రైతుబంధు.. కొత్తోళ్లకు రాలే

రైతుబంధు.. కొత్తోళ్లకు రాలే
  • యాదాద్రి జిల్లాలో 2.61 లక్షల మంది రైతులు
  • 1.95 లక్షల మందికే అందిన రైతు బంధు

యాదాద్రి, వెలుగు: ప్రతి రైతుకు రైతుబంధు ఇస్తామన్న సర్కారు హామీ నెరవేరడం లేదు. కొత్తగా పట్టాదార్‌‌‌‌‌‌‌‌ పాస్‌‌‌‌‌‌‌‌ పుస్తకాలు వచ్చినోళ్లతో పాటు, పెద్ద రైతులకు కూడా రైతుబంధు సొమ్ము జమ చేయడం లేదు. యాదాద్రి జిల్లాలో మొత్తం 2,61,052 మంది రైతులు ఉండగా వీరిలో కొత్తగా పాస్‌‌‌‌‌‌‌‌బుక్స్‌‌‌‌‌‌‌‌ వచ్చిన వారు 30,167 మంది ఉన్నారు. అందరికీ కలిపి రూ. 303.84 కోట్ల రైతుబంధు జమ కావాల్సి ఉంది. ఈ సీజన్‌‌‌‌‌‌‌‌ మొదటి విడతలో భాగంగా డిసెంబర్​ 29న ఒకే రోజు ఎకరం లోపు భూమి ఉన్న 70 వేల మంది రైతులకు రూ. 25 కోట్లు జమ చేసింది. ఆ తర్వాత రోజుకు 5 వేల నుంచి 10 వేల మందికి మాత్రమే డబ్బులు జమ చేస్తున్నారు. జిల్లాలో ఇప్పటివరకు ఐదు ఎకరాల్లోపు భూమి ఉన్న 1,95,447 మంది రైతులకు రూ.169.65 కోట్లు జమ చేశారు. టెక్నికల్​ కారణాలతో మరో 2,148 మంది అకౌంట్లలో రూ. 2.40 కోట్లు జమ కాలేదు. 

కొత్త వాళ్లు, పెద్ద రైతులకు అందని డబ్బులు

కొత్తగా పాస్‌‌‌‌‌‌‌‌బుక్స్‌‌‌‌‌‌‌‌ పొందిన వారితో పాటు, ఐదెకరాలకు మించి భూమి ఉన్న రైతులకు రైతుబంధు జమ కావడం లేదు. ఇలాంటి వారు జిల్లాలో 30,167 మంది ఉండగా వీరి వివరాలు సీసీఎల్‌‌‌‌‌‌‌‌ఏ నుంచి అగ్రికల్చర్‌‌‌‌‌‌‌‌ డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌కు అందలేదు. పైగా సైట్‌‌‌‌‌‌‌‌ సరిగా ఓపెన్‌‌‌‌‌‌‌‌ కాకపోవడంతో కొత్త లబ్ధిదారుల పేర్లను ఎంట్రీ చేసే అవకాశం లేకుండా పోయింది. దీంతో వీరికి సంబంధించిన రూ. 13.41 కోట్లు అందే అవకాశం లేకుండా పోయింది. అలాగే ఐదెకరాలకు మించి భూమి ఉన్న 35,438 మంది రైతులకు రూ. 118 కోట్లు అందాల్సి ఉంది.

ఇంకా డబ్బులు అందలే... 

నాకు మూడు నెలల కింద కొత్త పాస్‌‌‌‌‌‌‌‌బుక్‌‌‌‌‌‌‌‌ వచ్చింది. రైతుబంధుకు దరఖాస్తు చేసుకున్నా పైసలు రాలేదు. ఏఈవోను అడిగితే సైట్‌‌‌‌‌‌‌‌ ఓపెన్‌‌‌‌‌‌‌‌ కావడం లేదని చెబుతున్నారు. 
–ఓర్సు తిరుపతి, పాటిమట్ల, మోత్కూర్‌‌‌‌‌‌‌‌ మండలం 

అందరికీ వస్తది 

టెక్నికల్‌‌‌‌‌‌‌‌ కారణాలతో రైతుబంధు డబ్బులు అందడం లేదు. కొంత ఆలస్యమైనా ప్రతి ఒక్కరికి పైసలు వస్తాయి. ఎవరూ ఆందోళన చెందొద్దు. – అనురాధ, డీఏవో