ఉపాధి ఉద్యోగులకు జీతాలొస్తలే..

ఉపాధి ఉద్యోగులకు జీతాలొస్తలే..
  •  రాష్ట్ర వ్యాప్తంగా 4 వేల మంది ఎంప్లాయీస్‌‌‌‌
  • మూడు నెలలుగా అందని జీతాలు
  • నిధులను ఇతర పనులకు వాడుకున్న గత ప్రభుత్వం
  • ఫండ్స్‌‌‌‌ లేవని జీతాలు ఆపేసిన గ్రామీణాభివృద్ధి శాఖ

నల్గొండ, వెలుగు : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న ఉద్యోగుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. మూడు నెలల నుంచి జీతాలు అందకపోవడంతో ముప్పుతిప్పలు పడుతున్నారు. కాంగ్రెస్‌‌‌‌ సర్కార్‌‌‌‌ అధికారంలోకి రాగానే ఉపాధి ఉద్యోగులను పర్మినెంట్‌‌‌‌ చేస్తామని హామీ ఇచ్చింది. కానీ ఇప్పుడు అసలు జీతాలే రాకపోవడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తమ జీతాలు చెల్లించాలని, ఉద్యోగాలను పర్మినెంట్‌‌‌‌ చేయాలని ఉపాధి హామీ పథకం ఉద్యోగులు ఇప్పటికే పలుమార్లు మంత్రి సీతక్కను కలిసి విజ్ఞప్తి చేశారు. అయినా సమస్య పరిష్కారం కాకపోవడంతో ఈఎంఐలు కట్టలేక, కుటుంబాలను పోషించుకోలేక ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

రాష్ట్ర వ్యాప్తంగా 4 వేల మందికి పైనే...

వేసవిలో ఉపాధి హామీ పనులకే డిమాండ్‌‌‌‌ ఎక్కువ. ఉపాధి హామీ పథకం కింద గ్రామాల్లో 220 రకాల పనులు చేస్తున్నారు. ఈ స్కీం కింద రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వేల మందికి పైగా పనిచేస్తున్నారు. ఫీల్డ్‌‌‌‌ అసిస్టెంట్లు మరో 7,500 మంది ఉన్నారు. కాంట్రాక్ట్‌‌‌‌, అవుట్‌‌‌‌ సోర్సింగ్‌‌‌‌ కింద పనిచేస్తున్న ఉద్యోగుల్లో 392 మంది ఏపీవోలు, 280 మంది ఇంజినీరింగ్‌‌‌‌ కన్సల్టెంట్లు, 2,028 మంది టెక్నికల్‌‌‌‌ అసిస్టెంట్లు, 870 మంది అకౌంట్‌‌‌‌ అసిస్టెంట్లతో పాటు అడిషనల్‌‌‌‌ పీడీలు, ప్లాంటేషన్‌‌‌‌ మేనేజర్లు, సూపర్‌‌‌‌వైజర్లు, పీవోలు ఇలా వివిధ విభాగాల్లో పనులు చేస్తున్నారు. 

వీరందరికీ ఉపాధి స్కీం కింద కేటాయించిన బడ్జెట్‌‌‌‌లోనే ప్రతి నెల జీతాలు చెల్లించాల్సి ఉంటుంది. గతేడాది అక్టోబర్‌‌‌‌ నుంచే జీతాల చెల్లింపు సక్రమంగా సాగడం లేదు. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికలు రావడంతో ఉపాధి ఉద్యోగుల గురించి పట్టించుకోవడమే మానేశారు. రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్‌‌‌‌ నుంచి ఇప్పటివరకు జీతాలు పెండింగ్‌‌‌‌లోనే ఉన్నాయి. గత ప్రభుత్వం ఉపాధి నిధులను వేరే పనులకు వాడుకోవడంతో ఇప్పుడు నిధుల కొరత ఏర్పడింది. మళ్లీ కొత్త బడ్జెట్‌‌‌‌ వస్తే తప్ప జీతాలు ఇవ్వలేమని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఆఫీసర్లు చెబుతున్నారు.

పే స్కేల్‌‌‌‌ సైతం పెండింగ్‌‌‌‌లోనే...

2014కు ముందు వివిధ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌‌‌‌ ఉద్యోగులను బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ సర్కార్‌‌‌‌ రెగ్యులరైజ్‌‌‌‌ చేసింది. అంతేకాకుండా గ్రామీణాభివృద్ధి శాఖలో సెర్ప్‌‌‌‌ విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగులకు పే స్కేల్‌‌‌‌ సైతం వర్తింపచేసింది. కానీ అదే డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ పరిధిలో పనిచేస్తున్న ఉపాధి ఉద్యోగులను పక్కన పెట్టింది. ఉపాధి నిధులతోనే గ్రామాల్లో శ్మశానవాటికలు, పల్లె ప్రకృతి వనాలు, సీసీ రోడ్లు, హరితహారం, నర్సీలు వంటి అనేక రకాల పనులు చేపట్టగా, అందులో ఉపాధి ఉద్యోగులు సైతం పాలుపంచుకున్నారు. 

తమకు పే స్కేల్‌‌‌‌ వర్తింపజేయాలని అసెంబ్లీ ఎన్నికలకు ముందు అప్పటి మంత్రి హరీశ్‌‌‌‌రావు ఇంటి వద్ద ఆందోళన చేశారు. కానీ పే స్కేల్‌‌‌‌ విషయంలో ఎలాంటి హామీ లభించలేదు. దీంతో తాము అధికారంలోకి రాగానే పే స్కేల్‌‌‌‌ వర్తింపజేస్తామని కాంగ్రెస్‌‌‌‌ హామీ ఇచ్చింది. దీనికి సంబంధించిన ఫైల్‌‌‌‌ ప్రస్తుతం మంత్రి సీతక్క దగ్గరి నుంచి ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క వద్దకు చేరింది. కానీ రాష్ట్రంలో ఎంపీ ఎన్నికల హడావుడి మొదలవడంతో ఫైల్‌‌‌‌ పక్కన పడింది.