
సియోల్: కరోనా వైరస్ ను సమర్థంగా ఎదుర్కొన్నారంటూ ఉత్తర కొరియా ప్రెసిడెంట్ కిమ్ జోంగ్ ఉన్ చైనా ప్రెసిడెంట్ జీ జిన్ పింగ్‌పై ప్రశంసలు కురిపించారు. ఈ మేరకు కిమ్ చైనా అధ్యక్షడికి సందేశం పంపినట్లు ఉత్తర కొరియా అధికారిక మీడియా శుక్రవారం తెలిపింది. ‘‘కిమ్ జోంగ్ ఉన్ తన మౌఖిక సందేశంలో జిన్‌పింగ్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. కరోనాకు వ్యతిరేకంగా పోరాటంలో విజయం సాధించారని అభినందించారు” అని కొరియా సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. జిన్ పింగ్ ఆరోగ్యంగా ఉండాలని, ఆయన మార్గదర్శకత్వంలో చైనా పార్టీ, ప్రజలు ఈ విజయాన్ని కొనసాగిస్తారని కిమ్ ఆకాంక్షించినట్లు తెలిపింది. చైనాలో కరోనా ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు ఉత్తర కొరియా బోర్డర్లను మూసివేసింది. దీంతో అక్కడ కరోనా ప్రభావం ఎలా ఉందనేది ఎవరికీ తెలియడంలేదు. కానీ, కొరియా ప్రభుత్వం మాత్రం కరోనా ఫ్రీ కంట్రీ అని ప్రకటించుకుంది.