Sri Rama Navami : గుండాల మండలంలో..నవమి నాడు..నాన్‌‌‌‌‌‌‌‌వెజ్‌‌‌‌ దావత్!​

Sri Rama Navami : గుండాల మండలంలో..నవమి నాడు..నాన్‌‌‌‌‌‌‌‌వెజ్‌‌‌‌ దావత్!​

శ్రీరామనవమి నాడు నాన్‌‌‌‌వెజ్‌‌‌‌ జోలికే పోరు. ఇంకా కొన్ని ఊళ్లలో అయితే.. శ్రీరామ నవమి రోజు చికెన్​, మటన్‌‌‌‌ షాపులన్నీ మూసేస్తారు. కానీ.. ఇక్కడ శ్రీరామ నవమి వచ్చిందంటే ప్రతి ఇంట్లో ముక్క ఉడకాల్సిందే. నాన్‌‌‌‌వెజ్‌‌‌‌తో దావత్‌‌‌‌ చేసుకోవాల్సిందే! అలాగని ఈ ఊళ్లో రాముడిని కొలిచేవాళ్లు లేరనుకుంటే పొరపాటు. ఊరంతా రామ భక్తులే. ఇక్కడి రామాలయంలో రామనవమికి ఐదు రోజుల పాటు అంగ రంగ వైభవంగా ఉత్సవాలు కూడా చేస్తారు. 

యాదాద్రి జిల్లా గుండాల మండలం సీతారాంపురం గ్రామంలో శ్రీరామనవమి రోజు మాంసాహార​ వంటకాలతో దావత్​ చేసుకుంటారు. అంతేకాదు.. ఇక్కడి రామాలయంలో ఏకంగా ఐదురోజుల పాటు సీతారాముల పెండ్లి, ఉత్సవాలు జరుగుతాయి. నవమికి రెండు రోజుల ముందు మొదలై తర్వాత రెండు రోజుల పాటు వేడుకలు జరుగుతాయి. కల్యాణం రోజున గరుడ ముద్ద (అన్నం ముద్దలు) ఎగరవేయడం ఇక్కడి ఆనవాయితీ. అలా ఎగరేసిన ముద్దలు అందుకుని తిన్నవాళ్లకు  శుభాలు కలుగుతాయని నమ్ముతారు.

మొదటి రోజు : శ్రీ విష్వక్సేన పూజ, పుణ్యహవచకము, రుత్విగ్వరణము, రక్షాబంధనము, అఖండ దీపారాధన, మత్సంగ్రహనము, అంకురార్పణము, అగ్ని ప్రతిష్ట హోమం, ఆరగింపు అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరిస్తారు. 
 

రెండో రోజు : ఆరాధన సేవకాలం, నిత్యహోమము, ప్రభోతిక, బలిహరణము, ధ్వజారోహణము, గరుడ ముద్ద, భేరి పూజ, దేవతాహ్వానం, ఆరగింపు అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తారు. 

మూడో రోజు : సీతారాముల కల్యాణం జరుగుతుంది. ఈ రోజు ఆరాధన సేవాకాలం, బలిహరణము, నిత్య హోమము నిర్వహించిన తర్వాత సీతమ్మ తరఫున కొందరు, శ్రీరాముడి తరఫున మరికొందరు ఎదుర్కోళ్లలో పాల్గొంటారు. 
మధ్యాహ్నం తర్వాత  సీతారాముల కల్యాణం జరుగుతుంది. అనంతరం హవనము, బలిహరణము, హనుమత్​ సేవా, సేవాకాలము నిర్వహణ అనంతరం తీర్థ ప్రసాదాలు పంచుతారు.

నాలుగో రోజు : ఆరాధన సేవాకాలం, నిత్యహోమము, గరుడ సేవ అనంతరం తీర్థ ప్రసాదాలు ఇస్తారు. 

