రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదు

రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదు
  • ఎన్​డబ్ల్యూసీకి రాష్ట్ర మహిళా మోర్చా ఫిర్యాదు

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో మహిళలకు రక్షణ, భద్రత లేదని బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర నేతలు జాతీయ మహిళ కమిషన్(ఎన్​డబ్ల్యూసీ)కు ఫిర్యాదు చేశారు. తెలంగాణ మహిళా మోర్చా అధ్యక్షురాలు గీతామూర్తి నేతృత్వంలో మహిళలు గురువారం ఢిల్లీలో నేషనల్ విమెన్ కమిషన్ చైర్ పర్సన్ రేఖా శర్మను కలిశారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, మహిళలను కించపరిచేలా బీఆర్ఎస్ నేతల కామెంట్లు, మహిళల అభద్రతపై ఆమెకు ఆధారాలను అందించారు. తర్వాత తెలంగాణ భవన్​లో గీతా మూర్తి మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో అత్యాచారాలు, అమానవీయ ఘటనలపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మహిళా కమిషన్, రాష్ట్ర హోం మంత్రి, డీజీపీకి విజ్ఞప్తి చేసినా స్పందించకపోవడంతో ఎన్​డబ్ల్యూసీను ఆశ్రయించినట్లు చెప్పారు. రాష్ట్ర గవర్నర్​పై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసభ్య కామెంట్లు చేస్తున్నా రాష్ట్ర మహిళా కమిషన్ స్పందించడం లేదన్నారు. కేటీఆర్ దత్తత తీసుకున్న ఇలాకాలో ఓ బాలికపై రేప్, నిజామాబాద్ ఓ అమ్మాయిపై సాముహిక అత్యాచార ఘటనపై దర్యాప్తు చేయాలని కోరినట్లు చెప్పారు. తమ ఫిర్యాదులపై రేఖా శర్మ సానుకూలంగా స్పందించారని వెల్లడించారు. త్వరలో తెలంగాణలో పర్యటిస్తామని, ఈ ఘటనలపై ఎంక్వైరీ చేస్తామని భరోసా ఇచ్చారన్నారు.