సీఎం సీటు ఖాళీ లేదు.. ఐదేళ్లు నేనే కూర్చుంటా: ముఖ్యమంత్రి మార్పుపై సిద్ధరామయ్య క్లారిటీ

సీఎం సీటు ఖాళీ లేదు.. ఐదేళ్లు నేనే కూర్చుంటా: ముఖ్యమంత్రి మార్పుపై సిద్ధరామయ్య క్లారిటీ

బెంగుళూర్: కర్నాటకలో నాయకత్వ మార్పు జరగబోతుందని.. సీఎం సిద్ధరామయ్య స్థానంలో ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సీఎం పగ్గాలు చేపడతారని గత కొన్ని రోజులుగా కన్నడ రాజకీయాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. నాయకత్వ మార్పు లేదని కాంగ్రెస్ హైకమాండ్ క్లారిటీ ఇచ్చిన ఊహాగానాలు మాత్రం ఆగడం లేదు. ఈ క్రమంలో సీఎం మార్పుపై సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. 

గురువారం (జూలై 10) కర్నాటకలో సీఎం సీటు ఖాళీ లేదని.. ఐదేళ్లు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని తేల్చి చెప్పారు. సీఎంగా ఐదేళ్ల పదవి కాలాన్ని పూర్తి చేస్తానని నాయకత్వ మార్పు పుకార్లకు చెక్ పెట్టారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలు నా నాయకత్వంలోనే జరుగుతాయని స్పష్టం చేశారు సీఎం సిద్ధరామయ్య. జాతీయ రాజకీయాలపై తనకు ఆసక్తి లేదని.. తాను ఎప్పటికీ కర్ణాటకలోనే ఉంటానని మనసులో మాట చెప్పారు. ఇదే సమయంలో క్రమశిక్షణ కలిగిన నేతగా పార్టీ హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

ALSO READ | ఈసీకి అధికారం ఉంది.. బీహార్ ఓటర్ల జాబితా సవరణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్

కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ ఐక్యంగా ఉందని.. ఎలాంటి డోకా లేకుండా ప్రభుత్వం ఐదు సంవత్సరాలు అధికారంలో ఉంటుందన్నారు. ముఖ్యమంత్రిని మారుస్తారని ప్రతిపక్ష బీజేపీ, జేడీఎస్ అంటున్నాయని జర్నలిస్టులు ప్రశ్నించగా.. వాళ్లు ఏమైనా మా హైకమాండా..? సీఎం మార్పు గురించి వాళ్లకు ఎలా తెలుస్తుంది..? అని మీడియాను ఎదురు ప్రశ్నించారు సిద్ధరామయ్య. సీఎం మార్పు అంటూ ప్రతిపక్షాలు చెబితే మీరు రాస్తారా..?  మీరు ధృవీకరించుకో వద్దా అని నిలదీశారు. నాయకత్వ మార్పు అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఫైర్ అయ్యారు. 

కాగా, ఈ ఏడాది చివర్లో ముఖ్యమంత్రి మార్పు గురించి కన్నడ పాలిటిక్స్ తో పాటు అధికార కాంగ్రెస్ పార్టీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. సీఎం సిద్ధరామయ్య,  డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్య అధికార భాగస్వామ్య ఒప్పందంలో భాగంగా నాయకత్వ మార్పు ఉంటుందంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కన్నడ నాయకత్వ మార్పు ఉండదంటూ పార్టీ హైకమాండ్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది. అయినప్పటికీ పుకార్లు ఆగకపోవడంతో తాజాగా సీఎం సిద్ధరామయ్య క్లారిటీ ఇచ్చారు.