వరంగల్​లో ప్రధాన పార్టీలకు.. నాన్‍ లోకల్‍ టెన్షన్‍

వరంగల్​లో ప్రధాన పార్టీలకు.. నాన్‍ లోకల్‍ టెన్షన్‍
  •     నియోజకవర్గ ఓటర్లలో నాన్‍ లోకల్‍ ఫీలింగ్  
  •     వరంగల్(ఎస్సీ) ఎంపీ స్థానానికి అభ్యర్థులు కరువు 
  •     గత ఎన్నికల్లో ప్రభావం చూపని బయటి అభ్యర్థులు
  •     నాన్‍ లోకల్​ అభ్యర్థుల ఎంపికపై  పార్టీల డైలమా

వరంగల్‍, వెలుగు : పార్లమెంట్‍ ఎన్నికల నేపథ్యంలో మూడు ప్రధాన  పార్టీలకు ఎస్సీ రిజర్వేషన్‍ కలిగిన వరంగల్‍ ఎంపీ అభ్యర్థుల ఎంపిక  సవాలుగా మారింది.      గడిచిన రెండు ఎన్నికల్లో నేషనల్‍ పార్టీలు తమ అభ్యర్థిగా ఇతర జిల్లాల వారికి అవకాశం ఇవ్వగా.. జనాలు తిరస్కరించారు. అదే ఇప్పుడు ప్రధాన పార్టీలను కలవరపెడుతోంది.

వరంగల్​లో నాన్‍ లోకల్స్​ ఓటమి 

వరంగల్‍ ఎస్సీ పార్లమెంట్‍ నియోజకవర్గం వరంగల్‍ తూర్పు, వరంగల్‍ పశ్చిమ, పరకాల, భూపాలపల్లి, వర్ధన్నపేట, స్టేషన్‍ ఘన్‍పూర్‍, పాలకుర్తి అసెంబ్లీ పరిధిలో ఉంది. కాగా, ఎంపీ ఎన్నికల్లో జిల్లాతో సంబంధంలేనివారు, స్థానికేతరులను ఓటర్లు రీసివ్‍ చేసుకోలేదు. గడిచిన 35 ఏండ్లలో ఇక్కడినుంచి ఎంపీలుగా గెలిచిన రామసహయం సురేందర్‍ రెడ్డి, అజ్మీరా చందులాల్‍, బోడకుంటి వెంకటేశ్వర్లు, రవీంద్ర నాయక్‍, సిరిసిల్ల రాజయ్య, కడియం శ్రీహరి మొదలు ప్రస్తుత సిట్టింగ్‍ ఎంపీ పసునూరి దయాకర్‍ వరకు ఉమ్మడి జిల్లాకు చెందినవారే ఎంపీగా విజయం సాధించారు.

ఒక్కోసారి ఒక్కపార్టీని గెలిపించాల్సి వచ్చినా స్థానికులకే అవకాశం ఇచ్చారు. 2014 ఎంపీ జనరల్‍ జరిగినా ఆ వెంటనే 2015లో బై ఎలక్షన్‍ జరిగింది. బీఆర్‍ఎస్‍ తరఫున లోకల్‍ అభ్యర్థిగా పసునూరి దయాకర్‍ గెలిస్తే.. అతనిపై కాంగ్రెస్‍ అభ్యర్థిగా పార్టీలో సీనియర్‍ నేత సర్వే సత్యనారాయణ, బీజేపీ నుంచి అమెరికా పారిశ్రామికవేత్త పగిడిపాటి దేవయ్య పోటీ చేశారు. ఎన్నికల్లో విజయం సాధించిన దయాకర్‍ 6 లక్షల 15 వేలకు పైగా ఓట్లు సాధిస్తే.. సత్యనారాయణ, దేవయ్య  అందులో పావు వంతు ఓట్లు కూడా సాధించలేకపోయారు. సర్వేకు లక్షా 56 వేలు, దేవయ్యకు లక్షా 29 వేల ఓట్లు మాత్రమే వచ్చాయి.