ఐదో రోజు : ఐదో రోజు ఆరాధన ప్రభోతిక, మహా పూర్ణాహుతి, చక్ర తీర్థ ప్రసాద వినియోగం, పుష్పయాగం, దేవతోధ్యాసన, సప్తాహరణములు, ధ్వజపథ అవరోహణము, ఆరగింపు ఉంటుంది. తీర్థ ప్రసాద వినియోగం అనంతరం మహాదాశీర్వచనముతో పెండ్లి వేడుకలు ముగుస్తాయి. 

యాటలు, కోళ్లు ‌‌‌...

నవమి రోజున పూజల తర్వాత మధ్యాహ్నం ఒంటిగంట వరకు సీతారాముల వారి పెండ్లి జరుగుతుంది. అప్పటివరకు భక్తితో పెండ్లి వేడుకలు చూసిన ప్రజలు ఇండ్లకు వెళ్లిపోతారు. ఆర్థిక స్థోమతను బట్టి ఇంట్లో మేకలు, కోళ్లు కోసుకుని దావత్ చేసుకుంటారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ ఉన్న ఈ నాన్‌‌‌‌వెజ్‌‌‌‌ ఆచారం కొన్ని వందల ఏండ్ల క్రితమే మొదలైంది. అందుకు కారణం ఈ గ్రామ పెద్దలే అని చెప్తుంటారు!

అప్పట్లో గ్రామాలకు పెద్దలుగా పెత్తందారులు, భూస్వాములే ఉండేవాళ్లు. వారి ఆధ్వర్యంలోనే సీతారాముల కల్యాణం జరిగేది. కల్యాణం చూడడానికి భూస్వాముల అల్లుళ్లు, కూతుళ్లు, బంధువులు వచ్చేవాళ్లు. అలా వచ్చినవాళ్లకు దావత్‌‌‌‌ ఇవ్వాలనే ఉద్దేశంతో సీతారాముల పెండ్లి అయిపోగానే యాటలను కోయించి వండి పెట్టేవాళ్లు. ఆ తర్వాత ఇదే ఆచారంగా మారిపోయింది. దాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. 

సంతాన..నమ్మకం

కాకతీయుల కాలంలోనే ఈ సీతారామచంద్రస్వామి ఆలయం కట్టినట్టు చెప్తుంటారు. ఈ ఆలయం ఉండడం వల్లే ఈ గ్రామానికి సీతారాంపురం అనే పేరు వచ్చింది. ఆలయంలో మండపం సహా మూడు గర్భగుడులు ఉన్నాయి. సీతారామ, లక్ష్మణ, ఆంజనేయ స్వామి విగ్రహాలతో పాటు సంతాన గోపాలస్వామి, ఆండాలమ్మ, గోదాదేవి, గరుత్మంతుడు కొలువై ఉన్నారు. ఉత్సవమూర్తుల విగ్రహాలను పంచలోహాలతో తయారు చేశారు. పిల్లలు లేనివాళ్లు తడి బట్టలతో ఆలయ ప్రదక్షిణ చేసి సంతాన గోపాలస్వామిని దర్శించుకుంటే సంతానం కలుగుతుందని ఇక్కడి ప్రజల నమ్మకం.

యాదాద్రి, వెలుగు

నాన్‌‌‌‌వెజ్​కు స్వస్తి!

సీతారాముల పెండ్లి రోజున నాన్‌‌‌‌వెజ్​తో విందులు చేసుకునే ఆచారానికి స్వస్తి చెప్పడానికి గ్రామ పెద్దలు కొందరు ప్రయత్నిస్తున్నారు. స్వామి పెండ్లి రోజున దావత్​ చేసుకోవడం వల్ల ఊరు పట్ల ఇతర ప్రాంతాల్లో సదభిప్రాయం ఉండదనే భావనతోనే ఈ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే.. వందల ఏండ్ల క్రితం మొదలైన ఆచారాన్ని ఆపేయడంపై వ్యతిరేకత వస్తోంది. దీంతో వాళ్ల ప్రయత్నాలు ఫలించడం లేదు.