దేశంలో ఆక్సిజన్ ​అందక ఎవరూ చనిపోలేదట..

దేశంలో ఆక్సిజన్ ​అందక ఎవరూ చనిపోలేదట..

న్యూఢిల్లీ: దేశంలో ఆక్సిజన్​ కొరతతో ఎవరూ చనిపోలేదని, ఒకే ఒక్క అనుమానిత కేసు మాత్రం నమోదైందని కేంద్ర ప్రభుత్వం మంగళవారం వెల్లడించింది. ఆరోగ్య శాఖ జాయింట్​ సెక్రెటరీ లవ్​ అగర్వాల్ ఈ వివరాలను మీడియాకు తెలిపారు. కరోనా సెకండ్​ వేవ్​ పీక్​ టైమ్​లో ఆక్సిజన్​ కొరత ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ కొరత వల్ల కరోనా బాధితులు ఎవరూ చనిపోలేదని పార్లమెంట్​లో కేంద్రం పేర్కొంది. దీనిపై ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. సమయానికి ఆక్సిజన్​ అందక దేశంలో చాలామంది కరోనా బాధితులు చనిపోతే.. ఎవరూ చనిపోలేదని ఎలా ప్రకటిస్తారని విమర్శలు గుప్పించాయి. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి వచ్చిన రిపోర్టుల ఆధారంగానే ఈ వివరాలు వెల్లడించినట్లు ప్రభుత్వం తెలిపింది. అయితే, ఇది కాస్తా వివాదం కావడంతో కేంద్ర ప్రభుత్వం మరోసారి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను సంప్రదించింది. ఆక్సిజన్​ కొరత వల్ల ప్రాణాలు కోల్పోయిన కరోనా బాధితుల వివరాలివ్వాలని కోరింది. ఆక్సిజన్​ కొరత వల్ల తమ దగ్గర ఓ బాధితుడు చనిపోయినట్లు ఒకే ఒక్క రాష్ట్రం మాత్రమే అనుమానం వ్యక్తం చేసిందని అగర్వాల్ చెప్పారు. ఇలాంటి కేసులు తమ దగ్గర నమోదైనట్లు మిగతా రాష్ట్రాలు కానీ, కేంద్ర పాలిత ప్రాంతాలు కానీ ఎలాంటి రిపోర్టు ఇవ్వలేదని లవ్​ అగర్వాల్​ వివరించారు.

13 రాష్ట్రాలు, యూటీల నుంచి రిప్లై..

కేంద్ర ప్రభుత్వ సూచనకు 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు స్పందించాయని లవ్​ అగర్వాల్  చెప్పారు. ఒడిశా, అరుణాచల్​ ప్రదేశ్, ఉత్తరాఖండ్, నాగాలాండ్, అస్సాం, జమ్మూ కాశ్మీర్, లడఖ్, సిక్కిం, త్రిపుర, జార్ఖండ్, హిమాచల్​ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, పంజాబ్. ఇవి పంపిన రిపోర్టులలో ఒక్క పంజాబ్​ మాత్రం తమ దగ్గర నాలుగు అనుమానిత మరణాలు చోటుచేసుకున్నట్లు తెలిపిందని సమాచారం.

ఏప్రిల్​ మేలో తీవ్ర కొరత..

ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో దేశంలో డిమాండ్​ విపరీతంగా పెరగడంతో మెడికల్ ఆక్సిజన్​కు కొరత ఏర్పడింది. ఓవైపు కరోనా సెకండ్​ వేవ్​ పీక్ కు వెళ్లడంతో కేసులు పెద్ద సంఖ్యలో నమోదయ్యాయి. బాధితుల్లో ఎక్కువ మంది ఆక్సిజన్​ అందక బాధపడ్డారు. అందరికీ సరిపడా ఆక్సిజన్​ అందించలేక ఆస్పత్రుల సిబ్బంది, డాక్టర్లు సతమతమయ్యారు. ఒక్క గోవాలోనే ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఆస్పత్రిలో 80 మంది కరోనా పేషెంట్లు ఆక్సిజన్​ కొరత వల్ల చనిపోయారు. ఆంధ్రప్రదేశ్​లోని తిరుపతి పట్టణంలోని ఓ ఆస్పత్రిలో ఐసీయూలో ఉన్న 11 మంది మరణానికీ ఆక్సిజన్​ కొరతే కారణం.. హైదరాబాద్​లోని ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో ఇదే కారణంతో ఏడుగురు బాధితులు చనిపోయారు.

ఐదు రాష్ట్రాల్లో ఆర్ వాల్యూ ఎక్కువ.. 

దేశవ్యాప్తంగా 9 రాష్ట్రాల్లోని 37 జిల్లాల్లో రెండు వారాలుగా కరోనా డైలీ కేసులు పెరుగుతున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. వీటిలో కేరళలోని 11 జిల్లాలు, తమిళనాడులోని 7 జిల్లాలు ఉన్నాయని తెలిపింది. 11 రాష్ట్రాల్లోని 44 జిల్లాల్లో వీక్లీ పాజిటివిటీ రేటు 10 శాతానికి పైగా ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. గత వారంలో దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల్లో సగం కేరళలోనే రికార్డయ్యాయని చెప్పింది. ఐదు రాష్ట్రాల్లో ఆర్ వాల్యూ అధికంగా ఉందని.. హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ లలో ఆర్ వాల్యూ ఒక్కటి కంటే ఎక్కువగా ఉందని పేర్కొంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 86 డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు నమోదయ్యాయని, వీటిలో 34 మహారాష్ట్రలోనే ఉన్నాయని వివరించింది.