పదో తారీఖు వచ్చినా ప్రభుత్వ ఉద్యోగులకు నో సాలరీస్

పదో తారీఖు వచ్చినా  ప్రభుత్వ ఉద్యోగులకు నో సాలరీస్

పదో తారీఖు వచ్చినా రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఇంకా జీతాలియ్యలేదు ప్రభుత్వం. RBI నుంచి అప్పు తీసుకున్న తర్వాతే సాలరీలు వస్తాయని ఆర్థికశాఖ అధికారులు చెప్తున్నారు. దీనికి ఇంకో 4 రోజులు పడుతుందని అంటున్నారు. జీతాలు ఆలస్యం కావడంతో  టైమ్   కు EMI లు కట్టలేకపోతున్నమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఉద్యోగులు.

ధనిక రాష్ట్రంలో జీతాలకు కటకట ఏర్పడింది. పదో తారీఖు వచ్చినా ప్రభుత్వ ఉద్యోగులకు, టీచర్లకు శాలరీలు అందలేదు. పెన్షనర్ల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. శనివారం వరకు 14 జిల్లాల్లోని ఉద్యోగులు, టీచర్లకు మాత్రమే జీతాలు జమ చేసినట్లు తెలిసింది. మరో 19 జిల్లాల్లో ఉద్యోగులకు ఎదురు చూపులు తప్పడం లేదు. ఆదివారం సెలవు కావడంతో కనీసం సోమవారమైనా జీతాలు వేస్తారని ఉద్యోగులు ఆశ పడుతున్నారు. ఐతే జీతాలు పూర్తి స్థాయిలో చెల్లించేందుకు ఇంకో 3,4  రోజులు పడుతుందని ఫైనాన్స్, ట్రెజరీ శాఖల ఆఫీసర్లు చెప్తున్నారు. రూ.2.56 లక్షల కోట్లతో భారీ బడ్జెట్ ప్రవేశపెట్టిన నెల రోజులకే.. ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే శాలరీలు ఇచ్చేందుకు ఇబ్బందులు ఉండటంతో రానున్న రోజుల్లో... పరిస్థితి ఏంటని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. నిధుల్లేకనే ఫైనాన్స్ డిపార్ట్ మెంట్ ప్రతీ నెలా జీతాలు విడతల వారీగా జిల్లాలకు ఇస్తున్నట్లు తెలుస్తోంది.

రాష్ట్ర ప్రభుత్వం గత ఆర్థిక సంవత్సరం నుంచి ఉద్యోగులకు జీతాలను ఆలస్యంగా చెల్లిస్తూ వస్తున్నది. ఈసారి అలాంటి పరిస్థితి ఉండదని బడ్జెట్ సమావేశాల్లో ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు చెప్పారు. దీంతో ఫస్ట్ తారీఖునే జీతాలు  వస్తాయనుకున్న ఉద్యోగులకు నిరాశే ఎదురైంది. ప్రభుత్వం ఈ నెల 11 న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రూ.1,000 కోట్ల అప్పు తీసుకోనుంది. ఆ తర్వాత జీతాలు, పెన్షన్ల చెల్లింపులు పూర్తవుతాయని ఆఫీసర్లు చెప్తున్నారు. ఈ ఏడాది ఆశించిన మేరకు రాబడి పెరిగినా.. జీతాలకు, ఇతర ఏ అవసరాలకైనా అప్పులే దిక్కవుతున్నాయి. లిక్కర్ తో పాటు రిజిస్ట్రేషన్లతో భారీగా ఆదాయం వస్తున్నా గతంలో తెచ్చిన అప్పులు, వడ్డీల చెల్లింపులకే ప్రతీ నెలా రూ.3 వేల కోట్ల వరకు కట్టాల్సి వస్తోంది. ఇవీ కాక పెద్ద ఎత్తున హామీలు ఇవ్వడం.. వాటికి నిధులు సర్దుబాటు చేయలేకపోవడంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గందరగోళంగా మారిందంటున్నారు నిపుణులు.

రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లకు, ఇతర ఎంప్లాయీస్ కు ప్రతీ నెలా జీతాల రూపంలో రూ.2 వేల 600 కోట్లు చెల్లించాల్సి ఉంది. పెన్షనర్లకు రూ.1,400 కోట్ల దాకా అవుతున్నాయి. అంటే నెలకు రూ.4 వేల కోట్ల చొప్పున ఈ ఆర్థిక సంవత్సరంలో యావరేజ్ గా జీతాలు, పెన్షన్లకు రూ.48 వేల కోట్లు అవుతాయి. మరోవైపు ఈ ఏడాది రూ.59 వేల కోట్ల భారీ అప్పు తీసుకోవాలని సర్కార్ టార్గెట్  గా పెట్టుకుంది. ప్రతీ నెలా రూ.5 వేల కోట్లు అప్పు తీసుకునేలా ప్లాన్ చేసుకుంది. ఆదాయం మాట అటుంచితే తెచ్చిన అప్పుల్లో నుంచే శాలరీలు చెల్లించాల్సిన పరిస్థితి ఉంది.

జీతాలు ఆలస్యంగా వస్తుండటంతో ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు ఉద్యోగులు, టీచర్లు. 90 శాతం ప్రభుత్వ ఉద్యోగులు హోం లోన్లు తీసుకున్నామని... పర్సనల్ లోన్లు తీసుకొని పిల్లలని చదివిస్తున్నామని, ఈఎంఐలు టైంకు కట్టలేకపోతున్నామని వర్రీ అవుతున్నారు. లోన్లు ఇచ్చిన బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు పదో తారీఖు లోపు వాయిదాలు చెల్లించకపోతే  తమ ఖాతాలను స్తంభింపజేసి పెనాల్టీలు విధిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తెలంగాణ రైతులకు బండి సంజయ్ బహిరంగ లేఖ

 

నేను భారతీయుడిని.. తెలుగువాడిని, తెలంగాణవాడిని

యాదాద్రి నిర్మాణంలో వంద లోపాలు ఉన్నాయి