టెస్టింగ్ సెంటర్లలో నో సోషల్ డిస్టెన్స్

టెస్టింగ్ సెంటర్లలో నో సోషల్ డిస్టెన్స్
  • కరోనా టెస్టుల వద్ద సోషల్ డిస్టెన్సింగ్ నిబంధన గాలికి
  • ఎలాంటి చర్యలు చేపట్టని సర్కార్​
  • ప్రభుత్వ సెంటర్లలో కిట్ల కొరత.. 30% మందికే టెస్టులు

హైదరాబాద్, వెలుగు: కరోనా టెస్టింగ్​సెంటర్లు వైరస్ వ్యాప్తికి​ సెంటర్లుగా మారుతున్నాయి. రోజురోజుకీ రాష్ట్రంలో కేసులు పెరుగుతుండడంతో ఏ ఒక్క లక్షణం కనిపించినా భయంతో జనం టెస్టు కోసం క్యూకడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పీహెచ్‌‌సీ సెంటర్లలో రోజూ 250 నుంచి 300 మంది, ఏరియా డిస్ట్రిక్ట్, టీచింగ్ హాస్పిటళ్లకు రోజూ 600 నుంచి వెయ్యి మంది వరకు టెస్టు కోసం వెళ్తున్నారు. అక్కడ వైరస్ సోకిన వాళ్లు, లేని వాళ్లు అంతా ఒకే చోట గుంపులుగా చేరుతున్నారు. ఏ ఒక్క చోటా సోషల్ డిస్టెన్సింగ్ నిబంధన పాటిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. దీంతో ఆ టెస్టు సెంటర్ల దగ్గరే వైరస్ వ్యాప్తి పెరిగే ప్రమాదం కనిపిస్తోంది.
 

అరకొరగా కిట్లు
దాదాపు రాష్ట్రంలోని అన్ని టెస్టింగ్ సెంటర్లలో ముందుగా ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులే చేస్తున్నారు. ఈ టెస్టులో నెగెటివ్ వచ్చి, ఆ తర్వాత కూడా కరోనా లక్షణాలు ఉంటేనే ఆర్టీపీసీఆర్ టెస్టు చేస్తామని అధికారులు చెబుతున్నారు. అయితే వైరస్ వ్యాప్తి పెరుగుతున్నా సర్కారు ఇంకా టెస్టింగ్ కిట్లను సరిపడా సప్లై చేయడం లేదు. పీహెచ్‌‌సీల్లో ఉన్న టెస్టింగ్ సెంటర్లకు రోజుకు 50–100 మధ్య మాత్రమే కిట్లు వస్తున్నాయని అక్కడి సిబ్బందే చెబుతున్నారు. ఎక్కడ చూసినా 30 శాతానికి మించి టెస్టులు జరగడం లేదు. వందల సంఖ్యలో వస్తున్న జనం నిరాశతో వెనక్కి వెళ్లి తర్వాతి రోజు రావాల్సి వస్తోంది. ఒక్కొక్కరు రెండో రోజు వచ్చినా టెస్టు చేయించుకోలేకపోతున్నారు. దీంతో కొంత మంది టెస్టు సెంటర్ సిబ్బందిపై అసహనం వ్యక్తం చేస్తుండడంతో కొన్ని చోట్ల టోకెన్ సిస్టమ్ అమలు చేస్తున్నారు. అయితే ఉదయం 8 గంటలలోపే ఆ రోజుకు సరిపడా టోకెన్లు అయిపోతుండటంతో ఆ తర్వాత వచ్చినోళ్లంతా వెనక్కి వెళ్లిపోతున్నారు. అయితే టోకెన్లు ఇచ్చేటప్పుడు గానీ, టెస్టుల కోసం క్యూలో నిలబడ్డప్పుడు గానీ సోషల్ డిస్టెన్స్ పాటించేలా చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో ఫెయిల్ అవుతోంది.

ఒకటి, రెండు గంటలే టెస్టులు
చాలా టెస్టు సెంటర్లలో కిట్ల కొరత వల్ల ఉదయం 11 గంటలకు స్టార్ట్ చేసి గంటా రెండు గంటల్లోనే టెస్టులు ముగించేస్తున్నారు. హైదరాబాద్‌‌లోని కూకట్‌‌పల్లి, నార్సింగి, వెంకటగిరి పీహెచ్‌‌సీల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. వనస్థలిపురం ఏరియా హాస్పిటల్లో యాంటిజెన్​కిట్ల కొరత కారణంగా అందరికీ ఆర్టీపీసీఆర్​టెస్టులు చేస్తున్నారు. అయితే రోజుకు వంద మంది శాంపిల్స్ తీసుకుని మిగతా వాళ్లకు టోకెన్లు ఇచ్చి పంపుతున్నారు. ఇలా గురువారమే శనివారం వరకూ టోకెన్లు ఇచ్చేశారు. కొన్నిచోట్ల వారంలో రెండ్రోజుల పాటు కిట్లు లేక టెస్టు సెంటర్లు మూసేయాల్సి వస్తోంది.

ప్రైవేట్​ల్యాబ్‌‌లకు తాకిడి
సర్కార్​ సెంటర్లకు ఎంత తిరిగినా టెస్టులు చేయించుకోవడం కష్టమవుతోందని, కరోనా అనుమానితులు చాలా మంది ప్రైవేట్ ల్యాబ్‌‌లకు వెళ్తున్నారు. దీంతో కొద్ది రోజులుగా ప్రైవేట్ టెస్టు సెంటర్లకు జనం తాకిడి భారీగా పెరిగింది. కొన్ని సెంటర్లలో మూడ్రోజుల వరకూ వెయిట్ చేయాల్సి వస్తోంది. పైగా సర్కారులో ఆర్టీపీసీఆర్ చేయకపోవడంతో, అదే కావాలనుకునేవారూ ప్రైవేట్ వైపు చూస్తున్నారు. మొత్తంగా ఇటు ప్రభుత్వ, ప్రైవేటు టెస్టు సెంటర్లలో జరుగుతున్న టెస్టుల్లో 40 శాతం వరకూ పాజిటివ్ వస్తున్నట్లు తెలుస్తోంది.

ఎక్కువ టెస్టులు చేస్తున్నం
ఎక్కువ టెస్టులు చేస్తుండటంతోనే కిట్ల కొరత ఏర్పడుతోంది. టార్గెట్​ కంటే ఎక్కువగా  టెస్టులు చేస్తున్నం. సింప్టమ్స్‌‌ ఉన్నోళ్లు మాత్రమే టెస్టుకు వస్తే కొరత ఉండదు. వ్యాక్సినేషన్​ కొనసాగుతుండటంతోనే సిబ్బంది కొరత ఏర్పడుతోంది. అయినప్పటికీ టెస్టులు, వ్యాక్సినేషన్​ స్పీడ్​ గా చేస్తున్నం. 
- డాక్టర్​ స్వరాజ్యలక్ష్మి, డీఎంహెచ్‌‌వో, రంగారెడ్డి జిల్లా

రెండ్రోజులకు టోకెన్
టెస్టు కోసం వస్తే రెండు రోజుల తర్వాత రావాలని చెప్పి టోకెన్ ఇచ్చారు. ఇక్కడ ఆర్టీపీసీఆర్ కిట్లే ఉన్నయట. టెస్టు కోసం రెండ్రోజులు, ఆ తర్వాత రిపోర్ట్ కోసం రెండ్రోజులు చూడాలి. అంతలో సింప్టమ్స్ పెరిగితే ఎట్ల అని భయమేస్తోంది.
- ఎం.వేణు, వనస్థలిపురం