
ఇప్పుడంతా డిజిటల్ యుగం నడుస్తోంది. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) రాకతో దేశంలో పేమెంట్ సిస్టమ్ మొత్తం మారిపోయింది. పది రూపాయలైన.. పదివేల రూపాయలైన సరే క్షణాల్లోనే చెల్లింపులు జరిగిపోతున్నాయి. చిన్న దుకాణాల నుంచి మెట్రో నగరాల్లోని మాల్స్ వరకు అంతా యూపీఐ సేవలను వాడుతున్నారు. ఇంతలా డిజిటల్ చెల్లింపులకు ప్రజాదరణ పెరుగుతున్నప్పటికీ చాలా మంది ఆటో డ్రైవర్లు ఇప్పటికీ యూపీఐ సేవలకు దూరంగానే ఉంటారు.
ఇటీవల చెన్నైకి చెందిన సువేత గుణశేఖరన్ అనే మహిళ ఆటో బుక్ చేసుకుంది. ఆమె ఆటోలో సగం దూరం వెళ్లాక షాక్ తగిలింది. ఎందుకంటే ఆ ఆటోలో గూగుల్ పే అందుబాటులో లేదు. ఏటీఎం విత్ డ్రా కోసం స్టాప్ దగ్గర ఆపను అని ఓ బోర్టు రాసి ఉంది. దీనిని ఫోటో తీసిన ఆమె సోషల్ మీడియాలో షేర్ చేయగా క్షణాల్లో వైరల్ గా మారింది. ఈ వైరల్ ట్వీట్ ను 1.95 లక్షల మంది వీక్షించారు. అయితే ఆ మహిళ చివరకు డబ్బులు ఎలా చెల్లించిందో చెప్పకపోవడం గమనార్హం.
ఈ వైరల్ ట్వీట్ పై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. డిజిటల్ చెల్లింపులను అంగీకరించని అటువంటి వాహనాల్లోకి ప్రయాణించడం ఒక పీడకల అని ఓ నెటిజన్ రాసుకొచ్చాడు. ఆటో డ్రైవర్లకు పన్నులు కట్టడం ఇష్టం ఉండదని, చేతిలో డబ్బు రావడానికి వారు ఇష్టపడతారని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. దేశం ఎదుగుతున్న కొద్దీ ఇలాంటి వారు కూడా మారాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడ్డారు.