జాక్వెలిన్పై నోరా ఫతేహీ పరువు నష్టం దావా .. ఎందుకంటే ?

జాక్వెలిన్పై నోరా ఫతేహీ పరువు నష్టం దావా .. ఎందుకంటే ?

ప్రముఖ హీరోయిన్ నోరా ఫతేహీ , మరో హీరోయిన్​ జాక్వెలిన్​ ఫెర్నాండేజ్​ తో పాటు 15 మీడియా సంస్థలపై పరువు నష్టం దావా వేశారు. మనీలాండరింగ్​ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కోర్టులో దాఖలు చేసిన లిఖితపూర్వక పిటిషన్ లో జాక్వెలిన్​ ఫెర్నెండేజ్​ ప్రస్తావించిన పలు అంశాలపై నోరా ఫతేహీ అభ్యంతరం వ్యక్తం చేశారు.  ‘‘నాతో పాటు నోరా ఫతేహీ వంటి ఎంతోమంది సెలబ్రిటీలు కూడా సుకేశ్​ చంద్రశేఖర్​ నుంచి గిఫ్టులు తీసుకున్నారు. అయితే నన్నొక దాన్నే ఈడీ ఎందుకు టార్గెట్​ చేస్తోంది ?”అనే అంశాన్ని పీఎంఎల్​ఏ కోర్టులో వేసిన పిటిషన్​ లో జాక్వెలిన్​ పేర్కొన్నారు. ఇందులో తన పేరును వాడినందుకే పరువు నష్టం దావా వేసినట్లు నోరా ఫతేహీ స్పష్టం చేశారు.

నోరా ఫతేహీకి బీఎండబ్ల్యు కారు

‘‘నేను, జాక్వెలిన్​ ఇద్దరం సినీరంగంలోనే పనిచేస్తున్నాం. ఇద్దరికీ ఒకే విధమైన ప్రయోజనాలు ఉంటాయి. ఇద్దరిదే ఒకే విధమైన నేపథ్యం. కాబట్టి సినీ రంగంలో నా కెరీర్​ కు విఘాతం కలిగించాలనే దురుద్దేశంతోనే జాక్వెలిన్​ ఇలాంటి ప్రయత్నాలు చేసి ఉండొచ్చు. సినీరంగంలో నాతో పోటీపడలేక ఇలా చేశారేమో” అని నోరా ఫతేహీ ఆరోపించారు. 2020 డిసెంబరులో నోరా ఫతేహీకి చంద్రశేఖర్​  బీఎండబ్ల్యు కారును గిఫ్టుగా ఇచ్చాడని, ఆ తర్వాత మరిన్ని విలువైన గిఫ్టులతో పాటు రూ.75 లక్షలు కూడా ఇచ్చారని ఈడీ తన చార్జిషీటులో అభియోగాలను దాఖలు చేసింది. 

ఇవాళ ఉదయం..

కాగా,  ఇవాళ ఉదయం బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టుకు హాజరయ్యారు. రూ. 200 కోట్ల మనీలాండరింగ్ కేసులో నిందితుడు సుకేశ్ చంద్రశేఖర్‌తో సంబంధం ఉన్న కేసులో ఆమెకు ముందుస్తు బెయిలు లభించింది. రూ. 50 వేల వ్యక్తిగత బాండ్, అంతే మొత్తానికి పూచీకత్తు సమర్పించడంతో న్యాయస్థానం ఆమెకు బెయిలు మంజూరు చేసింది. మధ్యంతర బెయిలు గడువు ముగియడంతో ఇవాళ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పటియాలా హౌస్ కోర్టుకు చేరుకున్నారు.

అంతకు ముందు ఈ కేసులో ఈడీ అధికారులు జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ను పలు విధాలుగా విచారించారు. సుఖేశ్ చంద్రశేఖర్ తనకు ఖరీదైన లగ్జరీ కార్లు, నగలతో పాటు లక్షల విలువైన గుస్సీ, షేనెల్ బ్యాగులు, దుస్తులు, బూట్లు ఇచ్చాడని చెప్పింది. తాను ఎక్కడకు వెళ్లాలన్నా ప్రైవేట్ జెట్ విమానాలు, విలాసవంతమైన హోటళ్లలో బస ఏర్పాటు చేసేవాడని ఈడీ అధికారుల ఎదుట అంగీకరించింది. 

జాక్వెలిన్ వద్ద కావాల్సినంత డబ్బు ఉందని.. కేవలం సరదాల కోసమే ఆమె కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని.. విదేశాలకు పారిపోయే అవకాశం ఉందని ఈడీ తరపున ప్రాసిక్యూషన్ వాదనలు వినిపించింది. కేసు విచారణ సమయంలో జాక్వెలిన్ ను ఎందుకు అరెస్టు చేయలేదని.. కేవలం లుక్ ఔట్ నోటీసులు మాత్రమే ఎందుకు జారీ చేశారని కోర్టు ప్రశ్నించింది. మరో నిందితుడు జైలులో ఉండగా.. జాక్వెలిన్ ను ఎందుకు బయటే వదిలేశారని.. నచ్చని వారిని అరెస్టు చేసి.. నచ్చిన వారిని వదిలేస్తున్నారా..? అని ఈడీని కోర్టు నిలదీసింది. 

గత ఆగస్టు 31న ఈడీ సప్లిమెంటరీ చార్జీషీటు దాఖలు చేసిందని, దీంతో ఆమెను కస్టడీలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని తెలిపింది. అయితే..ఈడీ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకున్న కోర్టు..తమ అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లరాదంటూ ఆదేశాలు జారీ చేసింది. నవంబర్ లో ఆమెకు బెయిల్ ఇచ్చిన కోర్టు..వాదనలను డిసెంబర్ 12కి వాయిదా వేసింది.