ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

మెదక్, వెలుగు: సంచార జాతుల సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత మంత్రిత్వ శాఖ దక్షిణ భారత అభివృద్ధి, సంక్షేమ బోర్డు సభ్యులు తుర్క నరసింహ అన్నారు. జిల్లాలో డీనోటి ఫైడ్, సంచార జాతుల సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను అధ్యయనం చేసేందుకు  వచ్చిన ఆయన గురువారం కలెక్టరేట్ లో సంక్షేమ, అటవీ, మైనింగ్, విద్యాశాఖ అధికారులు, టీచర్లతో  నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం సంచార జాతుల అభ్యున్నతికి పలు సంక్షేమ కార్యక్రమాలు అమలుపరుస్తూ వాటి పర్యవేక్షణకు బోర్డు ఏర్పాటు చేసిందన్నారు. జిల్లాలో ఏయే ప్రాంతాల్లో సంచార జాతుల వారు నివసిస్తున్నారో గుర్తించి వారికి అన్ని రకాల సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు. గ్రామం వారీగా డీ, సీ క్యాటగిరీలలో ఉన్న జనాభా వివరాల జాబితా అందించాలని బీసీ, ఎస్సీ అభివృద్ధి అధికారులకు సూచించారు. జిల్లాలో నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో నష్టపరిహారం చెల్లించినట్లయితే సమగ్ర నివేదికను అందించాలని  పోలీసు అధికారులను ఆదేశించారు. సమావేశంలో ఆర్డీవో సాయి రామ్, డీఎస్పీ సైదులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అధికారులు విజయలక్ష్మి, కేశూరం, జెంలా నాయక్, మైన్స్ ఏడీ జయరాజ్, డీఎఫ్ఓ రవి ప్రసాద్, డీఈఓ రమేశ్​కుమార్, డీఎస్​ఓ రాజి రెడ్డి పాల్గొన్నారు.

ఘనంగా పీఎంఆర్ బర్త్​డే

సంగారెడ్డి టౌన్, వెలుగు : తెలంగాణ ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు పులిమామిడి రాజు ముదిరాజ్  బర్త్​ డేను గురువారం ఘనంగా నిర్వహించారు. పట్టణ శివార్​లోని శ్రీలక్ష్మి గోదా సమేత విరాట్ వేంకటేశ్వర స్వామి ఆయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పీఎంఆర్ యువసేన ఆధ్వర్యంలో ఆసుపత్రిలో అన్నదాన కార్యక్రమం, అనాథ పిల్లలకు స్కూల్​ యూనిఫామ్స్, షూ పంపిణీ చేశారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ బండా ప్రకాశ్, తెలంగాణ హ్యాండ్లూమ్ కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్ తో కలిసి తెలంగాణ ముదిరాజ్ మహాసభ జిల్లా క్యాలెండర్​ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సంఘం బాధ్యులు పిట్టల రమేశ్, సత్యం, నగేశ్, తెనుగు గంగాధర్, రమేశ్, అనిల్ పాల్గొన్నారు.

వేర్వేరు చోట్ల ముగ్గురు ఆత్మహత్య

మెదక్ (మనోహరాబాద్), వెలుగు :  మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని ఓ వ్యక్తి సూసైడ్ చేసుకున్నాడు. ఈ ఘటన మెదక్​ జిల్లా మనోహరాబాద్​ మండలం రంగాయిపల్లి గ్రామంలో గురువారం జరిగింది. ఎస్సై  రాజు గౌడ్ తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన దానప్ప కుమార్ ( 32) బుధవారం మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వాలని తన భార్య పార్వతితో గొడవ పెట్టుకున్నాడు. దీంతో ఆమె తన తల్లిగారింటికి వెళ్లి గురువారం తిరిగి వచ్చింది. అప్పటికే ఇంట్లోని ఫ్యాన్​కు కుమార్ ఉరివేసుకుని చనిపోయాడు.  మృతుడి భార్య పార్వతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై  తెలిపారు.

అప్పుల బాధతో..

మెదక్ (చిలప్ చెడ్), వెలుగు:  అప్పుల బాధతో ఓ వ్యక్తి సూసైడ్ చేసుకున్నాడు. ఈ ఘటన చిలప్ చెడ్ మండలం జగ్గంపేటలో జరిగింది. ఏఎస్సై మిస్బావోద్దీన్​ తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన బొగ్గుల బాలేశ్​అలియాస్​ బాలయ్య (45)  కుటుంబ పోషణకు అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక గురువారం గ్రామ శివారులోని చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి కుమారుడు శ్రీధర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్సై తెలిపారు.

తల్లి మందలించిందని.. 

పటాన్​చెరు(గుమ్మడిదల) వెలుగు : తల్లి మందలించిందని తాగిన మైకంలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన గుమ్మడిదల పోలీస్​ స్టేషన్​ పరిధిలో గురువారం జరిగింది. పోలీసులు తెలిపిన ప్రకారం.. మండల పరిధిలోని నల్లవల్లి గ్రామానికి చెందిన  మన్నె మధు(20) కొంత కాలంగా మద్యానికి బానిసయ్యాడు. కాగా బుధవారం రాత్రి అతడు మద్యం తాగి ఇంటికి రాగా తల్లి  మన్నె భాషమ్మ మందలించింది. దీంతో అతడు వెంటనే పొలం వద్దకు వెళ్లి పురుగుల మందు తాగడు. దీన్ని గమనించిన స్థానికులు, తల్లి అతడిని వెంటనే నర్సాపూర్​ ప్రభుత్వాసుపత్రికి అక్కడి నుంచి సంగారెడ్డి  ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అతడు గురువారం చనిపోయాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని  దర్యాప్తు 
చేస్తున్నారు. 