2019 ఎంపీ ఎలక్షన్లో బీఆర్‍ఎస్‍ మరోసారి పసునూరికే అవకాశం ఇవ్వగా.. కాంగ్రెస్‍ నాన్‍ లోకల్‍ కాకుండా స్థానికుడైన దొమ్మాటి సాంబయ్యకు టిక్కెట్‍ ఇచ్చింది. బీజేపీ ఈసారి దేవయ్యకు కాకుండా మరో నాన్‍ లోకల్‍ చింతా సాంబమూర్తిని నిలబెట్టింది. కాగా, పసునూరి మరోసారి 6 లక్షల 12 వేల ఓట్లతో గెలవగా.. సాంబయ్యకు చెప్పుకోదగ్గ  2 లక్షల 62 వేల ఓట్లు వచ్చాయి. దేశంలో మోడీ హవా నడుస్తున్నప్పటికీ.. ఇవేవీ పట్టించుకోకుండా నాన్‍ లోకల్‍ అభ్యర్థులుగా  నిలిపిన సాంబమూర్తి కేవలం 83 వేల ఓట్లకే పరిమితమయ్యారు.

అభ్యర్థి  ఎంపికే అసలు సవాల్‍ 

కేంద్రంలో, రాష్ట్రంలో చివరకు అధికారంలో ఉన్న పార్టీ కూడా వరంగల్‍ ఎంపీ స్థానంలో నాన్‍ లోకల్‍ నిలిపితే ఓటమి ఎదురవుతున్న క్రమంలో..ఈసారి అభ్యర్థుల ఎంపిక ప్రధాన పార్టీలకు సవాల్‍ అయింది బీజేపీ రాష్ట్రంలో 9 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినా..వరంగల్‍ ఎంపీ స్థానాన్ని పెండింగ్‍ పెట్టింది.  లోకల్‍గా బలమైన క్యాండియేట్‍ లేడనే భావనలో ఉన్న పార్టీ పెద్దలు గత కొన్ని రోజులుగా మాజీ ఐపీఎస్‍ ఆఫీసర్‍ కృష్ణప్రసాద్‍ పేరును తెరమీదకు తెచ్చారు. అదే సమయంలో గత నాన్‍ లోకల్‍ ఓటములు గుర్తుకొచ్చి డైలమాలో పడింది.

ఇందులో భాగంగానే స్థానికుడైన బీఆర్‍ఎస్‍ మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్‍ను పార్టీలోకి తీసుకుని పోటీలో నిలిపేలా చూస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.  కాంగ్రెస్‍ పరిస్థితి అలానే ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్‍ అధికారంలో ఉన్నందున వరంగల్‍ స్థానం గెలవాలని పట్టుదలతో ఉన్నారు. నిన్నమొన్నటి వరకు అద్దంకి దయాకర్‍ వంటి బయటి నేతల పేర్లు ఇక్కడినుంచి వినిపించినా..నాన్‍ లోకల్‍ భయం వెంటాడినట్లు తెలుస్తోంది. మరోవైపు గతంలో ఇదే స్థానం నుంచి పోటీచేసిన సిరిసిల్ల రాజయ్య, దొమ్మాటి సాంబయ్యలు అందుబాటులో ఉన్నా ఎంపిక విషయంలో ఇంకా క్లారిటీ తీసుకోలేపోయారు.

బీఆర్‍ఎస్‍ పార్టీకి సిట్టింగ్‍ ఎంపీ పసునూరి దయాకర్‍ ఉన్నా..పార్టీకి గతంలో ఉన్న బలం లేకపోవడం.. దయాకర్‍కు సొంతంగా ఇమేజ్‍ లేకపోవడం మైనస్‍ అయింది. ఈ నేపథ్యంలో వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి పేరు మొదటి వరుసలో వినపడ్డా..అతను బీజేపీలో చేరుతాడనే సమాచారంతో గులాబీ పెద్దలు తల పట్టుకుంటున్నారు. ఇప్పటికిప్పుడు మరో అభ్యర్థిని వెతకాల్సిన అవసరమొచ్చింది.