్టినట్లు చెప్పారు. 2014లో కేవలం 25 కోట్ల మంది పౌరులకు సామాజిక భద్రత పథకాలు దక్కితే, ప్రస్తుతం 95 కోట్ల మంది ఈ పథకం పరిధిలోకి వచ్చారన్నారు.
మన డిఫెన్స్ ఉత్పత్తులకు గిరాకీ..
దేశంలో స్పేస్ టూరిజం అభివృద్ధికి ఎన్నో అవకాశాలున్నాయని రాష్ట్రపతి అన్నారు. భవిష్యత్‌లో అంతరిక్షంలో స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేస్తామని, జమ్మూకాశ్మీర్‌లో అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జి నిర్మించామని తెలిపారు. గత 11 ఏండ్లలో దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందిందన్నారు. ‘‘జీఎస్టీ స్లాబ్‌ల తగ్గింపుతో దేశ ప్రజల కొనుగోలు శక్తి పెరిగింది. ఈయూతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకున్నాం. రూ.12 లక్షల వార్షిక ఆదాయం వరకు ఆదాయపు పన్ను లేకుండా చేశాం. స్మార్ట్‌ఫోన్ల ఎగుమతుల్లోనూ దేశం దూసుకెళ్తోంది. దేశం పవర్ టెక్నాలజీ హబ్‌గా రూపొందుతోంది. గ్రీన్ ఎనర్జీ రంగంలో ఇండియాను పవర్ హౌస్‌గా తయారు చేస్తున్నాం. భవిష్యత్‌లో 100 గిగావాట్ల న్యూక్లియర్ ఎనర్జీ ఉత్పత్తి లక్ష్యం. 500 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తికి చర్యలు. వికసిత్ భారత్‌లో రైతుకు అధిక ప్రాధాన్యత ఉంటుంది’’ అని తెలిపారు. ‘‘గ్రామీణ ఉపాధి కల్పన కోసం జీ రామ్ జీ చట్టం తీసుకొచ్చాం. దేశాభివృద్ధిలో మహిళలకు కీలక పాత్ర కల్పించాం. ఆపరేషన్ సిందూర్ తర్వాత మన దేశ డిఫెన్స్ ఉత్పత్తులకు గిరాకీ పెరిగింది” రాష్ట్రపతి వివరించారు.
బీజాపూర్‌కు బస్సు వస్తే.. పండుగ చేసుకున్నరు..
దేశం నుంచి నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించే రోజు ఎంతో దూరంలో లేదని రాష్ట్రపతి ముర్ము స్పష్టం చేశారు. ఒకప్పుడు మావోయిస్టు భావజాలంతో 126 జిల్లాల్లో అభద్రత, భయం, అపనమ్మక వాతావరణం ఉండేదన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వ విధానాలతో కేవలం ఆ సంఖ్య 8 జిల్లాలకు తగ్గిందన్నారు. ఏడాది కాలంలో 2 వేల మంది మావోయిస్టులు లొంగిపోయారని చెప్పారు. మావోయిస్ట్ ప్రభావం ఉన్న బీజాపూర్ గ్రామానికి 25 ఏండ్ల తర్వాత బస్సు చేరుకున్నప్పుడు, గ్రామస్తులు దానిని ఒక పండుగలా జరుపుకున్నారని తెలిపారు. బస్తర్ ఒలింపిక్స్‌లో యువత ఉత్సాహంగా పాల్గొంటున్నారని, ఆయుధాలు విడిచిపెట్టిన వాళ్లు ఇప్పుడు జగదల్‌పూర్‌లోని పాండుం కేఫ్‌లో సేవలందిస్తున్నారని చెప్పారు.
రాష్ట్రపతి ప్రసంగంలో వాస్తవం, జవాబుదారీతనం లేదు: ఖర్గే
జీ రామ్ జీ చట్టంపై రాష్ట్రపతి ముర్ము ప్రసంగిస్తున్నప్పుడు ప్రతిపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. ప్లకార్డులు చేతపట్టుకుని చట్టానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. పాత ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని, జీ రామ్ జీ చట్టాన్ని రద్దు చేయాలని నినదించారు. దీంతో ఉభయ సభల సంయుక్త సమావేశంలో గందరగోళం నెలకొంది. అనంతరం రాజ్యసభ ప్రతిపక్షనేత మల్లికార్జున ఖర్గే మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రపతి ప్రసంగంలో వాస్తవం, జవాబుదారీతనం లేదని విమర్శించారు.
పేద ప్రజల గురించి ప్రసంగంలో నొక్కి చెప్పారని.. కానీ వాస్తవానికి కోట్లాది మంది పేద ప్రజలకు జీవనోపాధి అయిన ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేశారన్నారు. కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం రాసిచ్చిన ప్రసంగాన్ని రాష్ట్రపతి చదివారని, అందులో కొత్తదనమేమీ లేదన్నారు. కొన్ని సంఖ్యల్లో మార్పులు తప్ప.. కొత్తగా ఏమీ లేదని సీపీఎం రాజ్యసభ పక్షనేత జాన్ బ్రిట్టాస్ విమర్శించారు. కాగా, రాష్ట్రపతి ప్రసంగానికి ఆటంకం కలిగించేలా విపక్షాలు ఆందోళన వ్యక్తం చేయడం దారుణమని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తప్పుపట్టారు.
