- నాగర్ కర్నూల్ జిల్లా నోడల్ ఆఫీసర్ నీతూ ప్రసాద్
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: దేశంలోనే అభివృద్ధిలో జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలని నాగర్ కర్నూల్ జిల్లా నోడల్ అధికారి నీతూ కుమారి ప్రసాద్ తెలిపారు. బుధవారం నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాలులో కలెక్టర్ బధావత్ సంతోష్ తో కలిసి ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన అమలుపై సమీక్ష నిర్వహించారు.
నాగర్ కర్నూల్ జిల్లాలోని వ్యవసాయ, పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమ, ఉద్యాన, సాగునీటి, బ్యాంకింగ్, మార్కెటింగ్ తదితర శాఖల అధికారులతో శాఖ వారిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాల అమలు వివరాలను ఆమె అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 100 జిల్లాలను ఎంపిక చేసి, ప్రతి ఏడాది రూ.24 వేల కోట్ల నిధులను ఆరేండ్ల పాటు కేటాయిస్తామని తెలిపారు.
పీఎం ధన్ ధాన్య కృషి యోజన కింద 11 మంత్రిత్వశాఖల పరిధిలోని 36 పథకాలను అమలు చేయనున్నట్లు చెప్పారు. ఈ పథకం వ్యవసాయ రంగ అభివృద్ధికి దిశానిర్దేశం చేస్తుందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం ముఖ్యమని తెలిపారు. పీఎం ధన్ ధాన్య కృషి యోజన సద్వినియోగం చేసుకుంటే నాగర్ కర్నూల్ జిల్లా దేశంలో వ్యవసాయ అనుబంధ ఉత్పాదక రంగాల్లో అగ్రగామిగా నిలుస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ అమరేందర్, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