ప్లాస్టిక్ నియంత్రణకు ప్రత్యేక డ్రైవ్ 

సిద్దిపేట రూరల్, వెలుగు : జనవరి 1 నుంచి 120 మైక్రాన్ల కన్నా తక్కువ మందం ఉండే ప్లాస్టిక్ ను నిషేధించామని, ప్లాస్టిక్ నియంత్రణకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నామని సిద్దిపేట అడిషనల్ కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ ఆఫీస్ లో ఆయన అధ్యక్షతన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో డిస్టిక్ లెవెల్ బయో మెడికల్ వేస్ట్ మేనేజ్​మెంట్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 41 ప్రభుత్వ 230 ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయని, ఆస్పత్రుల నుంచి వెలువడే వ్యర్థ పదార్థాలు చాలా హానికరమైనవని, వాటిని నాలుగు విభాగాలుగా చేసి చిన్నకోడూరు వద్ద జియో వేస్టేజీ శుద్ధీకరణ ప్లాంటుకు  తరలించాలని ఆదేశించారు. షాపింగ్ మాల్స్, షాప్స్, రెస్టారెంట్లు, మటన్, చికెన్ సెంటర్లు, హోటళ్ల వద్ద ప్లాస్టిక్ తో కలిగే అనర్థాలు, నిషేధిత ప్లాస్టిక్ ను వాడితే విధించే జరిమానాపై వాల్​ పోస్టర్లను అతికించాలని సూచించారు.  రోడ్డు సైడ్ చిరు వ్యాపారులకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో తెలంగాణ స్టేట్  పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అసిస్టెంట్ ఎన్విరాన్​మెంట్​ సైంటిస్ట్ రవీందర్, డీఆర్డీవో  గోపాలరావు, డీపీవో దేవకీదేవి, డీఎం హెచ్ వో డాక్టర్ కాశీనాథ్, డీసీహెచ్ఎస్ సాయికిరణ్ పాల్గొన్నారు.

పీఎం కిసాన్​ లబ్ధిదారులు ఈకేవైసీ చేసుకోవాలి

మెదక్,  వెలుగు : పీఎం కిసాన్ లబ్ధిదారులందరూ తప్పనిసరి ఈ కేవైసీ చేసుకోవాలని మెదక్​ అడిషనల్​ కలెక్టర్ రమేశ్ ​సూచించారు. గురువారం తన చాంబర్ లో వ్యవసాయాధికారులతో  నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ  జిల్లా వ్యాప్తంగా 1,36,109 రైతులు పీఎం కిసాన్ లబ్ధిదారులుగా గుర్తించామన్నారు. ఇందులో 39,018 మంది రైతులు  ఇంకా ఈ కేవైసీ చేయించుకోవాల్సి ఉందన్నారు. 13వ విడత పీఎం కిసాన్ నిధులు తమ బ్యాంకు అకౌంట్​లో  జమ కావాలంటే తప్పనిసరిగా ఈ కేవైసీ చేయించుకోవాలన్నారు. వ్యవసాయ శాఖ అధికారుల సహాయంతో కానీ, మీసేవ, కామన్ సర్వీస్ సెంటర్, పోస్ట్ ఆఫీస్ లలో గానీ పీఎం కిసాన్ కు తమ ఆధార్, ఫోన్ నంబర్ ను అనుసంధానం చేసుకోవాలని రైతులకు సూచించారు. వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులకు ఈకేవైసీ  ప్రక్రియ విధానంపై  అవగాహన  కల్పించాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఏఓ ఆశాకుమారి, ఏడీఏ రాజ్ నారాయణ,  ఏఓ హర్ష, డీఎస్ఓ శ్రీనివాస్  పాల్గొన్నారు.

ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం కృషి 

సంగారెడ్డి (హత్నూర), వెలుగు : ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తోందని ఎమ్మెల్యే మదన్ రెడ్డి అన్నారు. గురువారం సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం నాగుల్ దేవులపల్లిలో సీసీ రోడ్డు పనులతోపాటు హత్నూర,  ముచ్చర్ల, గుండ్ల మాచనూర్, తురకల ఖానాపూర్ గ్రామాలకు కేటాయించిన వైకుంఠ రథాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ముచ్చర్ల గ్రామ శివారులోని వక్ఫ్ బోర్డు పరిధిలోని మజీద్ ఇ పత్తే మహమ్మద్ దర్గా వద్ద ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు. ఆయన వెంట ఎంపీపీ వావిలాల నర్సింలు, జడ్పీటీసీ ఆంజనేయులు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ దుర్గారెడ్డి, రైతుబంధు సమన్వయ కమిటీ కోఆర్డినేటర్ బుచ్చిరెడ్డి ఉన్నారు.

ఆస్తి తగాదాలతో అన్నను చంపిండు..

సంగారెడ్డి (హత్నూర), వెలుగు :  ఆస్తి తగదాలతో అన్నను తమ్ముడు చంపేశాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం రెడ్డి ఖానాపూర్ గ్రామంలో గురువారం జరిగింది. ఎస్సై లక్ష్మారెడ్డి  తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన నీరుడి పోచయ్య(55), తమ్ముడు నీరుడి శ్రీనివాస్ మధ్య గురువారం కరెంట్​ విషయమై గొడవ వచ్చింది. అంతకు ముందే వీరి మధ్య భూతగాదాలు ఉన్నాయి. ఈ క్రమంలో గురువారం జరిగిన గొడవలో అన్నను తమ్ముడు బలంగా కొట్టడంతో అతడు అక్కడికక్కడే చనిపోయాడు. అనంతరం శ్రీనివాస్ పోలీస్ స్టేషన్​లో లొంగిపోయాడు. ఘటనా స్థలాన్ని సీఐ వేణు పరిశీలించారు. మృతుడి భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.